Mukarram Jah Bahadur: ప్రజల ప్రిన్స్ కాని ఎనిమిదో నిజాం

ABN , First Publish Date - 2023-01-25T07:18:26+05:30 IST

దక్కన్, ముఖ్యంగా తెలంగాణ చరిత్రలో అసఫ్ జాహీ రాజవంశం ఒక ముఖ్య అధ్యాయం.

Mukarram Jah Bahadur: ప్రజల ప్రిన్స్ కాని ఎనిమిదో నిజాం

దక్కన్, ముఖ్యంగా తెలంగాణ చరిత్రలో అసఫ్ జాహీ రాజవంశం ఒక ముఖ్య అధ్యాయం. ఏడు తరాల పాలన (1724–1948)లో ఏడవ, ఆఖరి నిజాం అధికార హయాంలోని చివరి రెండు సంవత్సరాలలో, కారణాలు ఏమైనా పొరపాట్లు జరిగాయి. వాటి పర్యవసానాలు ఇప్పటికీ చరిత్రను వెంటాడుతున్నాయి.

స్వతంత్ర భారతదేశంలో విలీనమైన దాదాపు ఐదు వందల సంస్థానాల రాచరిక పాలకులు అందరిలోనూ అపార సిరిసంపదలు కలిగినవారు హైదరాబాద్ సంస్థానాధీశులైన నిజాం నవాబులే. ఇటీవల మరణించిన ఎనిమిదో నిజాం మీర్ బర్కత్ అలీ ఖాన్ అలియాస్ ముకరం జా బహదూర్ అసఫ్ జాహీ రాజవంశ చివరి చట్టబద్ధ వారసుడు. తాత ఏడో నిజాంకు ఆయన అనూహ్యంగా వారసుడు అయ్యారు. వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులకు వారసుడయిన ముకరం జా వ్యక్తిగత, సామాజిక జీవితాలలో గానీ, అంతకు మించి వంశపార్యంపర విధానాలను పాటించడంలో గానీ రాణించలేకపోయారు.

విద్యా, వైద్య రంగాలలో ఎనిమిదవ నిజాం చేసిన సేవలకు గుర్తింపుగా ఆయనకు అధికారిక లాంఛనాలతో అంతిమ క్రియలు నిర్వహించినట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది, వాస్తవానికి ఆ రంగాలలో ఆయన చేసింది పెద్దగా ఏమీ లేదు. రాజ్యం కోల్పోయినా కూడా స్వంత భూమిలో తన స్వంత నిధులతో తాత ఉస్మాన్ అలీ ఖాన్, తల్లి దుర్రె షాహెవార్, పినతల్లి నీలోఫర్‌లు నెలకొల్పిన నిమ్స్, దుర్రె షాహెవార్, నీలోఫర్ ఆసుపత్రులే హైదరాబాద్ నగరంలో ఒకప్పుడు వైద్యానికి దిక్కు. అందులో ముకరం జా పాత్ర ఏమీ లేదు. వైద్య రంగంలో ఏ ఒక్క సార్ధక సేవనూ ఆయన చేయలేదు. విద్యా రంగంలో హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్‌లో ఉన్న సువిశాల యంజె కాలేజీ, ఇతర విద్యా సంస్థలను సోదరుడు ముఫ్ఖం జా నెలకొల్పారు. ముకరమ్ జా బహదూర్ స్వంతంగా తన పేరిట నెలకొల్పిన ఒక పాఠశాల సైతం ఏదో ఉన్నదిలే అన్నట్టుగా ఉన్నది.

ఇక ఆస్తుల విషయానికి వస్తే, దేశంలోనూ విదేశాలలోనూ నిజాం కుటుంబానికి విలువైన ఆస్తులు అనేకం ఉన్నాయి. అందులో సౌదీ అరేబియాలోని మక్కా పుణ్యక్షేత్రంలో సర్ఫె ఖాస్ నిధులతో నిజాం నవాబులు నెలకొల్పిన సత్రం చాలా విలువైనది. దానికి సంబంధించిన కాగితాలపై, సౌదీ అరేబియా అధికారుల ముందుకు వచ్చి సంతకం చేయడానికి తన యావత్తు జీవితంలో కూడ ముకరమ్ జాకు సమయం దక్కలేదు! అదే విధంగా లండన్, పారిస్‌లలో సంపన్నులు నివసించే ప్రాంతాలలో ఉన్న ఆస్తులను గానీ ముంబై మహానగరంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి అధికారిక నివాసం పొరుగున ఉన్న సువిశాల స్థలాన్ని గానీ ఎనిమిదో నిజాం సరిగ్గా చూసుకోలేకపోయారు. తాత ఉస్మాన్ అలీ ఖాన్ నివసించిన కింగ్ కోఠి తన కళ్ళ ఎదురుగా అన్ని వైపుల నుంచి ఆక్రమణలకు గురవుతున్నా ఆయన కనీసం దాని వైపు కన్నెత్తి చూడలేదు. తండ్రి కానుకగా ఇచ్చిన బంజారాహిల్స్‌లోని 400 ఎకరాల చిరాన్ ప్యాలెస్ కాసు బ్రహ్మానందరెడ్డి జాతీయ పార్కుగా మారినా ఆయన ఏమి చేయలేకపోయారు.

నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తన ఆస్తులలో ఒక గజం భూమి కూడా ఎక్కడా వదులుకోలేదు. ఆక్రమణకు గురి కాకుండా కాపాడుకున్నారు. 1967లో ఆయన మరణానంతరం ఆ ఆస్తులు న్యాయపరమైన చిక్కులు, వారసత్వ విబేధాలు, పన్ను పోట్లకు గురయ్యాయి. ఆయన వారసుడుగా ఉన్న ముకరం జా నే అందుకు కారణమని చెప్పక తప్పదు. అమాయకంగా అందరినీ నమ్మి మోసపోయిన వ్యక్తిగా ఎనిమిదో నిజాం పట్ల పలువురు సానుభూతి చూపుతారు. ఆత్మీయులతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డి.జి.పిలుగా పని చేసిన అధికారులు కూడా ఆయన్ని మోసం చేశారని అంటారు. ఎవర్ని నమ్మాలి ఎవర్ని నమ్మకూడదో తెలియని పరిస్థితులలో ఆయన తన జీవితాన్ని గడిపారు. లండన్‌లో నివశిస్తున్న కాలంలో సంజయ్ గాంధీతో ఆయనకు ఒక వివాదం ఏర్పడింది. అప్పటి వరకు అప్పుడప్పుడు భారత్‌కు వచ్చిపోతుండే ఎనిమిదో నిజాం ఆ వివాదంతో మాతృభూమిని మరిచిపోయారు. ఆస్ట్రేలియా, టర్కీలలో జీవితమంతా నిత్య పెళ్ళి కొడుకుగా గడిపారు. విడాకుల భరణం క్రింద పూర్వీకుల సంపదను ఆవిరిచేశారు. ముకరం జాను వీలయినంతగా సామాజిక సేవ, ప్రధాన స్రవంతి నుంచి దూరంగా ఉంచడానికి మజ్లీస్ ప్రయత్నించి విజయవంతమైంది.

నిజాం వారసుల ఆస్తుల గురించి నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డికి పూర్తి అవగాహన ఉన్నది. చిరాన్ ప్యాలెస్‌లో నెమళ్ళను చూస్తూ వినోదంగా గడిపే ముకరం జా ను సామాజిక సేవా రంగంలో ప్రోత్సాహించడానికి బ్రహ్మానంద రెడ్డి విఫలయత్నం చేశారు. అదే సమయంలో ఆయన ప్రోత్సహంతో స్పెయిన్ జాతీయుడయిన క్రైస్తవ ధర్మప్రచారకుడు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ అనంతపురం జిల్లాకు వచ్చి స్థిరపడ్డారు. ఒక ట్రస్టును ఏర్పాటు చేసి, దాని ద్వారా ఆ కరువు సీమకు అనుపమానమైన సేవలు అందించారు. అటువంటి మానవతా సేవలు తెలంగాణలో కూడా ఇతరులు చేశారు. అయితే సుసంపన్నమైన 48 ట్రస్టులు ఉండి కూడ ముకరం జా కనీసం హైద్రాబాద్ నగరంలోనైనా చెప్పుకోదగ్గ సేవలేవీ అందించలేదు.

హైదరాబాద్ సంస్థాన చివరి పాలకుడు ఉస్మాన్ అలీ ఖాన్ గురించి ఇప్పుడు ఎవరు ఏమి చెప్పినా 1967లో ఆయన అంతిమ యాత్రకు వచ్చిన జనసందోహం నగర చరిత్రలో ఒక రికార్డు. 1986లో తెలుగుదేశం పార్టీ మహానాడుకు వచ్చిన జనం కంటే అది రెండింతలు ఎక్కువ. ముకరమ్ జా కు వీడ్కోలు పలికిన జనం స్వల్పం.

మొహమ్మద్ ఇర్ఫాన్

(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)

Updated Date - 2023-01-25T10:37:35+05:30 IST