Chilakaluripet YCP: వైసీపీలో వర్గ విభేదాలు..మాజీ ఎమ్మెల్యే కాస్తా..ఎమ్మెల్సీ కావడంతో కయ్యానికి కాలు దువ్వుతున్న నేతలు..?

ABN , First Publish Date - 2023-02-25T10:43:17+05:30 IST

చిలకలూరిపేటలో మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ కూడా వైసీపీలో కీలక నేతగా కొనసాగుతున్నారు. కాంగ్రెస్ హయాంలో ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. వైసీపీ ఆవిర్భావంతో జగన్‌రెడ్డి...

Chilakaluripet YCP: వైసీపీలో వర్గ విభేదాలు..మాజీ ఎమ్మెల్యే కాస్తా..ఎమ్మెల్సీ కావడంతో కయ్యానికి కాలు దువ్వుతున్న నేతలు..?

ఒకరు.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే.. మరొకరు మాజీ ఎమ్మెల్యే.. వారిద్దరూ అధికార పార్టీ నేతలే.. అయినా.. ఇద్దరి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇప్పటివరకు.. ఎమ్మెల్యే వర్గానిదే పైచేయిగా నిలిచింది. కానీ.. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే కాస్తా.. ఎమ్మెల్సీకావడంతో రెండు వర్గాలు.. కయ్యానికి కాలుదువ్వుతున్నాయి. ఇంతకీ.. ఏంటా నియోజకవర్గం?.. కయ్యానికి కాలుదువుతున్న నేతలెవరు?..అనే మరిన్ని విషయాలు ఏబీఎన్ ఇన్‎సైడ్‎లో తెలుసుకుందాం..

Untitled-1474.jpg

ఆర్థిక వనరులు, సామాజిక సమీకరణాలు

పల్నాడు జిల్లా చిలకలూరిపేట వైసీపీలో వర్గ విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. చిలకలూరిపేట నుంచి విడదల రజనీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. అయితే.. అదే చిలకలూరిపేటలో మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ కూడా వైసీపీలో కీలక నేతగా కొనసాగుతున్నారు. కాంగ్రెస్ హయాంలో ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. వైసీపీ ఆవిర్భావంతో జగన్‌రెడ్డి వెంట నడిచారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉమ్మడి గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా పని చేసారు. అయితే.. ఆర్థిక వనరులు, సామాజిక సమీకరణాల నేపథ్యంలో మర్రిని కాదని చిలకలూరిపేట సీటును జగన్‌రెడ్డి విడదల రజనీకి ఇచ్చారు. దానికి తగ్గట్లే.. తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసిన రజనీ.. మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుపై గెలుపొందారు.

Untitled-1854.jpg

18 ఎమ్మెల్సీ స్థానాల భర్తీలో అవకాశం

ఇదిలావుంటే... అప్పటివరకు చిలకలూరిపేట ఇన్‌చార్జ్‌గా, పల్నాడు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న మర్రి రాజశేఖర్‌కు అన్యాయం జరిగిందని ఆయన అనుచరులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే.. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తానని ఎన్నికల ప్రచార సభలో జగన్ బహిరంగంగానే ప్రకటించారు. కానీ.. గత ఎన్నికల్లో పోటీ చేసిన విడదల రజనీ మంత్రి పదవి అయ్యారు. మర్రికి మాత్రం ఎమ్మెల్సీ దక్కలేదు. గత నాలుగేళ్లుగా ఎమ్మెల్సీ పదవులు భర్తీ జరుగుతున్న ప్రతీసారి ఆయన పేరు తెరపైకి రావడం, చివరికి నిరాశ చెందడం పరిపాటిగా మారింది. తాజాగా.. 18 ఎమ్మెల్సీ స్థానాల భర్తీలో అవకాశం వచ్చింది. మర్రి రాజశేఖర్‌కు ఎమ్మెల్సీ ఇవ్వడంతో ఆయన వర్గం ఆనందానికి అవధులు లేకుండా పోతోంది.

Untitled-1554.jpg

మంత్రి పదవి రావడం ఖాయమనే ఊహాగానాలు

మరోవైపు... ఎమ్మెల్సీలకు కూడా మంత్రి పదవి ఇస్తారనే సంకేతాలు నేపథ్యంలో.. రాజశేఖర్‌ వర్గం జగన్‌రెడ్డి హామీని గుర్తు చేసుకుంటోంది. దాంతో.. మర్రికి త్వరలో మంత్రి పదవి రావడం ఖాయమనే ఊహాగానాలు విపిస్తున్నాయి. కానీ.. ప్రస్తుత పరిస్థితులకు ప్రకారం ఆ చాన్స్‌ ఉంటుందా? లేదా? అన్నది ఆసక్తిగా మారుతోంది. ఎందుకంటే.. చిలకలూరిపేట నుంచి విడదల రజనీ ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. ఒకవేళ.. జగన్‌రెడ్డి హామీ మేరకు మర్రి రాజశేఖర్‌కు మంత్రి పదవి ఇస్తే.. ఆమెని తప్పిస్తారనే ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే.. మర్రి రాజశేఖర్ వర్గం అధికారికంగా రెచ్చిపోవడం ఖాయమనే టాక్‌ నడుస్తోంది.

Untitled-135.jpg

పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో విభేదాలు

వాస్తవానికి.. విడదల రజనీ ఎమ్మెల్యే అయిన నాటి నుంచి చిలకలూరిపేటలో రెండు వర్గాలు తయారయ్యాయి. మర్రి, విడదల రజనీ వర్గాల మధ్య విభేదాలు.. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి చేరాయి. అదే సమయంలో.. స్థానిక ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయులు, విడదల రజనీకి కూడా తొలి నుంచి సఖ్యత లేకుండా పోయింది. దాంతో.. లావు, మర్రి.. ఓ వర్గంగా తయారై.. విడదల రజనీకి వ్యతిరేకంగా రాజకీయాలు నడుపుతున్నారు. నాలుగేళ్లుగా చిలకలూరిపేటలో రెండు వర్గాలు ఉన్నప్పటికీ.. విడదల రజనీదే పైచేయిగా ఉంది. అయితే.. తాజాగా మర్రి రాజశేఖర్‌కు ఎమ్మెల్సీ దక్కడంతో మంత్రి కూడా అవుతారనే ఆశల్లో ఆయన వర్గం విహరిస్తోంది. అదే జరిగితే.. మర్రి రాజశేఖర్ వర్గం.. విడదల రజనీ వర్గాన్ని టార్గెట్‌గా చేసుకుని ప్రతీకారం తీర్చుకోవడం ఖాయమని ప్రచారం జరుగుతోంది.

Untitled-1654.jpg

మొత్తంగా.. చిలకలూరిపేట వైసీపీలో వర్గపోరు రోజురోజుకీ పెరుగుతోంది. ఇప్పుడు.. కొత్తగా మర్రి రాజశేఖర్‌కు ఎమ్మెల్సీ రావడంతో వైసీపీ రాజకీయం మరింత హీటెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. అంతేకాదు.. జగన్‌రెడ్డి హామీ మేరకు.. మర్రిని మంత్రి కూడా చేస్తారని టాక్‌ నడుస్తోంది. ఈ నేపథ్యంలో... రాబోయే రోజుల్లో చిలకలూరిపేట వైసీపీలో ఏం జరుగుతుందో చూడాలి మరి.

Updated Date - 2023-02-25T10:54:30+05:30 IST