Visakhapatnam: లాక్‌డౌన్‌లో ఈమెకొచ్చిన ఆలోచనతో ఇప్పుడు నెలకు రూ.80 వేలకు పైగానే సంపాదన..!

ABN , First Publish Date - 2023-02-16T12:13:08+05:30 IST

ఫార్ములేషన్‌లను పరీక్షించేటప్పుడు దాదాపు రూ. 1 లక్ష నష్టాన్ని ఎదుర్కోవలసి వచ్చింది.

Visakhapatnam: లాక్‌డౌన్‌లో ఈమెకొచ్చిన ఆలోచనతో ఇప్పుడు నెలకు రూ.80 వేలకు పైగానే సంపాదన..!
Business Woman

కరోనా వల్ల ఎందరో ఉపాధిని కోల్పోయారు. మరికొందరు చాలీచాలని జీతాలతో బ్రతకలేక సొంతంగా ఏదైనా చేయాలనే ఆలోచనతో కొత్త ఉపాధిని వెతుక్కుని నిలదొక్కుకున్నవారున్నారు. మామూలుగా అయితే పెళ్ళిళ్ళలోనూ, ఫంక్షన్స్‌లో భోజనాలు చేసాకా తిన్న ఫ్లాస్టిక్, కాయితంతో తయారుచేసిన ఫ్లేట్స్ కుప్పగా పారేస్తూ ఉంటారు. మరునాడు వాటిని పారిశుద్ధ్య కార్మికులు వచ్చి క్లీన్ చేయాల్సిందే.. అలా పర్యావరణానికి చేటు తెస్తున్న Disposable plates విధానాన్ని ఇంకాస్త ఆసక్తిగా పర్యావరణానికి హితంగా మార్చాలనుకుందీమె. ఆ ఆలోచనే తనని ఇదిగో ఇప్పుడు మనం చెప్పుకుంటున్న చదువు చెప్పే టీచరమ్మ ఒక సంస్థకు సి.ఇ.ఓ గా మారేలా చేసింది. మహిళలు తలుచుకుంటే సాధించలేనిది ఏదీలేదని నిరూపించిందీ ధీర మహిళ.

విషయంలోకి వెళితే..

‌ఆమె ఆంధ్రప్రదేశ్‌‌లోని విశాఖపట్నంలోని రేసపువానిపాలెంలోని తన చిన్న యూనిట్‌లో టీకప్పులను తినే విధంగా తయారుచేస్తుంది. పేరు జయలక్ష్మి తినే విధంగా కప్పులను తయారు చేయడం అనే ఆలోచన ఆమెను ఓ వ్యాపారవేత్తగా మార్చింది.. ఈ కప్పులను తయారుచేయాలనే ఆలోచన వచ్చినపుడు అందుకు వాడే పదార్థాల్లో కెమికల్ స్థాయిలు ఎక్కువగా ఉన్నాయని తెలుసుకుని కొత్తగా ఏదైనా చేయాలనుకుంది. ఈ ఆలోచనలోని భాగంగానే ఆరోగ్యకరమైన పదార్థాలతో మాత్రమే వ్యాపారం చేయగలిగితే సక్సెస్ అవగలమని అటుగా అడుగులువేసింది. తను తయారుచేసే వాటికి వేరే కెమికల్ మిశ్రమాలు కలవకుండా ఆరోగ్యకరమైన జాగ్రత్తలు కూడా తీసుకుంటుంది. అదెలాగంటే రాగులు, బియ్యం పిండి ప్రధాన పదార్ధాలుగా ఉపయోగిస్తుంది.

దీని గురించి జయలక్ష్మిని అడిగినపుడు...

కప్‌లను తయారుచేయాలని అనుకున్నప్పుడు రెండు నెలల పాటు చాలా సమాచారం సేకరించాను. వాటిని మిగతావాటికన్నా భిన్నంగా తయారుచేయాలని నిర్ణయించుకున్నాను. ఇదంతా లాక్‌డౌన్ సమయంలో వచ్చిన ఆలోచనే.

ఈరోజు దేశవ్యాప్తంగా ఆర్డర్లు రావడంతో ఈ తినే కప్పులకు భారీ డిమాండ్ ఉంది. నెలకు దాదాపు 3000 నుంచి 4000 వేల కప్పులు తయారు చేసే జయలక్ష్మి ఇప్పుడు ఏడాదికి 7 నుంచి 10 లక్షల రూపాయలు ఆదాయాన్ని సంపాదిస్తుంది. అనుకున్న వ్యాపారంలోకి అడుగుపెట్టి సక్సెస్ కావడం అనేది అందరికీ వీలుపడని విషయం. దానికి చాలా ఓపిక, సహనం కావాలి. కరోనాకు ముందు జయలక్ష్మి విశాఖపట్నంలోని ఓ ప్రేవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేసింది. అయితే 2020లో ఓ ప్రైవేట్ కంపెనీలో అకౌంట్స్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ఆమె భర్త శ్రీనివాస్‌రావు కాలేయ సంబంధిత వ్యాధికి గురయ్యాడు.

"నా భర్త శస్త్రచికిత్స తర్వాత బెడ్ రెస్ట్‌లో ఉన్నాడు. అతనిని చూసుకోవడానికి నా ఉద్యోగాన్ని వదిలివేయడం తప్ప నాకు వేరే మార్గం లేకపోయింది. కరోనా మహమ్మారి దేశాన్ని తాకిన సమయం. శస్త్రచికిత్స నుండి కోలుకుంటున్నప్పుడు, ఆయన మళ్ళీ COVID-19 బారిన పడ్డారు. ఇది మా కుటుంబానికి అత్యంత కష్టతరమైన సమయాల్లో ఒకటి” అని 33 ఏళ్ల జయలక్ష్మి గుర్తుచేసుకున్నారు.

“ఆ సమయంలో మేమిద్దరం నిరుద్యోగులం కాబట్టి, కుటుంబానికి ఆదాయ వనరు చాలా అవసరమయ్యయి. నిజానికి, ఒక వ్యాపారాన్ని ప్రారంభించడం గురించి నేను ఆలోచించేలా చేసిన పరిస్థితులవే,” వ్యాపారంలో ఎలాంటి అనుభవంలేని నేను, త్వరలోనే ఆచరణీయమైన వ్యాపార ఆలోచనలను వెతకడం ప్రారంభించాను. ప్రజలకు ఉపయోగపడే వాటిని వెతకడం మొదులపెట్టాను. ప్రతిరోజూ త్రాగే టీ, కాఫీ వంటి పానీయాలపై నా ఆలోచనలు తిరిగేవి. ఇలాగే ప్రజల రోజువారి ఆహారంలో భాగంగా ఉండే కప్పులను తయారు చేయాలనే ఆలోచన దగ్గర ఆగాను. ఇప్పటికే ఉన్న ప్లాస్టిక్, పేపర్, మట్టి కప్పుల మాదిరిగా కాకుండా స్థిరమైన కాన్సెప్ట్‌ యూట్యూబ్‌లో తినేవిధంగా టీ కప్పులను తయారు చేయాలనే ఆలోచన నన్ను ఆకర్షించింది. ఇక అదే నా వ్యాపారానికి మొదటి అడుగని చెప్పచ్చు. ప్రత్యేకత కోసం స్వంత ఉత్పత్తిని తీసుకురావడం మంచిదనిపించింది. వ్యాపారాన్ని ప్రారంభించేందుకు, మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్ (PMFME) ప్రధాన మంత్రి ఫార్మలైజేషన్ స్కీమ్ నుండి రుణం తీసుకున్నాను. అలాగే కొన్ని బంగారు ఆభరణాలను బ్యాంకులో తాకట్టు పెట్టాల్సివచ్చింది.

ఒకే మిశ్రమం కోసం దాదాపు 15 కిలోల ముడి పదార్థాలు అవసరం అవుతుంది. వివిధ ఫార్ములేషన్‌లను పరీక్షించేటప్పుడు దాదాపు రూ. 1 లక్ష నష్టాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. కానీ ఎట్టకేలకు, రెండు నెలల ప్రయోగం తర్వాత రాగులు, బియ్యం పిండిని ఉపయోగించి సరైన మిశ్రమాన్ని కనుక్కోగలిగాను. బెంగుళూరు, హైదరాబాద్ నుండి యంత్రాలను కొనుగోలు చేసాను. ఫిబ్రవరి 2021లో తయారీ యూనిట్‌ను ప్రారంభించానని నవ్వుతూ చెప్పింది జయలక్ష్మి.

1. టీ కప్పులు 20 నిమిషాల వరకు వేడి పానీయాన్ని కలిగి ఉండగలవని పేర్కొంది.

2. రాగులు,బియ్యం పిండి టీ కప్పులు రెండు వేర్వేరు పరిమాణాలలో వస్తాయి - 60 ml మరియు 80 ml - ధర రూ. 2.5 నుండి రూ. 3.5.

3. ఈ టీ కప్పులు చాక్లెట్, స్ట్రాబెర్రీ, వనిల్లా, ఇలాచి (ఏలకులు) వంటి విభిన్న రుచులలో కూడా అందుబాటులో ఉన్నాయి, ఈ రుచులు పానీయంలోకి దిగుతాయి కూడా. దీనితో తాగే వాటికి చక్కని రుచి వచ్చి చేరుతుంది.

4. జయలక్ష్మి తన ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో యూట్యూబ్ వీడియో ప్రచారం చేస్తుంది. ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా మార్కెటింగ్ చేస్తోంది.

5. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు, ఒడిశా, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాలతో సహా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆమెకు ఆర్డర్లు వస్తున్నాయి.

Updated Date - 2023-02-16T12:19:04+05:30 IST