CBN Arrest : రాజమండ్రి జైల్లో చంద్రబాబుకు అస్వస్థత.. వైద్య పరీక్షల్లో ఏం తేలిందంటే..?

ABN , First Publish Date - 2023-10-12T18:51:29+05:30 IST

టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు ఇటీవల రాజమండ్రి సెంట్రల్ జైలులో అస్వస్థతకు లోనైన సంగతి తెలిసిందే..అయితే.. గురువారం కూడా మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో హుటాహుటిన వైద్యులు జైల్లో పరీక్షలు నిర్వహించారు.

CBN Arrest : రాజమండ్రి జైల్లో చంద్రబాబుకు అస్వస్థత.. వైద్య పరీక్షల్లో ఏం తేలిందంటే..?

టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు ఇటీవల రాజమండ్రి సెంట్రల్ జైలులో అస్వస్థతకు లోనైన సంగతి తెలిసిందే. గత వారం రోజులుగా ఎండ తీవ్రత భారీగా ఉండటంతో బాబు ఒక్కసారిగా డీ హైడ్రేషన్‌కు గురయ్యారు. ఈ విషయంపై జైల్లో ఉన్న వైద్యాధికారికి చంద్రబాబు ఫిర్యాదు చేశారు. అనంతరం బాబుకు పరీక్షలు చేసి ఆరోగ్యంగానే ఉన్నారని చెప్పారు. ఆయన ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు. అయితే.. గురువారం కూడా మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో హుటాహుటిన వైద్యులు జైల్లో పరీక్షలు నిర్వహించారు.


Babu-Jail.jpg

హుటాహుటిన..!

చంద్రబాబు చర్మ సంబంధిత అలర్జీ వచ్చిందని వైద్యులు గుర్తించారు. దీంతో.. చర్మవ్యాధి వైద్య నిపుణులను పంపించాలని జైలు అధికారులు రాజమహేంద్రవరం జీజీహెచ్ సూపరింటెండెంట్‌కు లేఖ రాశారు. అత్యవసరంగా పంపించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. ఒక అసోసియేట్ ప్రొఫెసర్, ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్‌ను జీజీహెచ్ అధికారులు కేటాయించారు. సెంట్రల్ జైలుకు వెళ్లిన వైద్యులు డాక్టర్ సూర్యనారాయణ, డాక్టర్ సునీత దేవి వైద్య పరీక్షలు నిర్వహించి.. అనంతరం సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చి జీజీహెచ్‌కు వెళ్లారు. వైద్యులు నిశితంగా మరోసారి పరీక్షలు చేశాక.. ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి..? ఏం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇవాళ రాత్రికి చంద్రబాబు ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

Chandrababu.jpg

ఆందోళనలో ఫ్యామిలీ, టీడీపీ శ్రేణులు!

చంద్రబాబు అనారోగ్యంగా ఉన్నారని తెలియడంతో కుటుంబ సభ్యులు, అభిమానులు, టీడీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. ఆయన అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలని టీడీపీ నేతలు, కార్యకర్తలు పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు సైతం ప్రారంభించారు. జైల్లో చంద్రబాబుకు సరైన వసతులు లేవని కనీసం వేడి నీళ్లు కూడా ఇవ్వట్లేదని.. బ్యారక్‌లో ఎండతీవ్రత ఎక్కువగా ఉందని మొదట్నుంచీ ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్న విషయం తెలిసిందే. ఆ మధ్య హైకోర్టు, ఏసీబీ కోర్టుకు ఇదే విషయాన్ని బాబు తరఫు లాయర్ సిద్ధార్థ లూథ్రా కూడా వివరించారు. అయినప్పటికీ ఏమీ ప్రయోజనం లేకుండా పోయింది. అయితే అప్పుడే హౌస్ కస్టడీకి ఇచ్చి ఉన్నా.. లేకుంటే బెయిల్ ఇచ్చి ఉన్నా ఈ పరిస్థితి వచ్చేది కాదని టీడీపీ శ్రేణులు ఒకింత ఆవేదన చెందుతున్నాయి. ఇప్పటికే రెండుసార్లు బాబు అస్వస్థతకు గురవ్వడంతో మెరుగైన వైద్యం అందించాలని తెలుగు తమ్ముళ్లు కోరుతున్నారు. శుక్రవారం నాడు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి.. పలువురు టీడీపీ కీలక నేతలు ములాఖత్ కాబోతున్నారని తెలిసింది.

Babu-Health.jpg


ఇవి కూడా చదవండి


Skill Case : స్కిల్ డెవలప్మెంట్ కేసులో లోకేష్‌కు భారీ ఊరట


Lokesh Delhi Tour : అమిత్ షాతో కీలక భేటీ తర్వాత.. లోకేష్ ఢిల్లీలో ఏం చేయబోతున్నారు.. రేపు సంచలనమేనా..!?


Updated Date - 2023-10-12T19:09:26+05:30 IST