AP Volunteers: వాలంటీర్లు పనిచేసేది రాష్ట్రానికా? వైసీపీకా?

ABN , First Publish Date - 2023-07-11T12:29:58+05:30 IST

పవన్ ఆరోపణలకు సమాధానం చెప్పలేని ఏపీ ప్రభుత్వ నేతలు వాలంటీర్లను రెచ్చగొట్టి రోడ్ల మీదకు ఉసిగొల్పారు. ప్రతిపక్ష పార్టీల ధర్నాలు, రాస్తారోకోలకు అనుమతి ఇవ్వని ప్రభుత్వం పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మలు దహనం చేయడానికి మాత్రం పర్మిషన్ ఇచ్చేసింది. సొంత మీడియాలో కనిపించేలా పవన్ చిత్రపటాలపై దాడులు చేయించింది. దీంతో వాలంటీర్లు పనిచేసేది రాష్ట్రానికి లేదా వైసీపీకా అన్న అనుమానాలు ప్రజల్లో మరింత బలపడుతున్నాయి.

AP Volunteers: వాలంటీర్లు పనిచేసేది రాష్ట్రానికా? వైసీపీకా?

ఏపీ(Andhra Pradesh)లో జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్ (Volunteer) వ్యవస్థను తీసుకువచ్చింది. అయితే వాలంటీర్ ఉద్యోగాలను పారదర్శకంగా తీసుకోకుండా సొంత పార్టీ కార్యకర్తలనే తీసుకుంది. ఈ విషయాన్ని వైసీపీ (YSRCP) నేతలే పలు సభల్లో ప్రజల సాక్షిగా చెప్పారు. వాలంటీర్లలో 90 శాతం మంది వైసీపీ వాళ్లే ఉన్నారని వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) కూడా ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో వాలంటీర్లు ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారా?.. పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారా? అన్నదే ఇక్కడి ప్రశ్న.

ఎందుకంటే ప్రభుత్వం వేరు.. పార్టీ వేరు. కానీ వాలంటీర్ వ్యవస్థను జగన్ ప్రభుత్వం తమ పార్టీ కరపత్రంలా వాడుకుంటోందని మొదటి నుంచీ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐప్యాక్ సర్వేలకు కూడా వాలంటీర్లను వాడుకున్నట్లు ప్రచారం జరిగింది. ఇటీవల జగన్ ప్రభుత్వం (Jagan Government) తమకు అనుకూలంగా లేని ఓట్లను వాలంటీర్ల ద్వారా తొలగిస్తోందని కూడా ఆరోపణలు వస్తున్నాయి. తద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం అందుతోంది.

మరోవైపు వాలంటీర్లలోనూ కొందరు అక్రమార్కులు, దొంగలు, దోపిడీదారులు కూడా ఉన్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మహిళలపై దాడులు చేసిన వాలంటీర్లు కూడా ఉన్నారని అభియోగాలు వచ్చాయి. వస్తున్నాయి. వాలంటీర్ల కారణంగా ఒంటరి మహిళల భద్రతకు ముప్పు ఉందని పలు సందర్భాల్లో ఆందోళనలు వ్యక్తమయ్యాయి. తాజాగా ఈ విషయాన్నే ఏలూరు వారాహి యాత్రలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అయితే పవన్ వ్యాఖ్యలకు సమాధానం చెప్పలేని ప్రభుత్వ నేతలు వాలంటీర్లను రెచ్చగొట్టి రోడ్ల మీదకు ఉసిగొల్పారు. ప్రతిపక్ష పార్టీల ధర్నాలు, రాస్తారోకోలకు అనుమతి ఇవ్వని ప్రభుత్వం పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మలు దహనం చేయడానికి మాత్రం పర్మిషన్ ఇచ్చేసింది. సొంత మీడియాలో కనిపించేలా పవన్ చిత్రపటాలపై దాడులు చేయించింది. దీంతో వాలంటీర్లు పనిచేసేది రాష్ట్రానికి లేదా వైసీపీకా అన్న అనుమానాలు ప్రజల్లో మరింత బలపడుతున్నాయి.

నిజానికి ఏలూరు సభలో పవన్ కళ్యాణ్ జగన్ ప్రభుత్వ అవినీతిపై పలు ప్రశ్నలు సంధించారు. కానీ ఆ ప్రశ్నలను పక్కనపెట్టి కేవలం వాలంటీర్లపై చేసిన ఆరోపణలను మాత్రమే జగన్ మీడియా భూతద్దంలో పెట్టి సోషల్ మీడియాలో జనసైనికులను రెచ్చగొట్టింది. ఇవన్నీ చాలవు అన్నట్లు ఏపీ మహిళా కమిషన్ ఓవరాక్షన్ కూడా తోడైంది. మహిళలపై అఘాయిత్యాలు జరిగినప్పుడు స్పందించని ఏపీ మహిళా కమిషన్ ఇప్పుడు ఏదో కొంపలు మునిగిపోయిన తరహాలో ఆఘమేఘాల మీద స్పందించి పవన్ కళ్యాణ్‌కు నోటీసులు జారీ చేసింది. మరోవైపు జగన్ భజన బృందం కూడా సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తోంది.

జగన్ భజన బృందంలో ప్రధాన సభ్యుడు, డీ గ్రేడ్ సినిమాలు తీసే దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా వాలంటీర్లను రెచ్చగొట్టేలా ఓ పోస్ట్ చేశాడు. అందులో వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలు అన్న తరహాలోనే ఆయన సంభోదించాడు. దీంతో వాలంటీర్లు ప్రభుత్వం కింద పనిచేయకుండా పార్టీ కార్యకర్తల్లానే పనిచేస్తున్నట్లు స్పష్టమవుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి. అయినా రూ.5 వేలు జీతం తీసుకునే వాలంటీర్ల సమస్యలు పట్టించుకోని జగన్ సర్కారు వాళ్లతో రాజకీయ పనులు చేయించుకోవడం నీచమంటూ రాజకీయ విశ్లేషకులు మండిపడుతున్నారు. ఎదిగే అవకాశం ఇవ్వకుండా 5 వేల జీతానికే పరిమితం చేశారని.. వాలంటీర్ అని మభ్యపెట్టి ప్రభుత్వ ఉద్యోగాల ఊసెత్తకుండా అర్హత వయసు దాటేలా 4 ఏళ్లుగా వాళ్ల జీవితాన్ని సర్వనాశనం చేశారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ పథకాల చేరవేత పేరుతో ప్రజల డేటా సేకరించి అసాంఘిక కార్యకలాపాలకు ప్రభుత్వం వాడుతోందని ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. వైసీపీ సభలు, సమావేశాలకు ప్రజల్ని తీసుకొచ్చే బాధ్యతను అప్పగించడం నీచమైన పననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

Rajasingh : ఏపీ‌ సీఎం జగన్‌పై రాజాసింగ్ ఫైర్

Lokesh: నా 153 రోజుల పాదయాత్రలో అందరూ జగన్ ప్రభుత్వ బాధితులే


Updated Date - 2023-07-11T12:30:17+05:30 IST