Google: జీవితాన్ని ఆస్వాదించండి.. పని కోసం బతక్కండి.. గూగుల్ మాజీ ఉద్యోగి హితబోధ..

ABN , First Publish Date - 2023-01-21T21:36:45+05:30 IST

దాదాపు16 ఏళ్ల పాటు గూగుల్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేసి ఇటీవలే జాబ్ పోగొట్టుకున్న జస్టిన్ మూర్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Google: జీవితాన్ని ఆస్వాదించండి.. పని కోసం బతక్కండి.. గూగుల్ మాజీ ఉద్యోగి హితబోధ..

ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల గూగుల్‌లో ఉద్యోగాలు కోల్పోయిన వారు(Google Layoffs) తమకు ఎదురైన అనుభవాల్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దాదాపు 16.5 ఏళ్ల పాటు గూగుల్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేసి ఇటీవలే జాబ్ పోగొట్టుకున్న జస్టిన్ మూర్(Justin Moore) సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఉద్యోగం పోయిన విషయం తనకు ఎలా తెలిసిందో కళ్లకు కట్టినట్టు వివరించిన అతడు.. ‘‘జీవితాన్ని ఆస్వాదించండి.. పని కోసం బతక్కండి..’’ అంటూ లింక్డిన్(LinkedIn) వేదికగా హితబోధ చేశాడు.

తన ఉద్యోగం ఎలా పోయిందో చెబుతూ జస్టిన్ మూర్ ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. ‘‘దాదాపు 16.5 ఏళ్లు గూగుల్‌లో పనిచేశాక నన్ను ఉద్యోగం నుంచి తీసేశారు. తెల్లవారు జామున 3.00 గంటలకు వచ్చిన ఓ ఆటోమేటిక్ మెసేజ్‌తో జాబ్ పోయిన విషయం తెలిసింది. దీంతో.. వాళ్లకు మళ్లీ ఫోన్ చేసే అవకాశం కూడా లేకపోయింది. జాబ్ పోగొట్టుకున్న 12 వేల మందిలో నేనూ ఒకడిని. అయితే.. గూగుల్‌లో నా ఉద్యోగం అద్భుతంగా ఉండేది. నేను, నా టీం సభ్యులు చేసిన పనికి నేనెంతో గర్విస్తున్నా. ఇక.. గూగుల్ లాంటి పెద్ద సంస్థల్లో ఉద్యోగులకు పెద్ద ప్రాముఖ్యత ఉండదు. తప్పదనుకుంటే వెంటనే తొలగించేస్తారు. జీవితాన్ని ఆస్వాదించండి.. పని కోసమే బతక్కండి. ఈ ఉదంతం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఇదే’’ అంటూ తన పోస్టులో రాసుకొచ్చారు. మొత్తం 12 వేల మందిని తొలగించేందుకు గూగుల్ మాతృసంస్థ ఆల్ఫబెట్(Alphabet) నిర్ణయించిన విషయం తెలిసిందే. అమెరికాలో ఈ తొలగింపులు తక్షణం అమల్లోకి రాగా.. ఇతర దేశాల్లో అక్కడి చట్టాలను అనుసరించి తొలగింపు పర్వం కొనసాగుతోంది.

Updated Date - 2023-01-21T21:36:50+05:30 IST