UP: 8 ఏళ్ల క్రితం మిస్డ్‌కాల్‌తో మొదలైన కథ.. ఇన్నాళ్లకు వీడిన మర్డర్ మిస్టరీ.. ఎముకలే దొరికాయ్ కానీ..

ABN , First Publish Date - 2023-02-07T19:34:59+05:30 IST

ఎనిమిది ఏళ్ల క్రితం మొదలైన ఆ యువకుడి ప్రేమ కథ ఎనిమిది నెలల క్రితం విషాదాంతంగా ముగిసిపోయింది. ఇన్నాళ్లపాటు మిస్టరీగా మిగిలిపోయిన కేసును పోలీసులు ఛేదించారు.

UP: 8 ఏళ్ల క్రితం మిస్డ్‌కాల్‌తో మొదలైన కథ.. ఇన్నాళ్లకు వీడిన మర్డర్ మిస్టరీ.. ఎముకలే దొరికాయ్ కానీ..

ఇంటర్నెట్ డెస్క్: ఎనిమిది ఏళ్ల క్రితం మొదలైన ఆ యువకుడి ప్రేమ కథ ఎనిమిది నెలల క్రితం విషాదాంతంగా ముగిసిపోయింది. ఇన్నాళ్లపాటు మిస్టరీగా(Mystery) మిగిలిపోయిన కేసును పోలీసులు తాజాగా ఛేదించారు. బాధితుడి ఎముకలను చిన్న సరస్సు నుంచి వెలికితీశారు. యువకుడి కడచూపునకు కూడా నోచుకోని బాధిత కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదించారు. ఉత్తరప్రదేశ్‌లో(Uttarpradesh) వెలుగు చూసిన ఈ ఘటన తాలూకు వివరాలు ఇలా ఉన్నాయి.

నోయిడాకు(Noida) చెందిన రంజిత్ అనే యువకుడికి ఎనిమిదేళ్ల క్రితం ఓ మిస్డ్‌కాల్‌తో ఓ యువతి పరిచయమైంది. వారి మధ్య ఉన్న పరిచయం స్నేహంగా మారి చివరకు ప్రణయానికి దారితీసింది. యువతి స్వస్థలం ఘాజియాబాద్‌లోని(Ghaziabad) బంహెటా గ్రామం. కాగా.. చాలా కాలం పాటు వారిద్దరి బంధం కొనసాగింది. ఈ విషయం ఇరు కుటుంబాలకీ తెలుసు. అయితే.. పెళ్లి ప్రస్తావన వచ్చేసరికి రెండు కుటుంబాల మధ్య కులం పట్టింపు బయలు దేరింది. ఈ క్రమంలో వారి మధ్య వాదోపవాదాలు కూడా నడిచాయి.

ఈ క్రమంలో గతేడాది జూన్ 13న యువతి తన ప్రియుడిని పెళ్లి విషయాలు మాట్లాడుకుందామంటూ తన స్వగ్రామానికి పిలిచింది. ఆ తరువాత ఇంటికొచ్చిన ప్రియుడిని యువతి తరఫు వారు చంపేశారు. మృతదేహాన్ని పక్క గ్రామంలో ఉన్న ఓ కొలనులో పడేశారు. ఇటీవలే ఈ కేసును ఛేదించిన పోలీసులు మృతుడి ఎముకలను కొలను నుంచి వెలికి తీశారు. రంజిత్ జీవితం ఇలా దారుణంగా ముగిసిపోవడంతో అతడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. యువతి ప్రమేయంతోనే ఇదంతా జరిగిందని బాధితుడి కుటుంబసభ్యులు ఆరోపించారు. అతడి జీతం అంతా ఆమె కోసమే ఖర్చు చేసేవాడని వాపోయారు. అతడి డబ్బుతో ఆమె బోలెడన్ని నగలు కొనుక్కుందని ఆరోపించారు. ఇక బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చివరకు జరిగిన దారుణం వెలుగులోకి వచ్చింది. యువతి ప్రోద్బలంతోనే యువకుడి హత్య జరిగినట్టు పోలీసులు తేల్చారు. యువతితో పాటూ మొత్తం ఐదుగురి అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - 2023-02-07T19:35:00+05:30 IST