20సెకెన్లలో పరీక్ష 2సెకెన్లలో ఫలితం.. ఫారిన్ డాక్టర్ లకు కూడా దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు మనోడు...

ABN , First Publish Date - 2023-01-17T11:54:25+05:30 IST

గంటల నుండి రోజులు ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా ఎంతో సులభంగా టెస్ట్ అయిపోయేలా..

20సెకెన్లలో పరీక్ష 2సెకెన్లలో ఫలితం.. ఫారిన్ డాక్టర్ లకు కూడా దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు మనోడు...

ఏ హాస్పిటల్ కు వెళ్ళినా కనీసం చిన్నపాటి టెస్ట్ ల కోసమైనా చాలా సేపు వెయిట్ చెయ్యాల్సి ఉంటుంది. రక్తం, మూత్రం ఆధారిత పరీక్షల ఫలితాలు ఇవ్వడానికి అయితే కనీసం 24 గంటల నుండి 48గంటలు కూడా తీసుకుంటారు కొన్ని ప్రాంతాలలో.. అయితే ఈ డాక్టర్ మాత్రం కేవలం 20 సెకెన్లలో పరీక్ష పూర్తిచేసి 2 సెకెన్లలో ఫలితాన్ని ఇచ్చే పరికరాన్ని కనుగొన్నాడు. దీన్ని చూసి ఫారిన్ డాక్టర్లకే దిమ్మతిరిగిపోతోంది. ఇంతకూ ఎవరు ఈ డాక్టర్? ఆయన కనిపెట్టిన పరికరం కథేంటి తెలుసుకుంటే..

మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ లో ఎంజియమ్ మెడికల్ కాలేజ్ కు చెందిన డాక్టర్ పంకజ్ పరాశర్ ఈ సరికొత్త పరికరాన్ని తయారుచేసాడు. కిడ్నీ, గుండె సంబంధ సమస్యలు, రిస్క్ తో కూడుకున్న ప్రెగ్నెన్సీ మొదలయిన సమస్యలను గుర్తించడంలో యూరిన్ టెస్ట్ చాలా కీలకపాత్ర పోషిస్తుంది. ఈ టెస్ట్ ను కేవలం 20సెకెన్లలో పూర్తిచేసే పరికరాన్ని డాక్టర్ పంకజ్ కనుగొన్నారు. ఈయన 7సంవత్సరాలు కష్టపడి ఆ పరికరాన్ని తయారుచేసారట.

అక్క సమస్యే మూలకారణం

డాక్టర్ పంకజ్ ఢిల్లీ యూనివర్సిటీలో పి.హెచ్.డి చేయడానికి వెళ్ళినపుడు అతని కుటుంబంలో ఓ సమస్య ఏర్పడింది. ఆ సమయంలో అతని అక్క గర్భవతి. సహజంగానే గర్బవతులలో రక్తపోటు అధికంగా ఉంటుంది. అదే సమయంలో గరిష్టస్థాయిలో మూత్రంలో ప్రొటీన్ కోల్పోయే అవకాశాలు ఉంటాయి. దీన్ని ఎప్పటికప్పుడు గమనించుకోవాలి. లేకపోతే అది గర్భవతులకు రిస్క్ గా మారే ప్రమాదం ఉంటుంది. ఈ పరీక్ష సులభంగా, తక్కువ సమయంలో చేసుకోగలిగితే బాగుంటుందనే ఆలోచనే డాక్టర్ పంకజ్ ను ఈ మూత్రపరీక్ష పరికరం తయారు చేసేందుకు దోహదం చేసింది.

ఈ పరికరంను 7 సంవత్సరాలపాటు సుమారు మూడున్నర కోట్ల రూపాయలు వెచ్చించి తయారు చేసినట్టు పంకజ్ తెలిపారు. దీంట్లో 60శాతం ప్రభుత్వ సహాయం అందిందట. సేకరించిన మూత్రాన్ని ఈ పరికరంలో వేయడం నుండి సెట్టింగ్స్ చేయడం వరకు 20 సెకెన్లలో అయిపోతుందట. తరువాత దీని ఫలితం కేవలం 2సెకెన్లలో వచ్చేస్తుందని, ఈ ఫలితం 95శాతం కచ్చితత్వాన్ని కలిగి ఉందని పంకజ్ తెలిపారు. ఈ పరికరం గురించి తెలిసి ఇందులోపెట్టుబడులు పెట్టడానికి ఫారిన్ సంస్థలు డాక్టర్ పంకజ్ దగ్గరకు క్యూ కడుతున్నాయిప్పుడు. ఏది ఏమైనా మన భారతీయ డాక్టర్ భళా అనిపించాడు.

Updated Date - 2023-01-17T11:56:02+05:30 IST