YCP Minister Botsa: పాపం జగన్.. పెద్ద కష్టమే వచ్చి పడిందిగా.. చెప్పకనే చెప్పేసిన బొత్స..!

ABN , First Publish Date - 2023-04-01T17:34:36+05:30 IST

ఏపీలో మంత్రివర్గ విస్తరణకు (Andhra Pradesh Cabinet Reshuffle) వేళయిందా..? ముఖ్యమంత్రి జగన్ రెడ్డి (CM Jagan Reddy) కొందరికి ఉద్వాసన పలికి..

YCP Minister Botsa: పాపం జగన్.. పెద్ద కష్టమే వచ్చి పడిందిగా.. చెప్పకనే చెప్పేసిన బొత్స..!

ఏపీలో మంత్రివర్గ విస్తరణకు (Andhra Pradesh Cabinet Reshuffle) వేళయిందా..? ముఖ్యమంత్రి జగన్ రెడ్డి (CM Jagan Reddy) కొందరికి ఉద్వాసన పలికి.. కొందరిని కేబినెట్‌లోకి తీసుకోవాలని డిసైడ్ అయ్యారా..? ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న చర్చ ఇదే. ఎవరిని తీసేస్తారు, ఎవరిని తీసుకుంటారనే చర్చలు రచ్చబండ నుంచి రాజకీయ వర్గాల దాకా జోరుగా సాగుతున్నాయి. మంత్రి సీదిరి అప్పల రాజును (YCP Minister Seediri Appalaraju) హుటాహుటిన తాడేపల్లికి పిలిచి జగన్ మాట్లాడటంతో మంత్రివర్గ కూర్పుపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. తాజాగా.. మంత్రి బొత్స సత్యనారాయణ (YCP Minister Botsa Satyanarayana) చేసిన వ్యాఖ్యలు ఆ అనుమానాన్ని మరింత బలపడేలా చేశాయి.

అమరావతిలో బొత్స మాట్లాడుతూ.. ‘మంత్రి వర్గంలో మార్పులు సీఎం గారి ఇష్టం.. ఒక ఎమ్మెల్సీ ఓడిపోయినంత మాత్రాన వచ్చిన నష్టం ఏంటి’ ? అని వ్యాఖ్యానించడం గమనార్హం. అంతేకాదు.. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో (AP MLC Election Results) వైసీపీలో (YCP) రేగిన కల్లోలాన్ని కూడా బొత్స పరోక్షంగా బయటపెట్టారు. ‘ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఓటమి నా ఫెయిల్యూర్‌గా భావిస్తున్నాను. మంత్రిగా ఉండి నేనే ఎమ్మెల్సీ గెలుపు బాధ్యత తీసుకున్నాను. ఎందుకు ఓడిపోయామనేది సమీక్షించుకుంటున్నాను. ఓటమికి తప్పు నాది కాదని పారిపోయే వాడిని కాదు. లోపాలను సరిద్దిదుకుని మళ్లీ రిపీట్ కాకుండా చూసుకుంటాం’ అని బొత్స చేసిన వ్యాఖ్యలు వైసీపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఏరేంజ్‌లో నైరాశ్యం నింపాయో చెప్పకనే చెప్పేశాయి. మంత్రి బొత్స తాజా వ్యాఖ్యలు కేబినెట్‌లో మార్పులు ఖాయమనే సంకేతాలిచ్చాయి.

బొత్స సీటుకే ఎసరు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని తాజా పరిణామాలను నిశితంగా పరిశీలించిన రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఉత్తరాంధ్రలో కీలక నగరమైన విశాఖ కేంద్రంగా.. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా సాగర నగరం నుంచి పాలన సాగిస్తానని చెప్పిన జగన్ మాటలను ప్రజలు విశ్వసించలేదని ఉత్తరాంధ్రలో జరిగిన గ్రాడ్యుయేట్ల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఇప్పటికే స్పష్టం చేశాయి. టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవి రావు ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో జయకేతనం ఎగురవేయడంతో ఉత్తరాంధ్రలో వచ్చే ఎన్నికల్లో వైసీపీకి కష్టమేననే ప్రచారం ఊపందుకుంది. వైసీపీ అంచనా వేయలేనంత అనూహ్య రీతిలో ఉత్తరాంధ్రలో టీడీపీ బలపడటంతో జగన్ సీరియస్‌‌గా ఉత్తరాంధ్రపై ఫోకస్ పెట్టినట్లు సమాచారం. మంత్రి వర్గ కూర్పు కూడా ఆ దిద్దుబాటు చర్యలో భాగమనే తెలుస్తోంది. సీదిరి అప్పలరాజు విషయంలో కూడా జగన్ తప్పించాలని భావించడం వెనుక కారణం ఉందట.

శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడా లేని విధంగా.. పలాస నియోజకవర్గంలో స్వపక్షంలో విపక్షం తయారైంది. రెండు వర్గాలుగా విడిపోయి.. మంత్రి సీదిరిపై బహిరంగంగానే అసమ్మతి వెళ్లగక్కుతున్నారు. పలుమార్లు అసమ్మతి నేతలు సమావేశమై.. మంత్రి నియోజకవర్గంలోని అక్రమాలను పరోక్షంగా వెలుగులోకి తెస్తున్నారు. మంత్రి చుట్టూ చేరిన నలుగురి వల్ల.. సీదిరికి మరింత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడిందని.., ఇదే అసమ్మతికి కారణమని ప్రచారం జరుగుతోంది. మంత్రి అనుచరులపై భూ ఆక్రమణల ఆరోపణలు ఉన్నాయి. వీటిని అరికట్టడంలో తాత్సారం చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే.. సీదిరి అప్పలరాజుపై వేటు వేయాలని జగన్ డిసైడ్ అయినట్లు టాక్. రేపోమాపో అధికారికంగా నిర్ణయం వెలువడే ఛాన్స్ కూడా ఉన్నట్లు సమాచారం.

తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మంత్రి సీదిరి అప్పలరాజు మీడియాతో మాట్లాడిన సందర్భంలో కూడా నైరాశ్యంతో కూడిన వ్యాఖ్యలు చేయడం తప్పిస్తున్నారనే ప్రచారానికి బలం చేకూర్చాయి. ‘మంత్రి పదవి ఉన్నా లేకపోయినా బాధపడను. మంత్రి పదవికన్నా ప్రజా సేవే ముఖ్యం’ అంటూ వ్యాఖ్యానించారు. ‘‘బీసీ నుంచి వచ్చిన నాకు మంత్రి పదవి జగన్‌ ఇచ్చారు. కాగా కొత్తగా నలుగురికి మంత్రి పదవులు ఇవ్వనున్నారని.. పాతవారిని తొలగించనున్నట్టు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం సాగుతోంది. మంత్రి పదవి నుంచి తొలగిస్తారనే సమాచారం నా వద్ద లేదు. పదవి లేక పోయినా బాధపడను’’ అని సీదిరి పేర్కొన్నారు. మొత్తంగా చూసుకుంటే.. సీదిరి ఎపిసోడ్‌, బొత్స తాజా వ్యాఖ్యలు జగన్ మంత్రివర్గంలో మార్పులుచేర్పులు ఖాయమనే సంకేతాలిచ్చాయి.

Updated Date - 2023-04-01T17:35:33+05:30 IST