YSRTP : వైఎస్సార్టీపీ విలీనంపై డైలామాలో షర్మిల.. సాయంత్రం ఏం ప్రకటన చేయబోతున్నారు..!?

ABN , First Publish Date - 2023-09-30T12:36:59+05:30 IST

వైఎస్ఆర్‌ తెలంగాణ పార్టీ (వైఎస్‌ఆర్‌టీపీ).. కాంగ్రె‌స్‌లో విలీనానికి సర్వం సిద్ధమైందని నిన్న మొన్నటి వరకూ వినిపించినప్పటికీ అదేమీ జరగలేదు. ఇప్పటికీ వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల డైలామాలోనే ఉన్నారు...

YSRTP : వైఎస్సార్టీపీ విలీనంపై డైలామాలో షర్మిల.. సాయంత్రం ఏం ప్రకటన చేయబోతున్నారు..!?

వైఎస్ఆర్‌ తెలంగాణ పార్టీ (వైఎస్‌ఆర్‌టీపీ).. కాంగ్రె‌స్‌లో విలీనానికి సర్వం సిద్ధమైందని నిన్న మొన్నటి వరకూ వినిపించినప్పటికీ అదేమీ జరగలేదు. ఇప్పటికీ వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల డైలామాలోనే ఉన్నారు. పార్టీని విలీనం చేయాలంటే కొన్ని కండిషన్స్ పెట్టిన ఆమె.. డెడ్‌లైన్ కూడా విధించారు. షర్మిల విధించిన సెప్టెంబర్-30 డెడ్‌లైన్ ఇవాళ్టితో ముగియనున్నది. ఇవాళ సాయంత్రం ఆమె ఏం చేయబోతున్నారు..? కీలక ప్రకటన చేయబోతున్నారా..? లేకుంటే మరేం చేయబోతున్నారనే దానిపై సర్వత్రా ఆసక్తి.. అంతకుమించి అభిమానులు, పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.


sharmila.jpg

ఏం జరగబోతోంది..?

వాస్తవానికి.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కీలక నియోజకవర్గం అయిన పాలేరు అసెంబ్లీ నుంచి వైఎస్ షర్మిల పోటీ చేయాలని భావించారు. ఇప్పటికే నియోజకవర్గంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడం, వరుస పర్యటనలు చేశారు. తనతో పాటు మరో ఐదు లేదా ఆరుమందికి కీలక నేతలకు భాగంగా టికెట్లు ఇవ్వాలని షర్మిల కోరారన్నది విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆ మధ్య పాలేరు వీలుకాని పక్షంలో సికింద్రాబాద్ నుంచి పోటీచేయడానికి కూడా తాను సిద్ధంగానే ఉన్నానని షర్మిల చెప్పినట్లు కూడా వార్తలొచ్చాయి. ఎందుకంటే పాలేరు నుంచి పోటీచేయడానికి వైఎస్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు, కీలక నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి రంగం సిద్ధం చేసుకున్నారు. మొదటి జాబితాలో ఆయన పేరు కూడా ఉంటుందని టాక్ నడుస్తోంది. ఈ క్రమంలోనే ట్రబుల్ షూటర్, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో పాటు ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ పెద్దలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు పలువురు కీలక నేతలతో భేటీ అయ్యారు కూడా. ఈ భేటీల్లో డీకేతో పాటు కేసీ వేణుగోపాల్ కూడా పాల్గొన్నారు. అయితే షర్మిల డిమాండ్స్‌కు ఒప్పుకోకపోవడంతో కాంగ్రెస్‌తో తాడేపేడో తేల్చుకోవడానికి సెప్టెంబర్-30లోపు డెడ్‌లైన్ విధించారామె. ఇవాళే ఆఖరి రోజు. ఇంతవరకూ కాంగ్రెస్ పెద్దల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో సాయంత్రం 6 గంటలకు లేదా రాత్రి 8 గంటల ప్రాంతంలో లోటస్‌పాండ్ వేదికగా మీడియా మీట్ ఏర్పాటుచేసి కీలక ప్రకటన వెల్లడించే అవకాశం కనిపిస్తోంది.

sharmila-speed.jpg

ఆచితూచి అడుగులు!

మరోవైపు.. షర్మిల విషయంలో కాంగ్రెస్ పెద్దలు ఆచితూచి అడుగులేస్తున్నారు. వైఎస్సార్టీపీ విలీనాన్ని కొందరు వద్దని చెబుతుంటే.. మరికొందరు కీలక నేతలు మాత్రం కచ్చితంగా కాస్తో కూస్తో లాభం చేకూరుతుందని షర్మిల రాక మంచిదేనని చెబుతున్నారు. ఇలా మిశ్రమ స్పందన వస్తుండటం, మరోవైపు షర్మిల డిమాండ్స్‌.. దీంతో పాటు డెడ్‌లైన్ కూడా విధించడంతో వైఎస్సార్టీపీ విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ ఎటూ తేల్చలేకపోతోందని తెలియవచ్చింది. ఈ క్రమంలో ఒంటరిపోరుకు సిద్ధమవ్వాలని ఇటీవలే పార్టీ సమావేశంలో స్పష్టం చేశారు షర్మిల. ఇక కాంగ్రెస్‌ను నమ్ముకోనక్కర్లేదని.. సొంతంగా ఒంటిరిగానే అడుగులు వేయాలని కొందరు పార్టీ ముఖ్యనేతలు షర్మిలకు సూచించినట్లుగా తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. షర్మిలను మరో ఐదురోజులపాటు కాంగ్రెస్ పెద్దలు సమయం అడిగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

congress.jpg

ఇప్పటికే.. పార్టీ క్రమ శిక్షణ చర్యల వల్ల సస్పెండ్ అయిన వారిపై ఎత్తివేస్తూ షర్మిల నిర్ణయం తీసుకున్నారు. ఇక మీదట పార్టీ కోసం పని చేయాలని నేతలను, శ్రేణులకు షర్మిల దిశానిర్దేశం కూడా చేశారు. ఎన్నికలు తరుముకొస్తుండటంతో.. నేటి సాయంత్రం ప్రకటన తర్వాత ప్రజాక్షేత్రంలోకి వెళ్లడానికి వైఎస్ షర్మిల కార్యాచరణ ప్రకటించబోతున్నారని తెలిసింది. సాయంత్రం షర్మిల ఏం ప్రకటన చేస్తారో చూడాలి మరి.

dk.jpg

TS Politics : పొంగులేటి ‘పాలేరు’ నుంచి పోటీచేస్తే తుమ్మల పరిస్థితేంటి.. ఖమ్మం కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది..!?

Updated Date - 2023-09-30T12:41:34+05:30 IST