Union Budget 2023 : కేంద్ర బడ్జెట్‌పై వైసీపీ ఎంపీలు ఇలా మాట్లాడారేంటి.. ఆ రెండూ శుభపరిణామాలే కానీ..

ABN , First Publish Date - 2023-02-01T16:22:24+05:30 IST

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) 2023-2024 సంవత్సరానికి ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్...

Union Budget 2023 : కేంద్ర బడ్జెట్‌పై వైసీపీ ఎంపీలు ఇలా మాట్లాడారేంటి.. ఆ రెండూ శుభపరిణామాలే కానీ..

ఢిల్లీ/అమరావతి : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) 2023-2024 సంవత్సరానికి ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ (Union Budget 2023)పై ప్రతిపక్ష పార్టీలు, విశ్లేషకులు తీవ్ర స్థాయిలో తప్పుబడుతున్నారు. వాస్తవానికి తెలుగు రాష్ట్రాలకు ఆశించిన రీతిలో కేటాయింపులు దక్కలేదు. అయితే కంటితుడుపు చర్యగా కొన్ని ప్రకటనలు మాత్రమే వెలువడ్డాయి. ఈ బడ్జెట్‌లో పలు సంస్థలకు ప్రాధాన్యత దక్కింది. ఏపీ కేటాయింపులపై వైసీపీ ఎంపీలు (YSRCP MPs) మిథున్ రెడ్డి (Mithun Reddy), మోపిదేవి వెంకటరమణ (Mopidevi Venkataramana), మార్గాని భరత్ (Margani Bharat).. ఢిల్లీ (Delhi) వేదికగా మీడియాతో మాట్లాడారు.

ఒకట్రెండే శుభపరిణామాలు..!

గరీబ్ కళ్యాణ్ యోజన (Garib kalyan yojana) కొనసాగింపు, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (Pradhan Mantri Awas yojana) 66% పెంచడం శుభపరిణామాలే అని వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి చెప్పుకొచ్చారు. అయితే.. రైల్వేకు 2.4 లక్షల కోట్లు కేటాయింపు కూడా మంచిదనన్నారు. ఇందులో ఏపీకి (Andhra Pradesh) ఎంత మేర వాటా వచ్చిందో చూడాలన్నారు. పంప్డ్ స్టోరేజి గురించి కూడా బడ్జెట్‌లో ప్రస్తావించారని.. ఈ విషయంలోనూ ఏపీ.. దేశానికే ఆదర్శంగా ఉందన్నారు. కేంద్ర బడ్జెట్ నుంచి రాష్ట్రానికి ఎంత మేర అందుతుందో చూడాల్సి ఉందన్నారు. మధ్యతరగతికి ఇచ్చిన పన్ను ప్రయోజనాలు కూడా బాగున్నాయన్నారు.ఫిషరీస్ కోసం ఇచ్చే రాయితీలు కూడా రాష్ట్రానికి ఉపయోగపడతాయి. 50 ఏళ్ల పాటు వడ్డీ రహిత రుణాలు రాష్ట్రానికి ఇస్తామన్నారు. ఇందులో రాష్ట్రానికి ఎంత కేటాయిస్తారో చూడాల్సి ఉంది. విభజన హామీల పరంగా నిరాశే మిగిలింది. విభజన జరిగి పదేళ్లు కావొస్తోంది.. కానీ హామీలకు నిధుల గురించి ప్రస్తావన లేదు. పోలవరం (Polavaram) గురించి, రెవెన్యూ లోటు గురించి, రైల్వే కారిడార్ (Railway Corridor), స్టీల్ ఫ్యాక్టరీకి (Steel Factory) సహాయం వంటి ఏ అంశాన్ని ప్రస్తావించలేదు. ఈ సమావేశాల్లో వీటన్నింటిపై కేంద్రాన్ని నిలదీస్తాం. నర్సింగ్ కాలేజీలు (Nursing Colleges), ఏకలవ్య స్కూల్స్.. వీటిలో ఏపీకి తగ్గ వాటా సాధించుకుంటాం. కర్నాటకకు (Karnataka) ఇచ్చినవాటికి బాధలేదు. కానీ ఏపీకి సంబంధించి పోలవరం ప్రస్తావన లేకపోవడం బాధాకరం అని మిథున్‌రెడ్డి చెప్పుకొచ్చారు.

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై..

ఏపీలో కలకలం రేపుతున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) వ్యవహారంపై ఎంపీ మిథున్ రెడ్డి స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ అనేది కేవలం రాజకీయ ఆరోపణ మాత్రమేనన్నారు. ఇద్దరి మధ్య జరిగిన సంభాషణను ఒకరు రికార్డు చేస్తే ట్యాపింగ్ ఎలా అవుతుందని ప్రశ్నించారు. రాష్ట్రపతి ప్రసంగాన్ని వ్యతిరేకించినంత మాత్రాన సరిపోదని.. రావాల్సిన వాటి గురించి ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేస్తామని మిథున్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు.

బాగానే ఉంది కానీ..

కేంద్ర బడ్జెట్ పేదలకు సంబంధించినంత వరకూ బాగానే ఉందని ఎంపీ మోపిదేవి వెంకటరమణ చెప్పారు.ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలి. పొడవైన తీర ప్రాంతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉంది. కేంద్ర బడ్జెట్‌లో ఏయే రంగానికి ఎంతమేర బడ్జెట్ కేటాయింపులు జరిగాయన్న విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ప్రత్యేక హోదా కోసం మా ప్రయత్నం శక్తివంచన లేకుండా కొనసాగుతుంది. చంద్రబాబు స్వార్థపూరిత ఆలోచనతో పోలవరం ప్రాజెక్టును తాకట్టు పెట్టారు. పోలవరం విషయంలో నిధులు, ఆర్థిక సహాయం పొందే విషయంలో కొంత నిర్లక్ష్యానికి గురవుతున్నాం. మెరైన్- ఆక్వా రంగ అభివృద్ధిలో భాగంగా 4 చోట్ల ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం జరుగుతోంది. ఆక్వా రంగంలో రాయితీలు ఊరట ఇస్తున్నప్పటికీ.. ఇంకా కొంత ప్రోత్సహకాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. జగనన్న కానుక పేరుతో గ్రామాలకు గ్రామాలనే నిర్మించి ఇస్తున్నారు. దీనిపై కేంద్రం మరింత ప్రత్యేక శ్రద్ధ, రాయితీలు కల్పించాల్సిన అవసరం ఉంది. విశాఖలో ఏపీ సర్కారు చేపట్టిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కి కేంద్రం నుంచి సంపూర్ణ సహకారం కావాలిఅని మోపిదేవి తెలిపారు.

ఏపీకి పెద్దగా ప్రస్తావన లేదేం..?

బడ్జెట్ కేటాయింపుల విషయంలో ఏపీకి సంబంధించి మరింత స్పష్టత రావాల్సి ఉందని వైసీపీ ఎంపీ మార్గాని భరత్ తెలిపారు. మహిళలకు (Womens) పెద్దపీట వేసే విధంగా ఈ బడ్జెట్ ఉందన్నారు. బడ్జెట్‌లో ఏపీకి సంబంధించి పెద్దగా ప్రస్తావన లేదు. సీఎం జగన్ నవరత్నాల్లో (Navaratnalu) ఏదైతే ప్రకటించారో అందుకు తగ్గట్టుగా కేటాయింపులు ఉంటాయని ఆశిస్తున్నాం. ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ రావాల్సిన అవసరం ఉంది. కోవిడ్-19 సమయంలో ప్రజలు ఎంతగా అల్లాడిపోయారో చూశాం. సీఎం జగన్ 16 మెడికల్ కాలేజీలను రాష్ట్రంలో తీసుకొచ్చారు. ఇందులో మూడింటికి కేంద్రం నిధులు ఇస్తామని చెప్పింది. మిగతావాటికి కూడా నిధులివ్వాలని కోరుతున్నాం. రైల్వే థర్డ్ లైన్ అంశం, కొవ్వూరు-భద్రాచలం లైన్ పెండింగ్‌లో ఉన్నాయి. ఇండస్ట్రియల్ కారిడార్లతో 80 శాతం ఏపీ రాష్ట్రాలు కవర్ అవుతున్నాయి. వీటికి బడ్జెట్లో నిధులు కేటాయించడం ద్వారా ప్రయోజనం కలుగుతుంది. పీఎం మత్స్య సంపదకు రూ. 6 వేల కోట్లు కేటాయించారు. పునరుత్పాదక ఇంధన వనరులపై కేంద్రం దృష్టి పెట్టింది. ఈ కేటాయింపుల్లో ఏపీకి ఎంత మొత్తంలో వస్తాయన్నది చూడాలి. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్‌ను హైదరాబాద్‌కు ఇచ్చారు. ఇలాంటిదైనా ఏపీకి ఇచ్చి ఉంటే రాష్ట్ర ప్రజలు సంతోషపడేవారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలపై కేంద్రం ఫోకస్ పెట్టినట్టుగా ఉంది. పోలవరం ప్రాజెక్టుకు బడ్జెట్‌లో నిధులు ప్రత్యేకంగా పేర్కొని ఉంటే బావుండేది. మేమేమీ గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదు. విభజన చట్టంలో పదేళ్లలో పూర్తిచేయాల్సినవే అడుగుతున్నాం. దుగిరాజపట్నం బదులు రామాయపట్నం పోర్టుకు నిధులు కేటాయించాలని కోరాం. రాష్ట్రానికి ఏమేం రాబట్టుకోవాలో అవన్నీ రాబట్టుకునే ప్రయత్నాలు, ఒత్తిడి చేస్తాం. పోలవరం సవరించిన అంచనాలు ఆమోదించాల్సి ఉంది. పునరావాసం, పరిహారంకు నిధులు కేటాయించాలిఅని మార్గాని భరత్ డిమాండ్ చేశారు.

Updated Date - 2023-02-01T16:32:35+05:30 IST