Visakhapatnam: కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలు అన్నట్లు.. స్టేజ్‌పై హిట్‌..బయట మాత్రం ఫట్‌ అనేలా సీన్..!

ABN , First Publish Date - 2023-03-11T13:15:37+05:30 IST

విశాఖలో ఏపీ ప్రభుత్వం నాలుగేళ్ల తర్వాత పెట్టుబడుల సదస్సు నిర్వహించింది. రెండు లక్షల కోట్ల నుండి అని లెక్క మొదలు ...

Visakhapatnam: కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలు అన్నట్లు.. స్టేజ్‌పై హిట్‌..బయట మాత్రం ఫట్‌ అనేలా సీన్..!

విశాఖ వేదికగా వైసీపీ ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో పరువు పోగొట్టుకుందా?.. లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామని పెద్దలు చెప్తుంటే.. అబ్బే అదేం లేదు.. అంతా తుస్సుమందని సొంత పార్టీ శ్రేణులే నిట్టూర్పుగా మాట్లాడుతున్నాయా?.. అతిథులకు గౌరవమేమో గానీ.. సొంతవారికే సరైన మర్యాద దక్కకుంకుండా పోయిందా?.. పెట్టుబడుల సదస్సులోని లోపాలు సొంత పార్టీ వారే బట్టబయలు చేస్తున్నారా?.. ఇంతకీ.. ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ హిట్టా?.. ఫట్టా?.. ఏపీ ప్రభుత్వ పెట్టుబడుల సదస్సులో అసలేం జరిగింది?...అనే మరిన్ని విషయాలను ఏబీఎన్ ఇన్‎సైడ్‎లో తెలుసుకుందాం..

Untitled-3305.jpg

స్టేజ్‌పై హిట్‌.. బయట మాత్రం ఫట్‌

విశాఖలో ఏపీ ప్రభుత్వం నాలుగేళ్ల తర్వాత పెట్టుబడుల సదస్సు నిర్వహించింది. రెండు లక్షల కోట్ల నుండి అని లెక్క మొదలు పెట్టింది. చివరికి.. 13 లక్షల కోట్లు అంటూ ముఖ్యమంత్రి జగన్‌ గ్రాండ్‌గా ప్రకటించి.. హడావుడిగా వెళ్లిపోయారు. ముఖేశ్‌ అంబానీ, అదానీ, మిట్టల్, ఒబరాయ్ లాంటి పెద్ద సంస్థలను మాత్రం తీసుకురాగలిగారు. అంతవరకు బాగానే ఉంది. కానీ.. స్టేజ్ మీద హిట్‌లా కనిపించినా.. బయట మాత్రం ప్లాప్ అనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలు అన్నట్లు.. పెట్టుబడుల సదస్సు నిర్వహణలో.. ఆయన తప్పితే ఇంకెవ్వరికీ చోటు లేదనే వైఖరిని మరోసారి ప్రదర్శించారనే విమర్శలు పెద్దయెత్తున వ్యక్తం అవుతున్నాయి.

Untitled-370528.jpg

అధికార యంత్రాంగాన్ని పక్కన పెట్టిన పెద్దలు

విశాఖలో భారీ పెట్టుబడుల సదస్సు నిర్వహిస్తున్నామంటూ ఢిల్లీ, హైదరాబాద్‌లాంటి నగరాల్లో ఊదరగొట్టారు. హడావుడి చేశారు. తీరా చూస్తే.. నిర్వహణ.. ఒక ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్‌లా ఉందని చెప్పుకొస్తున్నారు. నిజానికి.. ఈవెంట్ మొత్తాన్ని ఓ జాతీయస్థాయి మీడియా సంస్థకు అప్పగించారు. ఆ మీడియా సంస్థ.. అంతా తానై పనులు చేపట్టింది. దాంతో.. విశాఖలోనున్న మంత్రులకు, ముఖ్యంగా.. అమర్‌నాథ్ కూడా సమ్మిట్‌ పనులు గురించి తెలియని పరిస్థితి నెలకొంది. విశాఖ జిల్లాలోనున్న అధికార యంత్రాంగాన్ని కూడా పక్కన పెట్టినట్లే తెలుస్తోంది. అధికార యంత్రాంగానికి కనీస సమాచారం, గౌరవం ఇవ్వలేదంటే.. వారి పట్ల జగన్‌ ప్రభుత్వానికి ఎలాంటి అభిప్రాయం ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అంతేకాదు.. గతంలో వ్యాపార వర్గాలతో నిత్యం సంబంధం ఉండే.. సీఐఐకి సుమారుగా 3 కోట్ల బకాయిలు చెల్లించాలి. అవి చెల్లించమని అడిగినందుకు, ప్రస్తుత సమ్మిట్‌కు.. నామ్‌ కే వాస్తుగా పిలిచారు.. తప్పితే భాగస్వామిని చేయలేదు. హడావుడి, హంగామా కోసం ఇష్టం వచ్చినట్లు రిజిస్ట్రేషన్స్‌ చేశారు. దాని ద్వారా.. ఇబ్బందులు వస్తాయని.. కలెక్టర్, పోలీస్ కమీషనర్, జీవీఎంసీ కమీషనర్.. సమ్మిట్‌కు ముందు చెప్పినా పట్టించుకునే నాథుడే కరవయ్యారు.

Untitled-340585.jpg

పెట్టుబడుల సదస్సుకు రాకపోవడంతో ఆశ్చర్యం

ఇక.. వాళ్లందరినీ పక్కన పెడితే... నగరానికి ప్రథమ పౌరురాలైన.. విశాఖ మేయర్‌కు స్టేజ్‌పై సీటు లేకుండా పోయింది. గతంలో ప్రధాని వచ్చినప్పుడూ అదే పరిస్థితి. పెద్దయెత్తన విమర్శలు వచ్చినా.. పట్టించుకోలేదు.. మళ్లీ.. ఇప్పుడూ.. సేమ్‌ సీన్‌ రిపీట్‌ అయింది. క్యాబినెట్‌లో ఉన్న మంత్రుల్లో సగం మంది కూడా పెట్టుబడుల సదస్సుకు రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇక.. జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రికీ సీటులేదు. పరిశ్రమలశాఖ మంత్రికి సైతం ఎక్కడో వెనుక సీటు కేటాయించారు. అంతేకాదు.. సమ్మిట్ ఫ్లెక్సీల్లో ఒక్కచోట కూడా ఆ మంత్రి ఫొటో లేదు. సీనియర్ మంత్రిగా ఉన్న బొత్స సైతం సమ్మిట్‌కు హాజరు కాకపోవడం చర్చనీయాంశం అవుతోంది. అంతర్జాతీయ సదస్సు నిర్వహించినప్పుడు స్థానికంగా ఉన్న నేతలకు, అధికారులకు కనీస గుర్తింపు కూడా ఇవ్వలేదని, గతంలో మొత్తం అధికారులే నిర్వహించేవారని కొందరు నేతలు గుర్తు చేస్తుండడం జగన్‌ ప్రభుత్వానికి ఇబ్బందిగా మారుతోంది.

Untitled-3600.jpg

అతిథులకు సీట్లు లేకపోతే మోసుకొచ్చిన జిల్లా ఉన్నతాధికారి!

మరోవైపు.. విశాఖ పెట్టుబడుల సదస్సుకు సంబంధించి జగన్ ప్రభుత్వం ఓ జాతీయ మీడియాతో ఒప్పందం చేసుకున్నప్పటికీ డబ్బులు సరిగా ఇవ్వకపోవడంతో ఏర్పాట్లు మధ్యలోనే వదిలేసినట్లు ప్రచారం జరుగుతోంది. చివరికి.. సమ్మిట్‌కు ముందు రోజు రాత్రి.. అధికారులు.. బ్యూటీఫికేషన్ ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది. అతిథులకు సీట్లు లేకపోతే జిల్లా ఉన్నతాధికారి ఒకరు స్వయంగా మోసుకొచ్చి వేశారంటే.. ఆ సభలో వారికి ఎంతటి ప్రాధాన్యత కల్పించారో అర్థమవుతోంది. బయట ప్రాంతాల నుండి అతిథులను తీసుకొచ్చి హడావుడి చేశారు తప్పితే.. స్థానికంగా మంత్రులు, అధికారులను మాత్రం గౌరవించలేదు. దాంతో.. అధికార యంత్రాంగం, ప్రభుత్వ పెద్దల మధ్య సమన్వయలోపం ఉన్నట్లు స్పష్టంగా కనిపించింది.

Untitled-3202.jpg

అటు.. జగన్‌ సర్కార్‌ చేపట్టిన పెట్టుబడుల సదస్సుకు హాజరైన వైసీపీ నేతలకు కనీస గౌరవం దక్కకపోవడంతో వారి అభిమానులు, పార్టీ శ్రేణుల్లో తీవ్ర అసహనం వ్యక్తం అవుతోంది. ఎన్నో ఆశలతో సదస్సుకు వెళ్తే.. పట్టించుకునే నాథుడు కరువయ్యారంటూ వాపోతున్నారు. బడా పారిశ్రామికవేత్తలు ఒకే గానీ.. చిన్న పారిశ్రామికవేత్తలు, MSMEలు పెట్టినవారు.. విశాఖలోని పరిస్థితులను చూసి ఉసూరుమనుకుంటూ వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అయితే.. చాలామంది మంత్రులు రాకుండా వారి గౌరవాన్ని కాపాడుకున్నారని.. జగన్.. ఎవ్వరికి విలువ ఇవ్వరు.. పట్టించుకోరనేది రెండు రోజుల పెట్టుబడుల సదస్సులో మరోసారి స్పష్టమైందంటున్నారు.

Untitled-3305.jpg

మొత్తంగా.. ఏపీ పెట్టుబడుల సదస్సు తుస్సుమనడంతోపాటు.. రెండురోజు సదస్సుకు జనం లేక.. అధికారులు.. అప్పటికప్పుడు సచివాలయ, రెవిన్యూ సిబ్బందిని తరలించారంటే సభ విజయవంతంపై సీఎం జగన్ ఏ మేరకు దృష్టిపెట్టారో అర్థం చేసుకోవచ్చు. ఇక.. వచ్చే ఎన్నికల్లో తమ గౌరవం ఏంటో చూపిస్తామని వైసీపీ ఫ్యాన్స్‌ చెప్తుండడం ఆ పార్టీలో చర్చగా మారుతోంది. ఈ నేపథ్యంలో... రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి మరి.

Updated Date - 2023-03-11T13:15:37+05:30 IST