IAS: ఇదికదా పట్టుదల అంటే... అనాధాశ్రమ విద్యార్థి ఐఏఎస్‌ ర్యాంకర్‌

ABN , First Publish Date - 2023-05-28T12:42:38+05:30 IST

తండ్రి అకస్మిక మృతితో బాల్యంలోనే అనాధాశ్రమంలో చేరి ఎందరో సహ కారంతో యూపీఎస్‌సీ(UPSC) పరీక్షల్లో 478వ ర్యాంకును సాధించారు

IAS: ఇదికదా పట్టుదల అంటే... అనాధాశ్రమ విద్యార్థి ఐఏఎస్‌ ర్యాంకర్‌

బంగారపేట(చెన్నై): తండ్రి అకస్మిక మృతితో బాల్యంలోనే అనాధాశ్రమంలో చేరి ఎందరో సహ కారంతో యూపీఎస్‌సీ(UPSC) పరీక్షల్లో 478వ ర్యాంకును సాధించారు మనోజ్‌ కుమార్‌. ముళబాగిలులోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆర్ఫన్‌ ఎడ్యుకేషనల్‌ చారిటబుల్‌ ట్రస్టుకు అనుబంధంగా ఉండే అనాధాశ్రమంలో ఉంటూ అక్కడే విద్యాభ్యాసం కొనసాగించారు. మనోజ్‌ చిత్తూరు జిల్లాకు చెందినవారు. బాల్యంలో కుటుంబీకులు లేకపోవడంతో అనాధాశ్రమంలో చేరాల్సి వచ్చింది. బాల్యంలోనే చురుగ్గా ఉండే మనోజ్‌కుమార్‌ను ట్రస్టు వ్యవస్థాపకురాలు చిన్మయి ప్రత్యేక శ్రద్ధ చూపారు. మనోజ్‌ ఎస్‌ఎస్‌ఎల్‌సీ దాకా కన్నడ మీడియంలో చదివి ఆ తర్వాత కోలారులో సైన్స్‌లో పీయూసీ పూర్తి చేశాడు. బెంగళూరులో బీసీఏ ముగించాడు. హైదరాబాద్‌లోని లా ఎక్సలెన్స్‌ సెంటర్‌లో యూపీఎస్‌సీలో శిక్షణ పొందాడు. ఇదే సందర్భంలోనే ముళబాగిలు నగరసభలో టెక్నికల్‌ ఆపరేటర్‌గా ఉద్యోగాన్ని పొందాడు. యూపీఎస్‌సీ పరీ క్షల్లో కన్నడ, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ సబ్జెక్టులను ఎంచుకున్నారు. తొలి ప్రయత్నంలోనే 478వ ర్యాంకు పొందారు. ఈ సందర్భంగా మనోజ్‌కుమార్‌ మాట్లాడుతూ.. ముళబాగిలు నగరసభలో ఉద్యోగంలో కొనసాగుతూనే కొవిడ్‌ వేళ యూపీఎస్‌సీ పరీక్షలు రాయాలని తీర్మానించానన్నారు. రోజుకు 8 గంటలకు పైగా చదివేవాడినని, కోచింగ్‌ సెంటర్‌కు వెళ్లాక మరింత అనుభవం పొందా నన్నారు. ఐఏఎస్‌ కావాలన్నది తన లక్ష్యమని, ప్రస్తుత ర్యాంకుతో సంతృప్తి చెం దలేదన్నారు. మరోసారి పరీక్షలు రాస్తానన్నారు. నా సాధనకు ట్రస్టు వ్యవ స్థాపకురాలు చిన్మయి స్ఫూర్తి అన్నారు. చదువుకునేందుకు బాల్యం నుంచి ప్రోత్సహించారని, యూపీఎస్‌సీ పరీక్షలకు వెళ్లేందుకు ప్రేరణగా నిలి చారన్నారు. నన్నుబిడ్డలా చూసిన చిన్మయికి జీవితాంతం రుణపడి ఉంటా నన్నారు. ఆమె యూపీఎస్‌సీ పరీక్షలు రాయాలని భావించారని నా చేత సాధ్యం చేయించారన్నారు. ఇదే సందర్భంగా ట్రస్టు వ్యవస్థాపకురాలు చిన్మయి మాట్లాడుతూ మనోజ్‌కుమార్‌ అనాధ కాదని బాల్యంలో మా చెంతకు వచ్చి నప్పుడే దత్తత తీసుకున్నానన్నారు. నా సొంత కొడుకులాగే భావించా నన్నారు. చదువుకునేందుకు అతడికి పట్టుదల ఉండేదని, మేం సహకరించామన్నారు.

Updated Date - 2023-05-28T12:42:38+05:30 IST