Congress: కాంగ్రెస్ పార్టీకి సక్సెస్ ఫార్ములా తెలిసిపోయిందా?
ABN , First Publish Date - 2023-07-03T13:06:17+05:30 IST
ఇటీవల కర్ణాటకలో విజయం సాధించడం ఆ పార్టీలో జోష్ నింపింది. అక్కడ ప్రజలకు ఐదు గ్యారంటీ పథకాలను ప్రకటించడం ఆ పార్టీకి ఎంతో కలిసొచ్చింది. దీంతో కర్ణాటక ఫార్ములానే దేశవ్యాప్తంగా అమలు చేయాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. అందుకు అనుగుణంగానే తెలంగాణలో ఆ పార్టీ పావులు కదుపుతోంది.
ఖమ్మంలో జనగర్జన సభ సూపర్ సక్సెస్
వచ్చే ఎన్నికలే అజెండాగా రాహుల్ గాంధీ ప్రసంగం
కర్ణాటక తరహాలో ప్రజలపై వరాల జల్లు
రాజకీయాల్లో అధికారం చేపట్టాలంటే ప్రజల్లో నమ్మకం కలిగించాలి. అందుకు అనుగుణంగా వ్యూహాలతో ముందుకు సాగాలి. తెలంగాణలో గత పదేళ్లుగా కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉందంటే ప్రజల్లో నమ్మకం కలిగించడమే కారణం. కానీ ప్రస్తుతం ప్రజల్లో ఆ పార్టీకి నమ్మకం సడలింది. రైతు రుణమాఫీ, ఉద్యోగాల కల్పనలో బీఆర్ఎస్ విఫలమైంది. హైదరాబాద్ మినహాయిస్తే మిగతా పట్టణాలలో అభివృద్ధి అంతంత మాత్రంగానే కనిపిస్తోంది.
మరోవైపు తెలంగాణ ఇచ్చి కూడా కాంగ్రెస్ పార్టీ (Congress Party) అధికారంలోకి రాలేకపోయింది. దానికి కారణం లేకపోలేదు. ఎందుకంటే మిగతా పార్టీల తరహాలో కాంగ్రెస్ పార్టీ తాయిలాలను ప్రకటించడంలో వెనకంజలోనే ఉంటుంది. అయితే ఇటీవల కర్ణాటక(Karnataka)లో విజయం సాధించడం ఆ పార్టీలో జోష్ నింపింది. అక్కడ ప్రజలకు ఐదు గ్యారంటీ పథకాలను ప్రకటించడం ఆ పార్టీకి ఎంతో కలిసొచ్చింది. దీంతో కర్ణాటక ఫార్ములానే దేశవ్యాప్తంగా అమలు చేయాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. అందుకు అనుగుణంగానే తెలంగాణలో ఆ పార్టీ పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం ఖమ్మంలో నిర్వహించిన జనగర్జన సభ(Jana Garjana Sabha)ను గ్రాండ్ సక్సెస్ చేసింది. ప్రభుత్వం ఎన్ని అవాంతరాలు కల్పించినా ఈ సభను మొండి పట్టుదలతో కాంగ్రెస్ నిర్వహించిన తీరు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.
ముఖ్యంగా జనగర్జన సభలో ప్రజలకు వరాలను ప్రకటించడంపైనే కాంగ్రెస్ (Congress) దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో తాము అధికారంలోకి వస్తే వృద్ధులు, వితంతువులకు చేయూతగా రూ.4వేలు పెన్షన్ ఇస్తామని ఎవరూ ఊహించని రీతిలో రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా పేదల పక్షానే నిలుస్తుందన్న నమ్మకం కలిగించారు. దీంతో అధికారంలోకి రావాలంటే ఏం చేయాలో కాంగ్రెస్ పార్టీకి తెలిసిపోయిందని ప్రజలు చర్చించుకుంటున్నారు. పనిలో పనిగా బీఆర్ఎస్ అవినీతిపై రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతి గురించి దుమ్మెత్తి పోశారు. అటు రాష్ట్రంలో త్రిముఖ పోరు లేదని.. కేవలం బీఆర్ఎస్ బీ పార్టీతోనే తమకు పోటీ అని ప్రకటించారు. మొత్తానికి ఖమ్మం సభ కాంగ్రెస్ పార్టీలో జోష్ నింపింది. ఇదే తరహాలో తెలంగాణలో పలు చోట్ల సభలు నిర్వహించాలని హస్తం పార్టీ నేతలు యోచిస్తున్నారు. మరోవైపు తమ పార్టీ బలం పెరుగుతుండటం కూడా కాంగ్రెస్ నేతల్లో ఆత్మవిశ్వాసం నింపుతోంది. కాగా కర్ణాటకలో కాంగ్రెస్ ప్రకటించిన బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ పథకం అమలుపై కేసీఆర్ కూడా దృష్టి సారించారు. అయితే తాము అధికారంలోకి వస్తే ఇక్కడ కూడా మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.