Telangana Cabinet: సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం.. తెలంగాణ కేబినెట్‌లో మార్పులు?

ABN , First Publish Date - 2023-08-21T19:09:53+05:30 IST

తెలంగాణ‌లో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ పార్టీ ప్రస్తుత కేబినెట్‌లో మార్పులుచేర్పులు చేయనున్నట్లు సమాచారం. ఈటల బర్తరఫ్‌తో ఖాళీ అయిన స్థానాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కోసం కామారెడ్డి స్థానాన్ని వదులుకున్న గంప గోవర్ధన్‌తో భర్తీ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డిని కూడా కేబినెట్‌లోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

Telangana Cabinet: సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం.. తెలంగాణ కేబినెట్‌లో మార్పులు?

హైదరాబాద్: తెలంగాణ‌లో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ పార్టీ ప్రస్తుత కేబినెట్‌లో మార్పులుచేర్పులు చేయనున్నట్లు సమాచారం.

355679049_759325299527613_5181208789382285146_n.jpg

ఈటల బర్తరఫ్‌తో ఖాళీ అయిన స్థానాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కోసం కామారెడ్డి స్థానాన్ని వదులుకున్న గంప గోవర్ధన్‌తో భర్తీ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డిని కూడా కేబినెట్‌లోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలిసింది. తాండూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా బీఆర్‌ఎస్ అధిష్ఠానం పైలట్ రోహిత్ రెడ్డి పేరును ఇప్పటికే ప్రకటించింది. ఈ పరిణామంపై పట్నం మహేందర్ రెడ్డి వర్గం తీవ్ర అసంతృప్తితో ఉంది.


Patnam-Mahendar-Reddy.jpg

పట్నం మహేందర్ రెడ్డిని బుజ్జగించడంలో భాగంగానే మూణ్ణాళ్ల ముచ్చటైన ఈ మంత్రి పదవిని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆఫర్ చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఉద్వాసన తప్పదని వార్తలొస్తున్నాయి. పాండిచ్చేరిలో ఉన్న గవర్నర్‌ ఈ రాత్రికి హైదరాబాద్‌కు రానుండటంతో వచ్చాక మంత్రివర్గంలో మార్పులపై సమాచారం అందించనున్నట్లు సమాచారం.

ఇదిలా ఉండగా.. ఎమ్మెల్యే పోటీ నుంచి తప్పుకుని తనకు మంత్రి పదవి, తన సతీమణి జెడ్పీ చైర్‌పర్సన్ సునీతారెడ్డికి రాజ్యసభ ఎంపీ పదవితో సరిపెట్టుకోవాలని ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి భావించారని మొన్నటివరకూ ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా.. ఆయనను మంత్రివర్గంలోకి తీసుకోనున్నారన్న వార్తల నేపథ్యంలో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి అసంతృప్తికి ఇలా చెక్ పెట్టినట్లుగా తెలుస్తోంది. వాస్తవానికి బీఆర్‌ఎస్ అధిష్టానం తనకు టికెట్ ఇస్తుందని మహేందర్ రెడ్డి తొలుత ఆశలు పెట్టుకున్నారు. టికెట్ కోసం సీఎం కేసీఆర్‌పై ఒత్తిడి పెంచేందుకు బడా నాయకులను రంగంలోకి దింపారు. హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీని కేసీఆర్‌తో మాట్లాడించి టికెట్ సాధించుకునే ప్రయత్నాలు కూడా మహేందర్ రెడ్డి చేశారు.

తాండూరు నుంచి కొందరు ముస్లిం నాయకులు హైదరాబాద్‌కు వెళ్లి ఓవైసీని కలిసి మహేందర్ రెడ్డికే టికెట్ ఇచ్చేలా కేసీఆర్‌తో మాట్లాడాలని కోరారు. కొన్ని రోజులుగా నియోజకవర్గ మండలాల నాయకులు, అనుచరులు మహేందర్ రెడ్డి వద్దకు వెళ్లి పోటీ చేయాలని కోరగా.. ‘నేను పోటీ చేయడం లేదని ఎప్పుడైనా చెప్పానా?’ అంటూ నాయకులకే ఎదురు ప్రశ్న వేశారు. వారం రోజులుగా టికెట్ విషయంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు తమతమ అనుచరులతో తరచూ సమావేశాలు నిర్వహిస్తూ సమాలోచనలు చేశారు. చివరకు బీఆర్‌ఎస్ అధిష్ఠానం మహేందర్ రెడ్డికి హ్యాండిచ్చి, తాండూరు ఎమ్మెల్యే టికెట్‌ను పైలట్ రోహిత్ రెడ్డికే కేటాయించింది. ఇదిలా ఉండగా.. తాండూరు రాజకీయాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న కాంగ్రెస్ మహేందర్ రెడ్డి తమ పార్టీలోకి రాకుంటే ఏం చేయాలనే దానిపై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుంది. తాండూరులో బడా నేతను రంగంలోకి దింపే ఆలోచన చేస్తోంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టినట్లు సమాచారం.

Updated Date - 2023-08-21T19:43:24+05:30 IST