Global Day to End Child Sexual Abuse : కుష్బూనే కాదు.. పాపం ఇలా ఎందరో..!

ABN , First Publish Date - 2023-04-11T15:46:12+05:30 IST

ఇలాంటి కారణాలతోనే తమపై జరిగిన లైంగిక వేధింపులను బాల్యం దాటినా కూడా కుటుంబంలో చీలికలు రాకూడదనే ఉద్దేశ్యంతో దాచేవారూ ఉన్నారు.

Global Day to End Child Sexual Abuse : కుష్బూనే కాదు.. పాపం ఇలా ఎందరో..!
Child Sexual Abuse

పిల్లలపై జరుగుతున్న లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా పోరాడటానికి కలిసి రావాలనుకునే ఉద్దేశ్యంతో ది ఇన్నోసెన్స్ రివల్యూషన్ ప్రారంభమైంది. ప్రపంచ వ్యాప్తంగా పిల్లలపై జరుగుతున్న లైంగిక వేధింపుల గురించి ప్రతి ఒక్కరిలోనూ అవగాహన కల్పించే సదుద్దేశంతో ఏప్రిల్ 11ను 'Global Day to End Child Sexual Abuse Day' ఈ సంస్థ ప్రకటించింది. చిన్నారులను లైంగికంగా హింసించి చిదిమేయడం వంటి ఘటనలు మన చుట్టూ రోజులో కోకొల్లలు.

అయితే ప్రతి ఒక్కరూ తాము బాల్యంలో ఎదుర్కొన్న లైంగిక వేధింపుల చేదు అనుభవాల గురించి పైకి చెప్పడం తక్కువ. బయటకు చెప్పకుండా లోలోపలే చేదు జ్ఞాపకాలను దాచేసి లోకానికి, సంఘానికి తలొంచి జీవిస్తూ ఉంటారు. దీనికి ప్రధాన కారణం సంఘంలోని వ్యక్తులు తమని అవమానిస్తారేమోననే భయంతో కొంత. ఇలాంటి సంఘటనలు బయటకు చెప్పడం పరువు తక్కువని కొంత భావిస్తారు. ముఖ్యంగా బాల్యంలో జరిగే లైంగిక దాడులన్నీ బాగా తెలిసిన కుటుంబ సభ్యుల మధ్యనే జరుగుతాయి. ఎవరు మంచివారు, ఏది మంచిది అనే విషయంలో సరైన అంచనా వేయలేని చిన్నతనంతో పిల్లలు దగ్గరివారి చేతిలోనే లైంగిక వేధింపులకు గురవుతూ ఉంటారు.

ఈ మధ్య కాలంలో నటి కుష్బు సంఘటననే తీసుకుంటే..

యాభై రెండేళ్ళ కుష్బూ తన బాల్యంలో తండ్రి తనపై చేసిన లైంగిక అకృత్యం గురించి బయటకు చెప్పింది. ఆ వయసులో తండ్రిని ఎదిరించే ధైర్యం లేక కుమిలిపోయన తను ఇన్నేళ్ళకు తన జీవితంలో జరిగిన అమానవీయ సంఘటనను బయటి ప్రపంచానికి చెప్పుకొచ్చింది. ఇలా చెప్పడం వల్ల ఇన్నేళ్లుగా తను మోస్తున్న భారాన్ని దింపుకున్నట్లుగా ఉందని చెప్పింది. అమ్మాయి అయినా, అబ్బాయి అయినా చిన్న వయసులో ఎదుర్కొనే వేధింపులు జీవితాంతం వారిని వెంటాడుతూనే ఉంటాయి. తన తండ్రి తనపై చూపించిన వేధింపులను తల్లికి గానీ, తోబుట్టువులకు గానీ చెప్పలేకపోయింది.

ఇది కూడా చదవండి: వేసవిలో ప్రతిరోజూ సన్‌స్క్రీన్‌ని బయటకు వెళ్ళినప్పుడే అప్లై చేస్తున్నారా? అయితే చర్మ సమస్యలు మామూలేనట..!

తను ఎదురుతిరిగితే, ఆ కోపాన్ని తండ్రి ఎక్కడ మిగతావారిపై చూపిస్తాడోననే భయంతో మౌనంగా ఉండిపోయానని చెప్పుకొచ్చింది. తరచి చూస్తే ఇలాంటి సంఘటనలు ఎన్నో, అయితే ఇక్కడ మరో విషయం ఏంటంటే కుష్బూ ఎప్పుడో ఎనిమిదేళ్ళ వయసులో జరిగిన సంఘటనను తనకు 52 ఏళ్ళు వచ్చాకా బయట పెట్టడం వెనుక కూడా చాలా దుమారం రేగింది. కుటుంబం పరువు తీసిందని దెప్పిపొడిచినవారూ ఉన్నారు.

ఇలాంటి కారణాలతోనే తమపై జరిగిన లైంగిక వేధింపులను బాల్యం దాటినా కూడా కుటుంబంలో చీలికలు రాకూడదనే ఉద్దేశ్యంతో దాచేవారూ ఉన్నారు. భయంతో, అమాయకత్వంతో చెప్పలేని చిన్నారులూ ఉన్నారు. ఇంటి గౌరవాన్ని పాడు చేయకూడదని బాధను మోస్తున్నవారు ఉన్నారు. పిల్లలపై జరిగే లైంగిక వేధింపుల గురించి అవగాహన కల్పించడానికి, అలాంటి దురాగతాలకు అడ్డుకట్ట వేయడానికి 'ది ఇన్నోసెన్స్ రివల్యూషన్' అనే సంస్థ ముందడుగు వేసింది.

Updated Date - 2023-04-11T16:00:19+05:30 IST