KANIGIRI: సర్వేల పేరుతో YCP క్యాడర్‌లో వణుకు..ఎప్పుడు బయటపడతామోనని ఆందోళన

ABN , First Publish Date - 2023-02-02T10:54:54+05:30 IST

ప్రకాశం జిల్లా వైసీపీని కష్టాలు వెంటాడుతున్నాయి. ఏ నియోజకవర్గంలో చూసినా వర్గపోరు, ప్రజా వ్యతిరేకత కొట్టొచ్చినట్లు కనిపిస్తోందనే ప్రచారం జోరుగా నడుస్తోంది. అదే సమయంలో.. అన్ని నియోజకవర్గాల్లో సర్వేలు ..

 KANIGIRI: సర్వేల పేరుతో YCP  క్యాడర్‌లో వణుకు..ఎప్పుడు బయటపడతామోనని ఆందోళన

ప్రకాశం జిల్లాలోని ఓ నియోజకవర్గ ఎమ్మెల్యే తీరుతో వైసీపీ క్యాడర్‌ హడలిపోతోంది. సర్వేల సీజన్‌ జోరుగా కొనసాగుతుండడంతో తెలివిగా వ్యవహరిస్తున్నారు. నియోజకవర్గంలో ఆయన గురించి ఆయనే సర్వేలు చేయించుకోవడం హాట్‌టాపిక్‌గా మారుతోంది. ఇంకేముంది.. సర్వేల పేరుతో వచ్చే వారిని చూస్తే వైసీపీ క్యాడర్‌లో వణుకుపుడుతోంది. ఏం చెబితే.. ఏం జరుగుతుందోననే సర్వేల ఫీవర్‌ వెంటాడుతోంది. ఇంతకీ.. ఎవరా ఎమ్మెల్యే?.. అసలు.. సర్వే టీమ్‌లంటే వైసీపీ క్యాడర్‌ ఎందుకు టెన్షన్‌ పడుతోంది?.. అనే మరిన్ని విషయాలు ఏబీఎన్ ఇన్‎సైడ్‎లో తెలుసుకుందాం..

Untitled-754.jpg

సర్వేలతో వైసీపీ ఎమ్మెల్యేల అలెర్ట్‌

ప్రకాశం జిల్లా వైసీపీని కష్టాలు వెంటాడుతున్నాయి. ఏ నియోజకవర్గంలో చూసినా వర్గపోరు, ప్రజా వ్యతిరేకత కొట్టొచ్చినట్లు కనిపిస్తోందనే ప్రచారం జోరుగా నడుస్తోంది. అదే సమయంలో.. అన్ని నియోజకవర్గాల్లో సర్వేలు కొనసాగుతుండడంతో వైసీపీ ఎమ్మెల్యేలు అలెర్ట్‌ అవుతున్నారు. ఈ క్రమంలోనే... కనిగిరి వైసీపీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌ యాదవ్ నియోజకవర్గంలో హాట్‌టాపిక్‌గా మారారు. నియోజకవర్గంలో ఆయన గురించి వైసీపీ శ్రేణులు ఏమనుకుంటున్నాయోనని సొంత సర్వేలు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో.. సర్వే సంస్థల ప్రతినిధులను చూస్తే వైసీపీ క్యాడర్ కంగారు పడుతోంది.

Untitled-854.jpg

రెండేళ్లుగా తాడేపల్లికి వ్యతిరేక వర్గాల క్యూ

వాస్తవానికి.. 2014 ఎన్నికల సమయంలో వైసీపీలో చేరిన బుర్రా మధుసూదన్.. ఆ ఎన్నికల్లో కనిగిరి నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే.. 2019 ఎన్నికల్లో మళ్లీ టిక్కెట్‌ దక్కించుకుని పోటీ చేసి గెలుపొందారు. కానీ.. బుర్రాకి వ్యతిరేకంగా రెడ్డి సామాజిక వర్గంతోపాటూ సొంత సామాజికవర్గం నేతలు కూడా రెండేళ్లుగా తాడేపల్లికి క్యూ కడుతున్నారు. అంతేకాదు.. కనిగిరి వైసీపీ టిక్కెట్ కోసం మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు, రెడ్డి కార్పోరేషన్ చైర్మన్ చింతలచెరువు సత్యనారాయణరెడ్డి పావులు కదుపుతుండడం నియోజకవర్గంలో హీట్‌ పెంచుతోంది. దీంతోపాటూ.. జగన్ చేయించుకున్న సర్వేలు ఎమ్మెల్యే మధుసూదన్‌కి టెన్షన్‌గా మారాయి. ఈ క్రమంలో.. పైకి నటిస్తూ ఆయన గురించి వెనుక మాట్లాడే సొంత పార్టీ క్యాడర్‌ను గుర్తించే పనిలో పడ్డారని టాక్‌ నడుస్తోంది. వైసీపీలో ఆయనకు వ్యతిరేకంగా ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులెవరో తెలుసుకునేందుకు ఎమ్మెల్యే సొంత సర్వేలు చేయిస్తున్నారని కనిగిరిలో ప్రచారం జరుగుతోంది. ఐ ప్యాక్ సర్వే పేరుతో కనిగిరిలో పలుమార్లు బుర్రా మధుసూదన్ సొంత సర్వే చేయించినట్లు తెలుస్తోంది.

Untitled-954.jpg

కనిగిరి వైసీపీలో చర్చ

ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఎమ్మెల్యే బుర్రా ప్లాన్‌తో కనిగిరి వైసీపీ శ్రేణుల పరిస్థితి అయోమయంలో పడింది. సర్వేల్లో ఆయనకు వ్యతిరేకంగా చెప్పిన వైసీపీ నేతలను గుర్తించి వారి ఎదుటే ఏం చెప్పారో గుక్కతిప్పుకోకుండా చెబుతుండడంతో పార్టీ శ్రేణులు షాకవుతున్నాయి. ఐ ప్యాక్ సర్వే సిబ్బందికి చెప్పినవన్నీ ఎమ్మెల్యేకి ఎలా తెలిశాయోనని కనిగిరి వైసీపీ నేతలు, కార్యకర్తలు జుట్టు పీక్కుంటున్నారు. ఈ క్రమంలో.. ఐ ప్యాక్ సర్వే పేరుతో మధుసూదనే సొంత సర్వే చేయించారని కనిగిరి వైసీపీలో చర్చ జరుగుతోంది. సొంత సర్వేలు చేయించుకున్న ఎమ్మెల్యే .. వ్యతిరేక వర్గాలు, నేతలు, కార్యకర్తలను గుర్తించే పనిలో పడ్డారని తెలుస్తోంది. ఐ ప్యాక్ సర్వే పేరు చెబితే జగన్ కోసం చేస్తున్నారని భావించి వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఏం మాట్లాడతారో తెలుసుకోవచ్చని ఎమ్మెల్యే మధుసూదన్ ప్లాన్ చేశారని ప్రచారం జరుగుతోంది. ఇంకేముంది.. సర్వే సిబ్బంది దగ్గర ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడిన వారు గురించి తెలుసుకుని క్లాస్ పీకినట్లు టాక్‌ నడుస్తోంది.

Untitled-1054.jpg

వైసీపీ నేతలు, కార్యకర్తలు హడలిపోతున్నారు

మొత్తంగా.. కనిగిరి నియోజకవర్గంలో సర్వేల పేరుతో ఎవరైనా వస్తే చాలు.. వైసీపీ నేతలు, కార్యకర్తలు హడలిపోతున్నారు. సర్వేల పేర్లు చెప్పి ఎవరు వస్తారో.. తిరిగి ఎమ్మెల్యేకి ఏం చెబుతారోనని కంగారుపడుతున్నారు. దీంతో.. సర్వేల టెన్షన్ నుండి ఎప్పుడు బయటపడతామోనని వైసీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. ఏదేమైనా.. కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌ సర్వేల విషయంలో తెలివిగా వ్యవహరించారు. అయితే.. ఆయన తెలివి ఎన్నికల నాటికి ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందో చూడాలి మరి.

Untitled-1154.jpg

Updated Date - 2023-02-02T11:28:15+05:30 IST