NRI: దక్షిణాఫ్రికాలో దారుణ ప్రమాదం.. ఐసీయూలో భారత సంతతి టీనేజ్ బాలిక..

ABN , First Publish Date - 2023-01-05T21:18:50+05:30 IST

గో కార్ట్‌ రేసింగ్‌ సందర్భంగా జరిగిన ప్రమాదంలో దక్షిణాఫ్రికాలోని ఓ భారత సంతతి టీనేజ్ బాలిక తీవ్రంగా గాయపడింది.

NRI: దక్షిణాఫ్రికాలో దారుణ ప్రమాదం.. ఐసీయూలో భారత సంతతి టీనేజ్ బాలిక..

ఎన్నారై డెస్క్: గో కార్ట్‌ రేసింగ్‌(Go-Kart Racing) సందర్భంగా జరిగిన ప్రమాదంలో(Accident) దక్షిణాఫ్రికాలోని(South Africa) ఓ భారత సంతతి టీనేజ్(Indian Origin Teenager) బాలిక తీవ్రంగా గాయపడింది. గో కార్ట్ అనే తేలికపాటి స్పోర్ట్స్ కార్‌ చక్రాల్లో క్రిస్టెన్ గోవిందర్(15) జుట్టు చిక్కుకుపోవడంతో నెత్తిపైనున్న చర్మం ఊడొచ్చింది. జోహాన్నెస్‌బర్గ్‌లోని(Johannesburg) ఓ ఎంటర్‌టైన్మెంట్ కేంద్రంలో గత గురువారం ఈ ప్రమాదం జరిగింది. కేంద్రం నిర్వాహకులు సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపపోవడంతో ఈ ఘటన జరిగిందని బాధితురాలి తండ్రి వర్నాన్ గొవిందర్ ఆరోపించారు. తన కూతురి నడుము కింద భాగంలో కదలికలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్వహకులు చెప్పిన నిబంధనలన్నీ క్రిస్టెన్ పాటించిందని ఆయన చెప్పుకొచ్చారు. జుట్టును పోనీ టైల్‌గా ముడివేసుకుని ఆపై హెల్మెట్ ధరించిందని వివరించారు.

రేసు జరుగుతుండగా.. కారు టైర్లను కప్పి ఉంచే కవర్ వదులుగా మారిన విషయాన్ని కూతురు నిర్వహకుల దృష్టికి తీసుకెళ్లిందని అన్నారు. వదులైన భాగాన్ని తొలగించి రేసు కొనసాగించాలని వారు సూచించినట్టు పేర్కొన్నారు. ఈ క్రమంలో క్రిస్టెన్ పోనీ టైల్ ముడి ఊడిపోయి జుట్టు కారు వెనుక టైర్‌కు చిక్కుకుని ప్రమాదం జరిగిందన్నారు. ప్రమాదం జరిగాక తనకు సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదని, విషయం తెలిసిన వెంటనే అక్కడి భద్రతా అధికారులు ఎటో వెళ్లిపోయారని చెప్పారు. కానీ.. నిర్వాహకులు మాత్రం ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. ఎనిమిదేళ్లుగా తాము ఈ కేంద్రం నిర్వహిస్తున్నామని, ఇలాంటి ప్రమాదం ఎప్పుడూ చూడలేదని వారు పేర్కొన్నారు. కొందరు తల్లిదండ్రులు తమ కుమార్తెల జుట్టును భద్రతా సిబ్బంది ముడి వేసేందుకు ఒప్పుకోరని, అందుకని ఆ బాధ్యతను క్లైంట్లకే అప్పగిస్తామని పేర్కొన్నారు.

Updated Date - 2023-01-06T00:06:28+05:30 IST