Flight Passengers: మన్ను మిన్ను తెలియని మందు బాబులు

ABN , First Publish Date - 2023-01-11T07:23:12+05:30 IST

మద్యం మనిషిని మరో జగత్తుకు తీసుకెళ్లుతుంది. మత్తులో మునిగినవారు వింతగా విడ్డూరంగా ప్రవర్తిస్తారు.

Flight Passengers: మన్ను మిన్ను తెలియని మందు బాబులు

మద్యం మనిషిని మరో జగత్తుకు తీసుకెళ్లుతుంది. మత్తులో మునిగినవారు వింతగా విడ్డూరంగా ప్రవర్తిస్తారు. విశాఖపట్టణంలో సముద్ర తీరాన ఒక యువతి కావచ్చు లేదా ఒడిషా అడవులలో ఏనుగులు కావచ్చు లేదా విమానయానంలో ఉన్న ఒక పెద్ద మనిషి కావచ్చు... మద్యం మైకంలో అటువంటి ప్రవర్తనా వైచిత్రికి ఎవరూ మినహాయింపు కాదు. నేల–నింగి మధ్య ఆకాశయానంలో చాలా మంది మద్యం సేవించడం మామూలే. తాగిన మత్తులో ఎంతో మంది మితిమీరి ప్రవర్తించిన ఉదంతాలూ లెక్కకు మించి ఉన్నాయి. ఇటీవల విమాన ప్రయాణీకుడు ఒకరు మందు ప్రభావంలో తోటి ప్రయాణీకురాలిపై మూత్రవిసర్జన చేశాడు! ఇది అరుదు. అంతేకాదు దిగ్భ్రాంతికరం. అంతకు మించి వివాదాస్పదం. కనుకనే ఈ విచిత్ర ఘటన విస్తృతంగా ప్రజల దృష్టిని ఆకర్షించింది.

ప్రపంచ వ్యాప్తంగా పౌర విమానయాన సంస్ధలు తమ సేవలను ప్రచారం చేయడంలో విమానం లోపల తాము అందించే ఆహారం, మద్య పానీయాలను ప్రధానంగా వివరిస్తాయి. మాములు శ్రేణిలో ప్రయాణించే సగటు ప్రయాణీకులకు అదనంగా ఒక్క చపాతీ లేదా పిడికెడంత అన్నం పెట్టడానికి అంగీకరించని విమాన సిబ్బంది ఉన్నత శ్రేణిలో ప్రయాణించే వారికి మాత్రం మనస్ఫూర్తిగా మద్యం సమకూర్చడం విచిత్రం.

సాధారణంగా ప్రయాణీకులకు అందించే మద్య పానీయాలు, వాటిని సేవించేందుకు ఉన్న బార్ వైశాల్యం ఆధారంగా అంతర్జాతీయ ప్రయాణాలకు అనువైన ఎయిర్‌లైన్స్‌లను ఎంచుకోవడం పరిపాటి. లగేజి, సౌకర్యవంతమైన సీటు కాకుండా మద్యం అంశం ప్రాతిపదికన ఎయిర్‌లైన్స్‌లను ఎంపిక చేసుకోవడానికి కూడ అనేక మంది ప్రయాణీకులు ఆసక్తి చూపుతారు. గల్ఫ్ దేశాల విషయానికి వస్తే కువైత్ ఎయిర్‌వేస్, ఎయిర్ అరేబియాలలో మాత్రం ఇస్లామిక్ నిబంధనల కారణాన మద్యపానీయాలపై సంపూర్ణ నిషేధం ఉన్నది. మెరుగైన టిక్కెట్ ధరతో పాటు నాణ్యమైన ప్రసిద్ధ బ్రాండ్ల మద్యాన్ని అందిస్తున్న కారణాన దుబాయి కేంద్రంగా పనిచేసే ఏమిరేట్స్ ఎయిర్‌లైన్స్ మాత్రం ఒక్క గల్ఫ్‌లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అగ్రభాగంలో ఉంది. మద్యం విషయంలో ఏ పౌర విమానయాన సంస్థ అయినా ఏమిరేట్స్ తరువాతే. 21 సంవత్సరాల పాతదయిన రాయల్ సాల్యూట్ విస్కీని ఉచితంగా ఏమిరేట్స్ అందిస్తుంది. సీట్ల వద్దనే ప్రయాణీకులకు తాగినంతగా ఇవ్వడమే కాకుండా ఏ–380 విమానంలోని మొదటి అంతస్థులో బిజినెస్ క్లాస్ వెనుక భాగంలో ప్రత్యేకంగా ఒక బార్ కూడా ఉంటుంది. సాధారణంగా వి.ఐ.పి.లు విమానాలలో బార్‌లోనే కలుస్తుండడం కద్దు. మొత్తానికి నింగిలో ప్రయాణీకుడు నిలకడగా ఉన్నంత వరకు అతనికి విమాన సిబ్బంది మద్యాన్ని అందిస్తారు.

న్యూయార్క్ నుంచి న్యూఢిల్లీకి బిజినెస్ క్లాస్‌లో ప్రయాణిస్తున్న 34 ఏళ్ళ శంకర్ మిశ్రా మోతాదుకు మించి మద్యం సేవించాడు. ప్రకృతి పిలుపునకు అతనెలా ప్రతిస్పందించాడో తెలుసా? తన సీటు నుంచి లేచి మూత్రశాలకు వెళ్ళి విసర్జన చేయడానికి బదులుగా అవతలి వైపు సీటులో ఉన్న 70 ఏళ్ళ మహిళపై ధారపోశాడు! మరో ఉదంతంలో పారిస్ నుంచి న్యూఢిల్లీ వెళ్లుతున్న విమానంలో మద్యం మైకంలో ఒక ప్రయాణీకుడు తోటి ప్రయాణీకురాలి దుప్పటిపై మూత్ర విసర్జన చేశాడు! దీనిపై ఆ బాధితురాలు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు.

ప్రయాణీకుడు మోతాదుకు మించి మద్యాన్ని సేవించడం వల్లే ఈ విపరీత చర్యకు పాల్పడ్డాడనేది స్పష్టం. అయితే విమానంలో ప్రయాణీకుడికి కావల్సిన మద్యాన్ని ఉచితంగా అందించడం సబబేనా? దీనిపై గౌరవ సమాజం మౌనంగా ఉండిపోతోంది. నేరమంతా ఒక్క ప్రయాణీకుడిదేనా? అతనికి కావల్సినంత మద్యాన్ని అందించిన విమానయాన సంస్థ విధాన లోపం ఏమి లేదా?

ఆసక్తికరమైన విషయమేమిటంటే తనపై మూత్ర విసర్జన చేసిన మందుబాబుపై కాకుండా పైలట్‌తో సహా విమాన సిబ్బంది ప్రదర్శించిన నిర్లిప్త వైఖరిపై ఆ మహిళా ప్రయాణీకురాలు ఏయిర్ ఇండియా యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. మూత్రానికి తడిసిపోయిన తనకు మరో సీటు కేటాయించడంలో విమాన సిబ్బంది ప్రదర్శించిన నిర్లక్ష్యంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఫిర్యాదులోని కీలకాంశాలను విస్మరించి దాని ప్రాతిపదికనే పోలీసులు విభిన్న సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు!

మూత్ర విసర్జనకు ముందు, తన సీటులో ఇష్టానుసారం తాగుతూ పక్క సీటులోని మహిళతో సహా ఎవరికీ ఆ ప్రయాణీకుడు ఇబ్బంది కలిగించలేదు. మరి అతనిపై మోపిన అభియోగం ఏమిటో తెలుసా? ఫిర్యాదు చేసిన మహిళను లైంగికంగా వేధించాడనే ఆరోపణపై భారతీయ శిక్షాస్మృతిలోని వివిధ సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేశారు. ఔచిత్యమున్నదా? లేదనేది స్పష్టం. అయితే ఎవరూ ప్రశ్నించడంలేదు. ప్రసార మాధ్యమాల ఒత్తిడి, అధికార పక్షాల అభీష్టాల మేరకు జరిగే విచారణ, అందుకు తగినట్లుగా న్యాయ వ్యవస్థ వ్యవహరించే తీరు కేసుల మౌలిక అస్తిత్వాన్ని ప్రశ్నార్ధకం చేస్తున్నాయి. ఏది ఏమైనా జరిగిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి మద్యం మత్తు ఒక సాకు కారాదు. దుబాయి నుంచి హైదరాబాద్‌కు ఎకనామీ క్లాస్‌లో ప్రయాణించే సగటు ప్రయాణీకుడు అయినా లేదా న్యూయార్క్ నుంచి న్యూఢిల్లీకి బిజినెస్ క్లాస్‌లో ప్రయాణించిన శంకర్ మిశ్రా తరహా ఉన్నతోద్యోగులు అయినా సరే అటువంటి తప్పులకు పాల్పడడం క్షమార్హం కాదు. శంకర్ మిశ్రా నిస్సందేహాంగా తప్పు చేసాడు. అందుకు అతన్ని శిక్షించాలి.

మొహమ్మద్ ఇర్ఫాన్

(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)

Updated Date - 2023-01-11T07:23:14+05:30 IST