America Visa: ఆసియాలోనే అతిపెద్ద అమెరికన్ కాన్సులేట్ కార్యాలయం.. ఇకపై వీసాల కోసం వేచి ఉండే అవస్థలకు చెక్!

ABN , First Publish Date - 2023-03-21T07:33:12+05:30 IST

దాదాపు 14 సంవత్సరాలుగా హైదరాబాద్‌ బేగంపేటలోని పైగాప్యాలె్‌సలో వీసా సేవలు అందించిన అమెరికా కాన్సులేట్‌.. తన కార్యకలాపాలను సోమవారం నుంచి నానక్‌రామ్‌గూడలోని కొత్త కార్యాలయంలో ప్రారంభించింది.

America Visa: ఆసియాలోనే అతిపెద్ద అమెరికన్ కాన్సులేట్ కార్యాలయం.. ఇకపై వీసాల కోసం వేచి ఉండే అవస్థలకు చెక్!

ప్రారంభమైన నూతన కాన్సులేట్‌ భవనం

12.2 ఎకరాల్లో.. 2,429 కోట్లతో నిర్మాణం.. 54 వీసా విండోలు.. ఆసియాలోనే అతిపెద్దది

కార్యాలయ మార్పు నేపథ్యంలో 5 రోజులుగా నిలిచిన అమెరికా వీసా సేవలు.. మళ్లీ షురూ

భారత్‌-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంలో కొత్త అధ్యాయం: కాన్సులేట్‌ జనరల్‌ జెన్నిఫర్‌

హైదరాబాద్‌ సిటీ, స్పెషల్‌ డెస్క్‌, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): దాదాపు 14 సంవత్సరాలుగా హైదరాబాద్‌ బేగంపేటలోని పైగాప్యాలె్‌సలో వీసా సేవలు అందించిన అమెరికా కాన్సులేట్‌.. తన కార్యకలాపాలను సోమవారం నుంచి నానక్‌రామ్‌గూడలోని కొత్త కార్యాలయంలో ప్రారంభించింది. ఇది ఆసియాలో కెల్లా అతి పెద్ద అమెరికన్‌ కాన్సులేట్‌ కార్యాలయం. ఇందులో లాంఛనంగా అమెరికా పతాకాన్ని ఆవిష్కరించి సేవలకు శ్రీకారం చుట్టారు. 12.2 ఎకరాల విస్తీర్ణంలో.. దాదాపు రూ.2,429 కోట్ల వ్యయంతో, అత్యంత అధునాతన సౌకర్యాలతో ఈ కాన్సులేట్‌ భవనాన్ని నిర్మించారు. ఇక్కణ్నుంచీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా రాష్ట్రాలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని అమెరికన్‌ కాన్సులేట్‌ జనరల్‌ జెన్నిఫర్‌ లార్సన్‌ తెలిపారు. కొత్త కార్యాలయాన్ని పూర్తి పర్యావరణహితంగా నిర్మించామని.. వాననీటిని ఒడిసిపట్టి, శుద్ధి చేసి తిరిగి వినియోగించుకునేలా చర్యలు చేపట్టామని, కాన్సులేట్‌ ప్రాంగణంలోని సహజ శిలల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని ఆమె వివరించారు. భారత్‌-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంలో నూతన అధ్యాయం ప్రారంభమైందని పేర్కొన్నారు. గడిచిన 14 ఏళ్ల కాలంలో 16 లక్షల వీసాలు జారీ చేశామని.. కొత్త కాన్సులేట్‌ కార్యాలయం నుంచి మరింత మెరుగైన సేవలు అందిస్తామని ఆమెతెలిపారు. పాత కార్యాలయంలో 20 వీసా ఇంటర్వ్యూ విండోలు ఉండేవి. అయితే, ఇటీవలికాలంలో అమెరికా వీసాల కోసం దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య.. వీసాల కోసం వెయిటింగ్‌ లిస్ట్‌ భారీగా పెరిగిపోవడంతో.. కార్యాలయ మార్పు నిర్ణయానికి వచ్చింది. కొత్త భవనంలో వీసా ఇంటర్వ్యూ విండోల సంఖ్యను 54కు పెంచింది. కార్యాలయ మార్పులో భాగంగా మార్చి 15 మధ్యాహ్నం 12 గంటల నుంచి మార్చి 20న ఉదయం 8.30 గంటల వరకు కాన్సులేట్‌ సేవలు నిలిచిపోయాయి. కొత్త భవనం ప్రారంభం కావడంతో సోమవారం నుంచి మళ్లీ వీసా సేవలు ప్రారంభం అయినట్లు కాన్సులేట్‌ వర్గాలు తెలిపాయి. ఇందులో అదనపు విండోలు ఏర్పాటు చేయడంతో వీసాల కోసం వేచి ఉండే అవస్థ చాలావరకూ తగ్గుతుందని విద్యార్థులు, ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. కాగా, ఈ కొత్త కాన్సులేట్‌లో.. మరింత మంది సిబ్బందిని నియమించి వేగంగా, గతంలో కంటే ఎక్కువగా వీసాలు జారీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని జెన్నిఫర్‌ తెలిపారు.

కొత్త కార్యాలయం ఎక్కడంటే..

హైదరాబాద్‌లో యుఎస్‌ కాన్సులేట్‌ నూతన కార్యాలయం నానక్‌రామ్‌గూడ సమీపంలోని ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్‌ వద్ద సర్వే నంబర్‌ 115/1 వద్ద ఉంది. వీసా దరఖాస్తుదారులందరూ ఇంటర్వ్యూల కోసం ఈ నూతన కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. ఇతర వీసా సేవలు అంటే బయోమెట్రిక్‌ అపాయింట్‌మెంట్స్‌, డ్రాప్‌బాక్స్‌ అపాయింట్‌మెంట్స్‌ (ఇంటర్వ్యూ మినహాయింపు), పాస్‌పోర్ట్‌ పికప్‌ సేవలు ఎప్పటిలాగానే మాదాపూర్‌లోని హైటెక్‌ మెట్రో స్టేషన్‌ లోయర్‌ కాన్‌కోర్స్‌ వద్దనున్న వీసా అప్లికేషన్‌ కేంద్రంలో కొనసాగుతాయి.

ముఖ్యమైన ఫోన్‌ నంబర్లు

అత్యవసర కాన్సులర్‌ సేవలను కోరుకునే యుఎస్‌ పౌరులు +91 040 6932 8000కు కాల్‌ చేయాల్సి ఉంటుంది.

అత్యవసర సేవలు అవసరం లేని యుఎస్‌ పౌరులు HydACS@state.gov ఈమెయిల్‌ చేయవచ్చు.

సాధారణ కాన్సులర్‌ సేవలకు సంబంధించిన సందేహాలను తీర్చుకోవడం కోసం +91 120 4844644 (లేదా) +91 22 62011000 నంబర్‌కు కాల్‌ చేయవచ్చు.

Updated Date - 2023-03-21T07:33:12+05:30 IST