Jagan Balineni Interesting Scene: పాపం జగన్.. బాలినేనిని సభకు రప్పించారు సరే.. మనస్తాపానికి మందు పూయలేకపోయారే..!

ABN , First Publish Date - 2023-04-12T17:14:48+05:30 IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ రెడ్డి (YS Jagan Reddy) ప్రకాశం జిల్లా (Jagan Prakasam District Tour) పర్యటన రాజకీయంగా వైసీపీకి..

Jagan Balineni Interesting Scene: పాపం జగన్.. బాలినేనిని సభకు రప్పించారు సరే.. మనస్తాపానికి మందు పూయలేకపోయారే..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ రెడ్డి (YS Jagan Reddy) ప్రకాశం జిల్లా (Jagan Prakasam District Tour) పర్యటన రాజకీయంగా వైసీపీకి (YCP) చేదు అనుభవాన్ని మిగిల్చింది. జిల్లాలో కీలక నేతగా వ్యవహరిస్తున్న మాజీ మంత్రి, జగన్ బంధువైన బాలినేని శ్రీనివాసరెడ్డి (Balineni Srinivasa Reddy) హెలీప్యాడ్ వద్ద నుంచి అలిగి వెళ్లిపోవడం, ఆ తర్వాత జగన్ నేరుగా రంగంలోకి దిగాల్సిన పరిస్థితి రావడం ప్రకాశం జిల్లాలో పార్టీ పరిస్థితికి అద్దం పట్టింది. ప్రకాశం జిల్లా వైసీపీలో (Prakasam YCP) వాస్తవ పరిస్థితులను ఒకసారి పరిశీలిస్తే.. మాజీ మంత్రి బాలినేనికి అంటూ జిల్లాలో ఒక వర్గం ఉంది. ఒంగోలు మేయర్ సుజాత (Ongole Mayor Sujata) మొదలుకుని వైసీపీలో కీలకంగా వ్యవహరిస్తున్న కొందరికి బాలినేని మాటే వేదవాక్కు. ఇలా తన వారందరినీ వెంటబెట్టుకుని ముఖ్యమంత్రి జగన్ ప్రకాశం జిల్లా పర్యటనకు వస్తున్న నేపథ్యంలో స్వాగతం పలికేందుకు మాజీ మంత్రి బాలినేని హెలీప్యాడ్ వద్దకు వెళ్లారు. అయితే.. మార్కాపురం హెలీప్యాడ్‌ దగ్గర బాలినేనిని పోలీసులు అడ్డుకున్నారు. వాహనం పక్కనపెట్టి నడిచి రావాలని బాలినేనికి పోలీసులు సూచించారు. పోలీసుల తీరుపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి మండిపడ్డారు.

ఈ పరిణామంతో తీవ్ర మనస్తాపం చెందిన బాలినేని.. హెలిప్యాడ్‌కు రాకుండా వెనుదిరిగి వెళ్లిపోయారు. బాలినేనికి సర్దిచెప్పేందుకు మంత్రి ఆదిమూలపు సురేష్‌ ప్రయత్నించారు. అయినప్పటికీ సీఎం సభకు వెళ్లేందుకు ఆసక్తి చూపని మాజీ మంత్రి బాలినేని ఒంగోలుకు వెళ్లిపోయారు. ఈ విషయాన్ని జిల్లాకు చెందిన నేతలు వైసీపీ అధినేత జగన్ చెవిన పడేశారు. వెంటనే స్వయంగా ముఖ్యమంత్రి జగన్ రంగంలోకి దిగిన పరిస్థితి. బాలినేనితో టచ్‌లోకి వెళ్లి.. బుజ్జగించి మొత్తానికైతే ఆయనను సభకు వచ్చేలా జగన్ చేయగలిగారు గానీ బాలినేని ముఖంలో అసంతృప్తి స్పష్టంగా కనిపించింది. బాలినేని తీరును గమనించిన ముఖ్యమంత్రి జగన్ అలిగిన ఈ మాజీ మంత్రితోనే ‘ఈబీసీ నేస్తం’ కార్యక్రమంలో భాగంగా బటన్ నొక్కించారు. అయినప్పటికీ బాలినేని సభా వేదికపై నిరుత్సాహంగానే కనిపించారు. అయితే.. ఈ పరిణామాల కంటే ముందు నుంచే వైసీపీ అధినేత జగన్ తీరుపై బాలినేని శ్రీనివాసరెడ్డి అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు కారణాలు లేకపోలేదని బాలినేని వర్గం, ప్రకాశం జిల్లా వైసీపీ శ్రేణులు కోడై కూస్తున్నాయి.

‘మంత్రివర్గ విస్తరణ’ జరిగినప్పటి నుంచి మాజీ మంత్రి బాలినేని జగన్‌పై కొంత అసంతృప్తితోనే ఉన్నారు. బాలినేనిని మంత్రి వర్గం నుంచి తప్పించనున్నారని వార్తలొచ్చిన సమయంలో వారం రోజుల పాటు బాలినేని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత.. నేరుగా జగన్ రంగంలోకి దిగడంతో మౌనం వీడి సీఎంతో భేటీ అయ్యారు. ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి జోక్యం చేసుకొని వారిద్దరి భేటీకి మార్గం సుముఖం చేశారు. ప్రకాశం జిల్లాకు చెందిన తనను తొలగిస్తూ సురేష్‌ను కొనసాగించబోతున్నట్లు సీఎం జగన్‌.. బాలినేనికి ఆ సమయంలో చెప్పారు. ఈ విషయం తన అనుచరులకు బాలినేని బహిరంగంగానే చెప్పారు. దీంతో.. ‘అందరినీ తొలగించండి.. ఇలా కొందరిని ఉంచి మిగతావారిని తొలగిస్తే ప్రజల్లో వేరే సంకేతాలు వస్తాయి’ అని సీఎంకు చెప్పి, ఆరోజు నుంచి బాలినేని రాజకీయంగా సైలెంట్‌ అయ్యారు.

ఆ సమయంలో హైదరాబాద్‌లో ఉన్న బాలినేనికి పలువురు నాయకులు మద్దతు తెలిపారు. మరికొందరైతే బాలినేనిని పక్కనపెడితే జిల్లాలో పార్టీకి తీవ్రనష్టమని అధిష్ఠానానికి వివిధ రూపాల్లో సమాచారం పంపారు. ముగ్గురు ఎమ్మెల్యేలు నేరుగా బాలినేనిని కలిసి మద్దతు ప్రకటించగా మరో నలుగురు ముఖ్య నాయకులు సజ్జలను కలిసి పరిస్థితి వివరించారు. ఈ నేపథ్యంలో సజ్జల జోక్యం చేసుకొని హైదరాబాద్‌లో ఉన్న బాలినేనితో ఒకటి రెండుసార్లు చర్చించి సీఎంను కలిసేందుకు రావాలని సూచించారు. ఆ తర్వాత జగన్‌ను బాలినేని కలిశారు. అయితే, భేటీలో ఏం చర్చ జరిగిందనే విషయం వెల్లడికాకపోగా, సీఎంతో జరిగిన సంభాషణ మీకు చెప్పాలా అంటూ తనను కలిసిన పార్టీ నాయకులను బాలినేని ఆ సందర్భంలో కసురుకున్నారు కూడా.

ఈ ఎపిసోడ్ జరిగి చాలా రోజులవుతున్నా మంత్రి వర్గం నుంచి తనను తప్పించడం, తన కంటే జూనియర్లను మంత్రివర్గంలో కొనసాగించడం.. తన కంటే జూనియర్లయినా వారిని మంత్రి వర్గంలోకి తీసుకోవడంపై మాజీ మంత్రి బాలినేని ఇప్పటికీ అసంతృప్తితోనే ఉన్నట్లు సమాచారం. అయితే.. ప్రకాశం జిల్లాలో తన హవాకు వచ్చిన ఢోకా ఏం లేదని జగన్ నుంచి స్పష్టమైన హామీ వచ్చాకే బాలినేని శాంతించారని.. కానీ మాజీ మంత్రి కావడంతో పోలీసులు కూడా బాలినేనిని లైట్ తీసుకుంటున్నారని ఈ పరిణామం స్పష్టం చేసిందని జిల్లాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. జగన్ ఇచ్చిన హామీకి, వాస్తవ పరిస్థితికి పొంతన లేకపోవడంతో బాలినేని కినుకు వహించినట్టు సమాచారం. బాలినేని సభకు రాకుండా దూరంగా ఉంటే తప్పుడు సంకేతాలు వెళతాయని భావించిన జగన్ ఆయనను సభకు అయితే రప్పించగలిగారు గానీ మనస్తాపానికి మందు పూయలేకపోయారని బాలినేని వర్గం గుసగుసలాడుకుంటుండటం గమనార్హం.

Updated Date - 2023-04-12T19:41:34+05:30 IST