Karnataka BJP: ఏప్రిల్ 2022లో జరిగిన ఓ ఘటన కర్ణాటకలో బీజేపీ గద్దెదిగడానికి ప్రధాన కారణమైంది...

ABN , First Publish Date - 2023-05-16T13:03:31+05:30 IST

కర్ణాటకలో ఒకే ఒక్క ప్రచార నినాదం ఏకంగా అక్కడి బీజేపీ ప్రభుత్వాన్ని కుప్పకూల్చింది. ఇంతకీ ఆ నినాదం ఏంటి?, అది ఎలా మొదలైందో ఈ కథనంలో చూద్దాం...

Karnataka BJP: ఏప్రిల్ 2022లో జరిగిన ఓ ఘటన కర్ణాటకలో బీజేపీ గద్దెదిగడానికి ప్రధాన కారణమైంది...

కర్ణాటకలో బీజేపీ (BJP) ఓడిపోవడం ఖాయమని... కాంగ్రెస్ పార్టీ (Congress party) అధికారాన్ని చేజిక్కించుకుంటుందంటూ ఎన్నికలకు చాన్నాళ్ల ముందు నుంచే పెద్దఎత్తున ప్రచారం జరిగింది. చూస్తుండగానే ఎన్నికలు ముగిసిపోవడం, కాంగ్రెస్ పార్టీ ఏకంగా 135 సీట్లతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడం చకచకా జరిగిపోయాయి. మరి ఎన్నికలకు ఏడాది ముందే బీజేపీపై ఈ స్థాయిలో తీవ్ర వ్యతిరేకత ఎందుకు వ్యక్తమైంది?. బసవరాజ్ బొమ్మై (Basavaraj Bommai govt) ప్రభుత్వం అవినీతిమయమైందని, ‘40 శాతం ప్రభుత్వం’గా (40 percent commission) ఎందుకు ముద్రపడింది?. ఏకంగా ప్రభుత్వాన్నే కుప్పకూల్చిన ఈ ప్రచారానికి ప్రధాన కారణం ఏంటి?.. ఈ ప్రత్యేక కథనంలో గమనిద్దాం...

‘40 శాతం కమిషన్’ ప్రచారం ఎలా మొదలైంది?

‘40 శాతం కమిషన్ ప్రభుత్వం’.. ఈ నినాదమే కర్ణాటకలో బీజేపీ కొంపముంచింది. అధికార పార్టీ ఘోరఓటమికి దారితీసిన ప్రధాన కారణమైంది. ఎంతలా అంటే ఎగ్జిట్ పోల్స్ అంచనాల కంటే తక్కువ సీట్లకు పరిమితమయ్యేలా చేసింది. అంతలా ప్రభావం చూపిన ఈ ‘40 శాతం కమిషన్’ ముద్ర ఏప్రిల్ 2022లో మొదలైంది. కర్ణాటక బీజేపీ నేత, మాజీ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప ఒక ప్రభుత్వ ప్రాజెక్ట్ కోసం తనను 40 శాతం కమిషన్ డిమాండ్ చేస్తున్నారంటూ బెళగావికి చెందిన కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ (Santosh Patil) ఆత్మహత్య చేసుకున్నారు. మంత్రిపై ఆరోపణలు గుప్పిస్తూ లేఖ రాసి తనువు చాలించారు. ఈ పరిణామంతో రాష్ట్రవ్యాప్తంగా పలువురు కాంట్రాక్టర్లు రోడ్డెక్కారు. ప్రభుత్వ అధికారులపై ఇదే తరహా ఆరోపణలు చేశారు. దీంతో కాంట్రాక్టర్ల అసోసియేషన్ రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టింది. వేర్వేరు ప్రభుత్వ విభాగాలతోపాటు రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు చెల్లించడంలేదంటూ కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. మరింత ఎక్కువ అవినీతికి పాల్పడేందుకు వీలుగా స్థానికులను కాదని ఇతర రాష్ట్రాలకు చెందిన కాంట్రాక్టర్లకు పనులు అప్పగిస్తున్నారంటూ కర్ణాటక స్టేట్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆరోపించారు. డిసెంబర్ 2021 నుంచి బిల్లులు క్లియర్ చేయలేదని ఆరోపించారు. విస్తృత ప్రచారం జరగడంతో బీజేపీ ప్రభుత్వంపై అవినీతి ముద్రపడింది.

అందిపుచ్చుకున్న కాంగ్రెస్..

బీజేపీ ప్రభుత్వంపై కాంట్రాక్టర్లు చేసిన అవినీతి ఆరోపణలను కాంగ్రెస్ ప్రచారాస్త్రంగా మార్చుకుంది. ‘40 కమిషన్ ప్రభుత్వం’ నినాదంగా మార్చుకొని విస్తృతంగా జనాల్లోకి తీసుకెళ్లింది. అవినీతిపై బీజేపీ ప్రభుత్వ పెద్దలు తిప్పికొట్టలేనంతగా కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేశారు. ఎన్నికల సమయంలో ఈ నినాదాన్నే ప్రధానాస్త్రంగా మార్చుకున్నారు. జనాలు నమ్మడంతో ఎన్నికల్లో ఓట్ల వర్షం కురిపించారు. ఫలితంగా బీజేపీ ఘోరఓటమిని మూటగట్టుకోవాల్సి వచ్చింది. ఏకంగా 135 సీట్లతో కాంగ్రెస్ అధికారాన్ని చేజిక్కించుకున్న విషయం తెలిసిందే.

Updated Date - 2023-05-16T13:05:38+05:30 IST