NRI: తెలంగాణ బడ్జెట్‌లో ఎన్నారైల సంక్షేమానికి కేటాయింపుల కోసం దుబాయిలో సమావేశం

ABN , First Publish Date - 2023-01-29T20:17:56+05:30 IST

దుబాయిలో తెలంగాణా ప్రవాసీయుల డిమాండ్. ఎన్నారైల సంక్షేమం కోసం బడ్జెట్‌లో కేటాయింపులకు అభ్యర్థన.

NRI: తెలంగాణ బడ్జెట్‌లో ఎన్నారైల సంక్షేమానికి కేటాయింపుల కోసం దుబాయిలో సమావేశం

  • తెరాస శుష్క వాగ్దానాలపై ఆగ్రహం

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: త్వరలో ప్రవేశపెట్టనున్న తెలంగాణ బడ్జెట్‌లో గల్ఫ్ ప్రవాసీయుల సంక్షేమానికి నిధుల కేటాయింపు చేయాలని కోరుతూ దుబాయిలో ఆదివారం తెలంగాణ ప్రవాసీ సంఘాల ప్రతినిధులు సమావేశాన్ని నిర్వహించారు.

తెరాస అధికారంలోకి రాకముందు ప్రవాసీయుల సంక్షేమానికి అనేక హామిలిచ్చి ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదని, ఇప్పటి వరకు 9 సార్లు బడ్జెట్‌ ప్రవేశపెట్టగా 2018లో ఒకసారి 100 కోట్ల రూపాయలు కేటాయించి ఒక్క నయా పైసా కూడా వెచ్చించ లేదని సమావేశంలో విమర్శించారు.

మైగ్రెంట్స్ రైట్స్, వెల్ఫేర్ ఫోరం (యం.ఆర్.డబ్ల్యూ.యఫ్) ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో వివిధ తెలంగాణ సంఘాల ప్రతినిధులు పాల్గొని గల్ఫ్ ప్రవాసీయుల సంక్షేమానికి కనీసం చివరి బడ్జెట్‌లోనైనా 500 కోట్ల రూపాయాలు కేటాయించడంతో పాటు ప్రవాసీయుల సంక్షేమానికి ప్రత్యేకంగా ఒక బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసారు.

యం.ఆర్.డబ్ల్యూ.యఫ్ అధ్యక్షుడు కోటపాటి నరసింహానాయుడు నిజామాబాద్ జిల్లా నుండి ప్రత్యేకంగా వచ్చి ఈ సమావేశాన్ని నిర్వహించగా స్థానికంగా వివిధ సంఘాల నాయకులైన జంగం బాలకిషన్, పాటుకూరి తిరుపతి రెడ్డి, జి.డబ్ల్యూ.సి.ఏ అధ్యక్షుడు జువ్వాడి శ్రీనివాసరావు, గల్ఫ్ తెలంగాణ సంక్షేమ అధ్యక్షుడు గుండెల్లి నరసింహులు, ఇతర నాయకులు భూమయ్య, ఉట్నూరి రవి, బాలు బొమ్మాడి, భవానీ బాబురావు, సార్జా మహేందర్, కె.మహేందర్, వంశీ గౌడ్, కోరేపి మల్లేశం, కల్లెడ భూమన్న, ఆకుల సురేందర్ తదితరులు పాల్గొన్నట్లుగా నర్సింహా నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు.

Updated Date - 2023-01-29T20:21:25+05:30 IST