DK ShivaKumar: డీకే ప్రెస్‌మీట్ వెనుక ఇంత పెద్ద వ్యూహం ఉందా.. ఊరికే అనరు డీకేను ట్రబుల్‌షూటర్ అని..!

ABN , First Publish Date - 2023-05-15T19:14:00+05:30 IST

కర్ణాటకకు కాబోయే కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎవరనే ప్రశ్నకు మరికొన్ని గంటల్లో సమాధానం రాబోతోంది. కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్, కర్ణాటక కాంగ్రెస్ ముఖ్య నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మధ్య సీఎం సీటు కోసం..

DK ShivaKumar: డీకే ప్రెస్‌మీట్ వెనుక ఇంత పెద్ద వ్యూహం ఉందా.. ఊరికే అనరు డీకేను ట్రబుల్‌షూటర్ అని..!

కర్ణాటకకు కాబోయే కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎవరనే ప్రశ్నకు మరికొన్ని గంటల్లో సమాధానం రాబోతోంది. కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్, కర్ణాటక కాంగ్రెస్ ముఖ్య నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మధ్య సీఎం సీటు కోసం నెలకొన్న పోటీలో విజేత ఎవరో తేలిపోయే సమయం రానే వచ్చింది. సిద్ధరామయ్య ఇప్పటికే ఢిల్లీకి చేరుకోగా, డీకే శివకుమార్ కూడా హస్తినకు పయనమయ్యారు. ఢిల్లీకి వెళ్లగానే తన గురువును కలుస్తానని డీకే చెప్పడం కొసమెరుపు. కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసి మాట్లాడాలని డీకే డిసైడ్ అయినట్లు ఈ వ్యాఖ్యతో తేలిపోయింది. రాహుల్ గాంధీతో మాట్లాడి ముఖ్యమంత్రి పదవిపై తన వైఖరిని కుండబద్ధలు కొట్టి చెప్పాలని సిద్ధరామయ్య ఫిక్స్ కావడంతో ఈ ఎపిసోడ్ క్లైమ్యాక్స్‌కు చేరుకుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మరికొన్ని గంటల్లోనే కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే.. ఈలోపే డీకే శివకుమార్ బెంగళూరులోని తన నివాసంలో ప్రెస్‌మీట్ నిర్వహించడం ఆయన వ్యూహంలో భాగమేనని తెలుస్తోంది.

ఢిల్లీ వెళ్లకుండా విషయం తేలదని తెలిసినప్పటికీ ఈలోపే డీకే ప్రెస్‌మీట్ నిర్వహించడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటనే ప్రశ్న ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మద్దతుదారులతో డీకే శివకుమార్‌ సమావేశం అయిన అనంతరం డీకే ప్రెస్‌మీట్ పెట్టి మరీ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒంటి చేత్తో పార్టీని అధికారంలోకి వచ్చేందుకు ఎంతో కృషి చేశానని డీకే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపాయి. అధిష్టానం సరైన నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నాని అంటూనే పార్టీ గెలుపు కోసం రాష్ట్ర నేతలందరూ కలిసి వచ్చేలా చేశానని డీకే తాను పార్టీ గెలుపులో కీలకంగా వ్యవహరించానని కాంగ్రెస్ అధిష్టానానికి పరోక్షంగా గుర్తు చేశారు. ఒంటరిగా 135 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నానని డీకే చేసిన వ్యాఖ్యలు తన రేంజ్ ఇది అనే రీతిలో హైకమాండ్‌కు గట్టి సంకేతాలు పంపడమే లక్ష్యంగా చేసినట్లు సమాచారం. సిద్ధరామయ్యతో తనకు ఎలాంటి విభేదాలు లేవని, సీఎం పేరుపై హైకమాండ్‌దే తుది నిర్ణయమని చెబుతూనే.. ఏదైనా తేడా వస్తే తనకూ బలం ఉందని, ఓ వర్గం ఉందని కాంగ్రెస్ హైకమాండ్‌కు చెప్పడమే డీకే ప్రెస్‌మీట్ నిర్వహించడం వెనక ఉన్న వ్యూహంగా తెలుస్తోంది.

ఇదిలా ఉండగా.. ఢిల్లీకి చేరుకున్న కర్నాటక పంచాయితీ విషయంలో కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం ఆలోచన మరోలా ఉన్నట్లు సమాచారం. కర్ణాటకకు పరిశీలకులుగా వెళ్లిన షిండే, దీపక్ బవారియా, భన్వర్ జితేంద్ర సింగ్ ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. సీఎం అభ్యర్థి ఎంపికపై ఎమ్మెల్యేల అభిప్రాయాలను కాంగ్రెస్‌ హైకమాండ్‌కు పరిశీలకుల టీం అందజేయనుంది. మధ్యే మార్గంగా పవర్ షేరింగ్ ఫార్ములాపై కాంగ్రెస్‌ హైకమాండ్‌ దృష్టి సారించినట్లు సమాచారం. లోక్సభ ఎన్నికల వరకూ సిద్దరామయ్యే సీఎం అని అధిష్టాన వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఈ నెల 18న కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారని, విపక్షాల నేతలనూ ఆహ్వానించాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది.

కాంగ్రెస్ హైకమాండ్ యోచిస్తున్న ఈ పవర్ షేరింగ్ ఫార్ములాకు డీకే శివకుమార్ ఎంతవరకూ అంగీకారం తెలుపుతారో చెప్పలేని పరిస్థితి కర్ణాటక కాంగ్రెస్‌లో నెలకొంది. మొత్తంగా చూసుకుంటే.. కర్ణాటకలో అధికార బీజేపీకి షాకిచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకున్న కాంగ్రెస్‌కు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక కత్తి మీద సాములా మారింది. మరికొన్ని గంటల్లోనే ఈ ఉత్కంఠకు తెరపడే విధంగా కాంగ్రెస్ ఏదైనా కీలక ప్రకటన చేస్తుందో లేక రోజుల తరబడి ఈ సస్పెన్స్ కొనసాగుతోందో వేచి చూడాలి.

Updated Date - 2023-05-15T19:14:12+05:30 IST