Krishna Kumari : కోపం వచ్చినా ఒక మూల కూర్చుని జుట్టు పీక్కుంటూ ఏడ్చేది తప్పితే..!

ABN , First Publish Date - 2023-03-06T11:56:37+05:30 IST

అక్కను మించిన పేరూ, అవకాశాలను దక్కించుకున్న రాకుమారి మన కృష్ణ కుమారి మాత్రమే.

Krishna Kumari : కోపం వచ్చినా ఒక మూల కూర్చుని జుట్టు పీక్కుంటూ ఏడ్చేది తప్పితే..!
Krishna Kumari

చిత్రసీమకు ఎందరో రాణులు.. ఎందరో రాజులు.. వచ్చారు ఏలారు, ఏనుగు అంబారీపై స్వర్గానికి తిరిగి ప్రయాణం కట్టారు కూడా. అయితే అందులో కొందరిని, కొన్ని మార్లు, మరి కొందరిని పదేపదే తలంపుకు తెచ్చుకోవడం ప్రేక్షకుడి మంచి అలవాటు. తెలుగు చిత్రసీమలో అక్కాచెల్లెళ్ళుగా ఎందరో అలరించారు. అయితే అందులో అక్కను మించిన పేరూ, అవకాశాలను దక్కించుకున్న రాకుమారి మన కృష్ణ కుమారి మాత్రమే. నిజంగానే తెరమీద ఆమె ఒక రాకుమారి. కళ్ళతోనే భావాలను అలవోకగా పలికించే మన కృష్ణకుమారి పుట్టినరోజు ఈరోజు. నాయికగా అరుదైన విజయాలను అందుకున్న కృష్ణకుమారి గురించి కొన్ని కబుర్లు..

నాటి మేటి హీరోల సరసన చక్కగా ఇమిడిపోయి వారికి తగ్గట్టుగా నటనను పండించడంలో అందెవేసిన చేయి కృష్ణకుమారిది. ఏమీ తెలియని అమాయకపు ముఖానికి, అందంగా తీర్చి దిద్దిన కళ్ళు ఎన్నో భావాలను తెలిపేవి. ఓ కుటుంబంలో పెద్దకూతురు ఎంత ఒద్దికగా, మన్ననగా ఉండాలో అలాంటి పాత్రల్లో అచ్చం కుదురైన ఆడపిల్లగా కృష్ణకుమారి నటన నప్పేసేది. అందుకే ఆమె నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అలాగే అగ్రహీరోల సరసన నటించే అవకాశాలూ ఆమెకు అలానే వచ్చాయి. టాప్‌స్టార్స్‌తోనే కాదు.., అప్‌కమింగ్ హీరోలతోనూ.. చాలా సినిమాలు చేసింది.

కృష్ణకుమారి తండ్రి వెంకోజీరావు, తల్లి శచీదేవి వీరికి ముగ్గురు కూతుళ్ళు. మొదటి కూతురు కూడా రెండు సినిమాల్లో నటించింది, అయితే చిన్నవయసులోనే ఆమె చనిపోయింది.ఇక మన షావుకారు జానకి గురించి వేరే చెప్పక్కరలేదు. తన తరువాత పుట్టిందే కృష్ణకుమారి, కలకత్తాలో నివసించే సమయంలోనే కృష్ణకుమారి పుట్టింది. వెంకోజీరావు ఆంధ్రా పేపర్ మిల్లులో పేపర్ ఎక్స్ పర్ట్‌గా వర్క్ చేసేవారు. కృష్ణకుమారి పుట్టిన తరువాత కుటుంబం మొత్తం రాజమండ్రి షిఫ్ట్ అయ్యారు.

ఇది కూడా చదవండి: ఆ ఉద్యమంలో పాల్గొన్నందుకే.. ఆరునెలల జైలు శిక్ష అనుభవించింది..!

కృష్ణకుమారి చాలా సైలెంట్..

కృష్ణకుమారి చాలా సైలెంట్. అక్క జానకి ఎప్పుడూ చలాకీగా ఉంటే, మన కృష్ణకుమారి మాత్రం తన పని తాను చేసుకుంటూ ఉండేది. ఒకవేళ కోపం వచ్చినా ఒక మూల కూర్చుని జుట్టు పీక్కుంటూ ఏడ్చేసేది తప్పితే, తిరిగి తగాదాపడే రకంకాదు. అక్కాచెల్లెళ్ల చదువు సగం రాజమండ్రి, సగం చెన్నైలో జరిగింది. కాలేజ్‌లో అందరూ కృష్ణకుమారిని ముద్దుగా “మూగమ్మాయ్” అని పిలిచేవారట.

చెన్నై నుంచి వలసరావడం, తండ్రి ఇంగ్లాండ్‌లో మూడేళ్లపాటు ఉండడంతో ఇంట్లో అందరూ ఇంగ్లీష్‌లోనే మాట్లాడేవారట. అయితే.. పిల్లలకి తెలుగు మాట్లాడడం రావడంలేదని, ఒక మాష్టారును ఇంటికి పిలిపించి మరీ ట్యూషన్ చెప్పించేవారట తండ్రి వెంకోజీరావు. ఇక అక్కయ్య షావుకారు జానకి నాట్యం నేర్చుకునేప్పుడు కృష్ణకుమారి కూడా కాలికి గజ్జె కట్టుకొని ఆడేది. ఆ మక్కువతోనే పట్టుగా సి.పుల్లయ్య దగ్గర తనుకూడా నాట్యం నేర్చుకుంది కృష్ణకుమారి. అక్క జానకి పెళ్ళి సమయంలో కృష్ణకుమారి నాట్య ప్రదర్శన కూడా ఇచ్చింది. సి.పుల్లయ్య జెమిని స్టూడియోలో డైరెక్టర్‌గా వర్క్ చేయడంతో, ఆ విధంగా కృష్ణకుమారి జెమినిలోకి ఎంటర్ అయింది.

నటనలోనూ అక్కతో పోటీనే..

ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించింది కృష్ణకుమారి. అక్క జానకి కన్నా కూడా ఆమె నటనలో ఏదో కొత్తదనం ఉండేది. అమాయకత్వంతోనే ముఖంలో భావాలు పలికించి మెప్పించేది. ఇక 'పాతాళభైరవి' సినిమాలో గంధర్వకాంతగా కనిపిస్తుంది కృష్ణకుమారి. అటుపైన ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎంజీఆర్, రాజ్ కుమార్, శివాజీ గణేషన్, జగ్గయ్య ఇలా అప్పటి అగ్రహీరోలందరి సరసనా దాదాపు 130 సినిమాల్లో నటించింది. తమిళంలో ముఫ్పై సినిమాల వరకూ నటించింది.

kishna-kumari.jpg

మచ్చు తునకలు..

తెలుగు సినిమా తెరకు 1951లో నిర్మించిన నవ్వితే నవరత్నాలు సినిమా ద్వారా పరిచయం అయింది. కానీ దానికంటే ముందు మంత్రదండం అనే సినిమా విడుదలైంది. తొలి చిత్రంలో నటిస్తుండగానే ఆమెకు 14 సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అప్పటికి ఆమె వయసు కేవలం 16 ఏళ్ళు. తర్వాత 1953లో తాతినేని ప్రకాశరావు యన్.ఎ.టి.వారి పిచ్చి పుల్లయ్యలో కథానాయిక వేషం వేయించారు. అందులో మంచి నటన ప్రదర్శించిన కృష్ణకుమారికి పినిశెట్టిగారి పల్లె పడుచు, బంగారు పాప వంటి మంచి చిత్రాలతో పరిశ్రమలో మంచి గుర్తింపు వచ్చింది. ఆపైన చేసిన కులగోత్రాలు, చదువుకున్న అమ్మాయిలు, డాక్టర్ చక్రవర్తి, అంతస్తులు, చిక్కడూ దొరకడు, బందిపోటు, మానవుడు దానవుడు.. విజయవంతమైన చిత్రాలలో తనదైన నటనను చూపించింది కృష్ణకుమారి.

అవార్డుల పంట..

నటిగా కృష్ణకుమారి అనేక అవార్డులను కూడా పొందింది. మూడుసార్లు జాతీయ అవార్డులు, రాష్ట్రస్థాయిలో నంది అవార్డులు వచ్చాయి. ఈమె కాంచనమాల, సావిత్రి, ఎన్టీయార్ అవార్డులు గెలుచుకున్నది. బ్రిటన్‌లోని బర్మింగ్ హాం సంస్థ, లైఫ్ టైం అచీవ్‍ట్ అవార్డు ఇచ్చి సత్కరించింది. చిన్నప్పటినుండి భానుమతి అంటే ఇష్టం కారణంగా, ఆమెతో కలిసి కులగోత్రాలు, పుణ్యవతి సినిమాల్లో నటించినప్పుడు చాలా ఆనందంగా అనిపించిందని పలు సందర్భాలలో చెప్పింది కృష్ణకుమారి.

వివాహం విరామం..

తెలుగు తెరమీద అగ్ర కథానాయికగా వెలుగు వెలిగిన కృష్ణకుమారి వివాహం బెంగుళూరుకు చెందిన అజయ్ మోహన్‌తో అయింది. వీరికి ఓ కుమార్తె. అయితే పెళ్ళి తరవాత కాస్త విరామం తీసుకుంది. అడపాదడపా తెర మీద కనిపించిందీ తక్కువే. కూతురు దీపిక తన తల్లి జీవిత చరిత్ర ఆధారంగా 'మై మదర్ కృష్ణకుమారి' అనే పుస్తకాన్ని ప్రచురించింది.

Updated Date - 2023-03-06T12:02:43+05:30 IST