Agra: రైలు పట్టాలపై కూర్చుందో యువతి.. కాస్త దూరంలో ఉన్న రైల్వే ఉద్యోగికి డౌట్.. చివరకు జరిగిందేంటంటే..

ABN , First Publish Date - 2023-01-26T18:39:20+05:30 IST

ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించిన ఓ యువతిని రైల్వే గ్యాంగ్‌మన కాపాడిన ఘటన ఆగ్రాలో తాజాగా వెలుగు చూసింది.

Agra: రైలు పట్టాలపై కూర్చుందో యువతి.. కాస్త దూరంలో ఉన్న రైల్వే ఉద్యోగికి డౌట్.. చివరకు జరిగిందేంటంటే..

ఇంటర్నెట్ డెస్క్: తన పనిలో నిమగ్నమై ఉన్నాడో రైల్వే గ్యాంగ్‌మన్(Gangman).. ఇంతలో ఆయనకు ఓ యువతి కనిపించింది. రైలు పట్టాలపై కూర్చున్న ఆమెను చూడగానే ఆయన మనసు ఏదో కీడు శంకించింది. వెంటనే రంగంలోకి దిగిన ఆయన ఎంతో ప్రయాసకోర్చి ఆమెను కాపాడారు. మంగళవారం ఆగ్రాలో ఈ ఘటన వెలుగు చూసింది.

ఆగ్రా రైల్వే డివిజన్(Agra Railway division) పీఆర్‌ఓ చెప్పిన వివరాల ప్రకారం.. మంగళవారం గ్యాంగ్‌మన్ కమలేశ్‌.. సికంద్రా గురు కా తాల్ ఫ్లైఓవర్ వద్ద ఉన్న పట్టాలను తనిఖీ చేస్తుండగా ఓ యువతి ఆయన కంట పడింది. పట్టాల మధ్యలో కూర్చుకున్న ఆమెను చూడగానే అలర్టైన ఆయన ఆమెను పలకరించారు. పట్టాలపై కూర్చోవడం క్షేమం కాదని ఆమెకు చెప్పినా యువతి అక్కడి నుంచి కదలలేదు. తాను ఆత్మహత్య చేసుకునేందుకు వచ్చానని ఆమె చెప్పడంతో కమలేశ్ అవాక్కయ్యారు. చివరకు ఆమెను బలవంతంగా పక్కకు తీసుకొచ్చారు. ఆ వెంటనే ఆమె చేయి విడిపించుకుని మళ్లీ వెళ్లి పట్టాలపై కూర్చుకుంది. మరోవైపు..ఫ్లైఓవర్‌పై నిలబడ్డ కొందరు ఈ దృశ్యాలన్నీ వీడియోలో రికార్డు చేయడంతో అవి సోషల్ మీడియా బాట పట్టి వైరల్‌ అయ్యాయి.

అప్పటికే అక్కడకు చేరుకున్న పోలీసుల సాయంతో కమలేశ్ ఆ యువతిని పట్టాల పక్కకు తీసుకొచ్చి రక్షించారు. కాగా.. కుటుంబంలో వివాదాలు భరించలేకే ఆత్మహత్య చేసుకునేందుకు వచ్చానని ఆమె పోలీసులకు చెప్పింది. యువతికి అప్పటికే ఓ బిడ్డ కూడా ఉంది. బిడ్డను తన అత్తగారికి అప్పగించిన ఆమె పనిమీద వెళుతున్నానంటూ ఆత్మహత్య చేసుకునేందుకు కాలు బయటపెట్టింది. కాగా..యువతిని రక్షించడంలో చొరవ చూపించిన కమలేశ్‌ను ఆగ్రా రైల్వే డివిజన్ పీఆర్‌ఓ అభినందించారు.

Updated Date - 2023-01-26T18:45:12+05:30 IST