Chirala: చీరాల రాజకీయం ఎప్పుడు రసకందాయమే.. తాజా పరిణామం ఏంటంటే..

ABN , First Publish Date - 2023-01-22T21:56:23+05:30 IST

రానున్న ఎన్నికల్లో వైసీపీ చీరాల అభ్యర్థిగా ప్రస్తుతం ఇన్‌చార్జిగా పనిచేస్తున్న కరణం వెంకటేశ్‌నే ప్రకటిస్తారా.. లేక మార్పులు, చేర్పులు ఉంటాయా.. దీనికి సంబంధించి రెండు మూడు రోజుల నుంచి..

Chirala: చీరాల రాజకీయం ఎప్పుడు రసకందాయమే.. తాజా పరిణామం ఏంటంటే..

చీరాల: రానున్న ఎన్నికల్లో వైసీపీ చీరాల అభ్యర్థిగా ప్రస్తుతం ఇన్‌చార్జిగా పనిచేస్తున్న కరణం వెంకటేశ్‌నే ప్రకటిస్తారా.. లేక మార్పులు, చేర్పులు ఉంటాయా.. దీనికి సంబంధించి రెండు మూడు రోజుల నుంచి చీరాల, పర్చూరు, అద్దంకి నియోజకవర్గాల్లో పుకార్లు హల్‌చల్‌ చేస్తున్నాయి. సోమవారం వైసీపీ చీరాల నియోజకవర్గ ముఖ్య నాయకులతో ఆ పార్టీ రీజనల్‌ కో ఆర్డినేటర్ల సమావేశం కానున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆ సందర్భంగా అభ్యర్థి పేరును ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.

చీరాల రాజకీయం ఎప్పుడు రసకందాయమే. వేగంగా మలుపులు తిరిగే రాజకీయ పరిణామాలు అందుకు కారణం. విలక్షణ తీర్పు ఓటర్ల సొంతం. గతంలో జరిగిన ఎన్నికల ఫలితాలు అందుకు నిదర్శనం. దీని ప్రభావం పర్చూరు నియోజకవర్గంపై ఉంటుంది. ఈ రెండు నియోజకవర్గాల ప్రజలు, నాయకులకు ఉన్న సంబంధాలు అందుకు కారణం.

ప్రస్తుతం వైసీపీ చీరాల నియోజకవర్గ ఇన్‌చార్జిగా కరణం వెంకటేశ్‌, పర్చూరు ఇన్‌చార్జిగా, చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ ఉన్నారు. ఆ ఇద్దరూ ఒకే పార్టీలో ఉన్నా ఉప్పు, నిప్పుగానే వారి వ్యవహారం కొనసాగుతుంది. ఈ క్రమంలో ఇటీవల ఒకటికి రెండు పర్యాయాలు ఎమ్మెల్యే బలరాం, ఇన్‌చార్జి వెంకటేశ్‌ సీఎం జగన్‌ను కలవటం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆ క్రమంలో రెండు రోజుల నుంచి చీరాల, అద్దంకి, పర్చూరు నియోజకవర్గాల పరిధిలో పుకార్లు హల్‌చల్‌ చేస్తున్నాయి. అభ్యర్థుల మార్పులు, చేర్పులే వీటి సారాంశం. ఇవి నిజమైతే తమకు లాభిస్తోందని చీరాల టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి.

ఇదిలా ఉంటే చీరాల నియోజకవర్గంలోని వైసీపీ ముఖ్య నాయకులతో ఆ పార్టీ రీజనల్‌ కోఆర్డినేటర్లు 23న సమావేశం కానున్నట్లు సమాచారం. అందుకు సంబంధించి వేటపాలెం మండలంలోని రామాపురం సముద్ర తీరంలో ఉన్న ఓ రిసార్ట్స్‌లో ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. ముఖ్య నాయకులతో ఉమ్మడిగాను, తరువాత ఒక్కొక్కరితో విడివిడిగా రీజనల్‌ కోఆర్డినేటర్లు మాట్లాడతారని సమాచారం. అందరి నుంచి అభిప్రాయాలు సేకరించాక, అభ్యర్థి పేరును ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.

Updated Date - 2023-01-22T21:58:51+05:30 IST