ANR@100: నాన్నే నా హీరో.. ఏఎన్నార్ గురించి నాగార్జున పంచుకున్న విశేషాలు ఇవే..

ABN , First Publish Date - 2023-09-24T03:35:19+05:30 IST

‘‘నాన్న... అనగానే నాకు వచ్చే మొదటి జ్ఞాపకం ‘హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌’. నా చిన్నప్పుడు మేం బేగంపేటలో ఉండేవాళ్లం......

ANR@100: నాన్నే నా హీరో.. ఏఎన్నార్ గురించి నాగార్జున పంచుకున్న విశేషాలు ఇవే..

ప్రేమ... క్రమశిక్షణ... ఎప్పుడూ తోడుండి నడిచే నీడ...

ఈ మూడు లక్షణాలు ఒకే వ్యక్తిలో ఉంటే... ఆయనే అక్కినేని నాగేశ్వరావు.

తెలుగు సినీ రంగంలో మరపురాని... మరవలేని ఒక అధ్యాయం.

ఏఎన్నార్‌ శతజయంతి సందర్భంగా... నాన్నతో తనకున్న అనుబంధాన్ని...

‘చినబాబు’... అక్కినేని నాగార్జున ‘నవ్య’తో పంచుకున్నారు.

‘‘నాన్న... అనగానే నాకు వచ్చే మొదటి జ్ఞాపకం ‘హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌’. నా చిన్నప్పుడు మేం బేగంపేటలో ఉండేవాళ్లం. నాన్న ఉదయాన్నే సారథి స్టూడియో్‌సలో షూటింగ్‌కు వెళ్తూ మమ్మల్ని స్కూల్లో దిగబెట్టేవారు. సుమారు 50 ఏళ్ల క్రితం నాటి ముచ్చట్లివి. ఆ సమయంలో సోషల్‌ మీడియా లేదు. బ్రేకింగ్‌ న్యూస్‌లూ లేవు. స్కూళ్లల్లో అందరూ సమానమే! మేం కూడా అలాగే పెరిగాం. ఏఎన్నార్‌ కొడుకని నన్ను ప్రత్యేకంగా చూసేవారు కాదు. ఎటువంటి ప్రత్యేక సదుపాయాలూ లేవు. ఏఎన్నార్‌ పిల్లలమని మేమూ చెప్పుకొని గొప్పలు పోయిన సందర్భాలేవీ లేవు. ఇప్పటి స్టార్‌ కిడ్స్‌ను చూస్తే అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంది. సోషల్‌ మీడియా మన జీవితాల్లో ప్రవేశించిన తర్వాత ఎటువంటి ప్రైవసీ లేకుండా పోయింది. అంతా ఓవర్‌ ఎక్స్‌పోజరే. ఆ రోజులే వేరు. నేను స్కూల్లో చదివే సమయంలో నాన్న చాలా బిజీగా ఉండేవారు. మాతో గడపటానికి ఆయనకు అస్సలు సమయం ఉండేది కాదు. అందువల్ల అమ్మే మా ఆలనాపాలనా చూసేది. నాన్న మాకు ఒక స్నేహితుడు... అంతే! నన్ను, అన్నయ్యను, అక్కలను... అందరినీ నాన్న సమానంగానే చూసేవారు. ఏదైనా సినిమాకు కొత్త గెటప్‌ వేసుకోవాల్సి వస్తే మాత్రం... ‘‘ఎలా ఉంది?’’ అని అడిగేవారు. మేమందరం కొత్త తరం కాబట్టి, మాకు నచ్చితే అందరికీ నచ్చుతుందనేది ఆయన ఉద్దేశం అయుండచ్చు. స్కూలు, ఆడుకోవటం... వేసవి సెలవుల్లో వెకేషన్‌... అప్పుడప్పుడూ నాన్న షూటింగ్‌లకు వెళ్లటం... అంతకన్నా మా చిన్నతనంలో పెద్ద విశేషాలేవీ ఉండేవి కాదు. కానీ ఇప్పుడు ఆలోచిస్తే మా జీవితాల్లో నాన్నే ఒక పెద్ద విశేషం అనిపిస్తోంది.

క్రమశిక్షణకు మారుపేరు...

నాన్న శారీరకంగా, మానసికంగా చాలా క్రమశిక్షణతో ఉండేవారు. చాలా మంది తల్లితండ్రులు తమ పిల్లలకు చెప్పేదొకటి ఉంటుంది. చేసేదొకటి ఉంటుంది. ఈ రెండింటి మధ్య వైరుధ్యం పిల్లలలో అశాంతి రేకెత్తిస్తుంది. కానీ నాన్న తాను ఆచరించిందే చెప్పేవారు. చెప్పటం.. చేయటం మధ్య తేడా ఉండేది కాదు. ఇతరులతో ఎలా మాట్లాడాలి? అతిథులొస్తే ఎలా ఆదరించాలి? బయటకు వెళ్లినప్పుడు ఎలా ఉండాలి?... ఇవేమీ మాకు ఆయన చెప్పలేదు. ఆయనను చూసి మేమే నేర్చుకున్నాం. ఆయనది స్వచ్ఛమైన, నిర్మలమైన మనస్సు. అది మాకు ప్రతి రోజూ స్పష్టంగా కనిపిస్తూ ఉండేది. మా జీవితాల్లో అంతకన్నా గొప్ప విశేషం ఏం కావాలి? ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. నాన్న తన జీవితాన్ని తాను పాటించాలనుకున్న విలువల ఆధారంగానే బతికారు. ఏదైనా కుదరదు అనుకుంటే కుదరదంతే! వద్దు అనుకుంటే వద్దంతే! అంతే తప్ప లొంగిపోయేవారు కారు. దీనివల్ల ఆయన అనేక కష్టనష్టాలకు లోనయ్యారు. వీటన్నిటినీ ఆయన తన ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొనేవారు. ఆయన ఆత్మవిశ్వాసం తిరుగులేనిది. అందుకే ఆయనను మేమందరం ప్రేమించేవాళ్లం. ఆరాధించేవాళ్లం. ఆయనలా జీవించాలనుకొనేవాళ్లం. నాన్న మాకు పరోక్షంగా నేర్పిన పాఠాలు ఈ రోజు మాకందరికీ మార్గదర్శకాలుగా నిలిచాయి. అందుకే నాన్నే నాకు హీరో! నాకే కాదు. మా ఇంట్లోవారికి.. బయటవారికి కూడా నాన్నంటే ఆరాధనా భావమే.

కళ్లల్లో మెరుపు...

నేను అమెరికాలో చదువుకున్న తర్వాత ఇండియా వచ్చేసా. 23 ఏళ్ల వయస్సులో అనుకుంటా.. నాన్న దగ్గరకు వెళ్లి... ‘‘నేను సినిమాల్లోకి వద్దామనుకుంటున్నా’’ అని చెప్పా. అప్పటి దాకా నేను, నాన్న నా చదువుకు సంబంధించిన విషయాలు మాత్రమే మాట్లాడుకుంటూ ఉండేవాళ్లం. ‘‘ఎలా చదువుతున్నావు? ఆ తర్వాత ఏం చేస్తావు? అమెరికా వెళ్తావా?’’... ఎక్కువ సంభాషణలు ఇలాగే సాగేవి. అలాంటిది నేను సినిమాల్లోకి వస్తాననగానే... ఆయన కళ్లలో ఒక మెరుపు కనిపించింది. అప్పటిదాకా నాన్నకు తన పిల్లల్లో ఎవరూ సినీ నటులు కారనే బెంగ ఉండేదేమో! ఎందుకంటే నేను అమెరికా నుంచి తిరిగి వచ్చేనాటికి ముగ్గురు అక్కయ్యల పెళ్లిళ్లు అయిపోయాయి. అన్నయ్య వెంకట్‌... ‘హీరో కావటం ఇంట్రస్ట్‌ లేద’ని చెప్పేశాడు. ఇక మిగిలింది నేను. నేను కూడా చదువులో పడిపోయాననుకున్నారేమో. నేను హీరో అవుతాననేసరికి ఆయన ఆనందానికి హద్దులు లేవు. నా మొదటి సినిమా విడుదలయింది. నాకు నచ్చలేదు. కానీ సినిమా బాగా ఆడుతున్నందుకు నాన్న హ్యాపీగా ఫీలయ్యారు. ‘‘డైలాగ్స్‌ మీద ఫోకస్‌ పెట్టు. ఎంత గొప్పగా నటించినా డైలాగ్స్‌ సరిగ్గా చెప్పకపోతే ప్రేక్షకులకు నచ్చదు’’ అని సలహా ఇచ్చారు. నేను సినిమాల్లోకి ప్రవేశించే నాటికే నాన్న సినిమాలలో నటించటం తగ్గించేశారు. నేను నా స్పేస్‌లో ఉండేవాడిని. వృత్తిపరంగా మా మధ్య పెద్ద సంబంధం ఉండేది కాదు. ‘‘ఏ సినిమాలు చేస్తున్నావు? కథలేమిటి?’’ అని ఆయన ఎప్పుడూ అడగలేదు. నేను చెప్పలేదు. ఇక్కడ ఒక విషయం కచ్చితంగా చెప్పాలి. ఒక సినిమాలో నటుడిగా... తనను తాను ఎలా చూసుకోవాలో నాన్నకు తెలుసు. అందుకే ఒక నటుడిగా అంత విజయం సాధించగలిగారు.

మంచి భర్తగా...

మా చిన్నప్పుడు నాన్న చాలా బిజీగా ఉండేవారు. దాంతో అన్నీ అమ్మే చూసుకొనేది. అమ్మకు సుమారు 55 ఏళ్లు వచ్చేసరికి కీళ్లనొప్పులు వచ్చాయి. సర్జరీలు చేయించాల్సి వచ్చింది. ఆ తర్వాత మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. దాంతో అమ్మ బాధ్యత అంతా నాన్నే తీసుకున్నారు. ఆమెను పువ్వుల్లో పెట్టుకొని చూసుకొనేవారు. ‘‘నేను బిజీగా ఉన్న రోజుల్లో తను నన్ను బాగా చూసుకుందిరా. ఉదయం 5 గంటలకు వెళ్తే రాత్రి 12కి వచ్చేవాడిని. ఏ రోజూ ఎక్కడికి వెళ్లారు? అని అడగలేదు. ఒక కంప్లైంట్‌ చేయలేదు. అప్పుడు అంత సేవ చేసింది. ఇప్పుడు నా వంతు’’ అనేవారు. అమ్మకు కాళ్లు నొక్కేవారు. పక్కనే కూర్చుని అన్నం తినిపించేవారు. అమ్మ చివరి క్షణాల్లో కూడా నాన్న పక్కనే ఉన్నారు. అలాంటి భర్త ఎంతమందికి దొరుకుతాడు? అందరి భర్తలూ ఆయనను ఆదర్శంగా తీసుకోవాలంటే అందులో అతిశయోక్తి ఏముంటుంది!

శాస్త్రాలు లోతుగా...

నాన్న చిన్నతనంలో చాలా కష్టపడ్డారు. ఆ రోజుల్లో ఎన్ని రకాల కష్టాలు అనుభవించారో చెబుతూ ఉండేవారు. నాటకాలు వేసిన రోజుల్లోని సరదా సంఘటనలు చెప్పేవారు. ‘‘మీరు ఇప్పుడు రోజూ అది కావాలి.. ఇది కావాలి అని డిమాండ్‌ చేస్తున్నారు. మా చిన్నప్పుడు రోజూ గోధుమ అన్నమే. నెలకు ఒక రోజు తెల్ల అన్నం తింటే గొప్ప’’ అనేవారు. ఇక్కడో సరదా సంఘటన చెప్పాలి. నాన్న పెద్దయిన తర్వాత రోజూ మీడగ తినేవారు. ఎప్పుడైనా నేను... ‘‘నాన్నా... రోజూ మీగడ తినటం ఆరోగ్యానికి మంచిది కాదు’’ అంటే- ‘‘మీకేం తెలుసురా! మాకు చిన్నప్పుడు ఏడాదికి ఒకసారి మీగడ తినే అవకాశమొచ్చేది. ఇప్పుడు అవకాశం ఉందిగా... తిననీ’’ అనేవారు. చిన్నప్పుడు ఆయన పడిన కష్టాల వల్ల ఆయన మనిషిలోనే దేవుడు ఉన్నాడని నమ్మేవారు. ‘‘పనే దైవం. దేవుడు ఎక్కడో లేడు. మనలోనే ఉన్నాడు. ఆయన కోసం బయట వెతకాల్సిన అవసరం లేదు’’ అనేవారు. అలాగని అమ్మ ఇంట్లో పూజలు చేస్తే వద్దనేవారు కాదు. ఇక భగవద్గీత, పురాణాలు, ఉపనిషత్తులు ఆయనకు కొట్టిన పిండి. విగ్రహారాధన చేసేవారు కాదు కానీ మంచి సమయాలను నమ్మేవారు. కొత్త పనులు మొదలుపెట్టాలంటే శుభ ఘడియలు చూసి మొదలు పెట్టేవారు. సమాజం మనకు ఎంతో ఇచ్చింది కాబట్టి మనం కూడా సమాజానికి తిరిగి ఇవ్వాలనేవారిలో ఆయన కూడా ఒకరు. ఆయన అనేక మందికి సాయం చేసేవారు. కానీ ఎవరికీ చెప్పేవారు కాదు. ‘‘సాయం అంటే డబ్బులు మాత్రమే కాదు. మాట సాయం కావచ్చు.. అవసరమైనప్పుడు తోడుగా ఉండటం కావచ్చు’’ అనేవారు. అందుకే ఆయన అజాత శత్రువు. నాన్నగారి శతజయంతి ఉత్సవాలు అనగానే సినిమా పరిశ్రమ నుంచే కాదు సాధారణ ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే ఆ విషయం మరోసారి రుజువు అవుతోంది. సినీ పరిశ్రమ ఉన్నంత కాలం నాన్న తోడుగా నీడగా నిలిచే ఉంటారు. చాలా మంది నన్ను... ‘మీ నాన్నగారిని మిస్‌ అవుతున్నారా?’ అని అడుగుతూ ఉంటారు. ఆయనను మేము మిస్‌ అయ్యే అవకాశమే లేదు. ఎందుకంటే ఆయన మాతోనే ఉంటున్నారు. ఎప్పుడైనా మేమందరం కలిసినప్పుడు ఆయనకు సంబంధించిన జోక్‌లు చెప్పుకొంటాం. నవ్వుకొంటాం. ఆనందంగా ఉంటాం. అది ఆయన మాకు ఇచ్చిన జీవన సూత్రం. నాన్నగారు మరణించటానికి మూడు నెలల ముందు... ఆయనకు కేన్సర్‌ వచ్చిందని తెలిసింది. మేమందరం షాక్‌కి గురయ్యాం. నాన్న మాత్రం తొణకలేదు. బెణకలేదు. మాకు ఒకటే కండిషన్‌ పెట్టారు... ‘‘నాకు బాగాలేదని మీరందరూ ఏడుపు మొహాలు వేసుకొని నా ముందుకు రావద్దు. సానుభూతి చూపించాలనుకుంటే అస్సలు రావద్దు. నవ్వుతూ.. ఆనందంగా ఉందామనుకుంటే నా దగ్గరకు రండి’’ అన్నారు. ఆ మూడు నెలలూ మేమందరం నాన్నకు దగ్గరగా ఉన్నాం. ఆనందంగా ఉన్నాం. నాన్న మాకు నేర్పిన ఆఖరి పాఠం అదే! అందుకే నాన్న నా హీరో.

-సివిఎల్‌ఎన్‌ ప్రసాద్‌

నాన్న నాకు ఎప్పుడూ ఏ సలహా ఇవ్వలేదు. కానీ ఆయన జీవితమే ఒక పెద్ద సలహా. జీవితంలో జరిగే ప్రతి సంఘటనలోనూ ఆయన గుర్తుకొస్తూ ఉంటారు. ఏదైనా సమస్య ఎదురైతే... ఒక్క నిమిషం ‘నాన్న దీనిని ఎలా ఎదుర్కొనేవారు’ అని ఆలోచిస్తా. వెంటనే పరిష్కారం దొరుకుతుంది.

సమస్యలు తీరిపోయేవి...

నాన్న ఇంట్లో అందరినీ ప్రేమించేవారు. అందరూ ఆయనను ప్రేమించేవారు. మాకు సమస్యలు ఉంటే నాన్నకు మేము చెప్పకముందే తెలిసిపోయేవి. మేము అడగకుండానే సలహాలు ఇచ్చేవారు. అందుకే మేమందరం మనసు బాగున్నా బాలేకపోయినా నాన్న దగ్గరకు వెళ్లేవాళ్లం. ఆయన దగ్గర కూర్చుంటే అన్ని సమస్యలూ తీరిపోయినట్లు అనిపించేది.

పోలికే లేదు...

నేను అమ్మ పోలిక. అందువల్ల నేను అదృష్టవంతుడిననే చెప్పాలి. లేకపోతే ది గ్రేట్‌ ఏఎన్నాఆర్‌తో నన్ను పోల్చేవారు. పోలికలు లేకపోవటంవల్ల ఆ ఇబ్బందులు తప్పాయి. నాన్న నా సినిమాలు చూసేవారు. చైతన్య సినిమాలు చూశారు. వాడి సినిమాలు చూసి... ‘‘మంచి యాక్టర్‌ అవుతాడురా వీడు’’ అనేవారు. అఖిల్‌ సినిమాలు ఆయన చూడలేదు. ‘మనం’ చిత్రంలో ఒక షాట్‌ మాత్రం తీశాం. ‘‘మనెవ్వరికీ లేదు.. వీడికి ఇంత మంచి వాయిస్‌ ఎక్కడి నుంచి వచ్చిందిరా? మంచి తెలుగు మాట్లాడుతున్నాడు’’ అని మురిసిపోయారు. సుప్రియ సినిమాల్లోకి వెళ్తానన్నప్పుడు కూడా ఆయన ప్రొత్సహించారు. ‘‘ఇది నీ జర్నీ. చేయాలని ఉంటే తప్పకుండా చేయి. కానీ జాగ్రత్తగా ఉండు’’ అని సలహా ఇచ్చారు.

‘అన్నపూర్ణ’ విజయం వెనక...

‘అన్నపూర్ణ స్టూడియోస్‌’ అనేది ఆయన జీవితం. ఆయన కల. తాను సంపాదించినదానిలో కొంత పెట్టి ఆ స్టూడియో కట్టారు. స్టూడియో నిర్మాణ సమయంలో రోజూ వెళ్లేవారు. ఏం జరుగుతోందో చూసేవారు. అన్నయ్య వెంకట్‌ కూడా నాన్నతో పాటే ఉండేవాడు. మేం అప్పుడప్పుడూ వెళ్లి చూసేవాళ్లం. నాన్నకు స్టూడియోలో అణువణువూ తెలుసు. ఈ రోజు ‘అన్నపూర్ణ స్టూడియోస్‌’ విశ్వవిఖ్యాతి గాంచిందంటే... ఆ క్రెడిట్‌ అంతా నాన్నదే!

ముందు చూపు...

నాన్నకు సమాజం పట్ల.. జరుగుతున్న పరిణామాల పట్ల మంచి అవగాహన ఉండేది. ఆయన దృష్టి కోణం అందరికన్నా భిన్నంగా ఉండేది. చాలా ప్రోగ్రెసివ్‌గా ఉండేవారు. ‘గీతాంజలి’ సినిమా విడుదలయినప్పుడు మొదటి వారం రోజులూ జనాలకు ఎక్కలేదు. నేను ఆ సినిమాను నమ్మా! కానీ తెలుగు విమర్శకులు దాన్ని ఏకిపారేశారు. ‘‘ఇది తెలుగుసినిమానా? తమిళ సినిమానా? అసలు ఇది లవ్‌ స్టోరీయేనా?’’ లాంటి రకరకాల కామెంట్స్‌ చేశారు. అంత ఘాటు విమర్శలు విన్నప్పుడు కళ్లల్లో నీరు తిరిగేవి. ‘నా జడ్జిమెంట్‌ ఇంత రాంగ్‌ అయిందా’ అనిపించేది. ఆ పరిస్థితుల్లో నాన్న సినిమా చూశారు. ‘‘ఇదొక కావ్యంరా’’ అన్నారు. ‘‘బయట రివ్యూలు భయంకరంగా ఉన్నాయి. మీరేమో బావుందంటున్నారు’’ అన్నా. అప్పుడు నాన్న... ‘‘ఇదే ఆధునిక తరం ప్రేమ. ఈ కాలంలో ప్రేమంటే ఇలాగే ఉంటుంది. దేవదాసు ప్రేమ ఈ తరానికి పనికిరాదు. ప్రేమ విఫలమయితే తాగి చచ్చిపోయే రోజులు పోయాయి’’ అని విశ్లేషించారు. ఆ తర్వాత నాన్న చెప్పిందే నిజమయింది. ఆ సినిమా పెద్ద హిట్‌ అయింది.

నేను పాటించే సూత్రమదే...

‘‘మనం అనుకుంటే అంతా ఒత్తిడే. లేదు అనుకుంటే ఏదీ ఒత్తిడి కాదు. సమస్యలను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటే విజయం దానంతట అదే వస్తుంది’’ అనేవారు నాన్న. అదే నాన్న నాకు నేర్పిన జీవన సూత్రం. ఇప్పటికీ నేను దానినే పాటిస్తాను. నాన్న ఎప్పుడూ యోగా.. మెడిటేషన్‌లాంటివి చేసేవారు కాదు. కానీ ఆయన తన మైండ్‌ను బాగా ట్రైన్‌ చేశారు. అందువల్ల ఆయనకు ఎటువంటి ఒత్తిడీ ఉండేది కాదు. బెడ్‌రూమ్‌లో పడుకోటానికి వెళ్తే... 30 సెకన్లలో గురకపెట్టి నిద్రపోయేవారు. ఉదయాన్నే మళ్లీ ఫ్రెష్‌గా లేచేవారు. ఆయన నిద్రపట్టడానికి ఎప్పుడూ మాత్రలు కూడా వేసుకోలేదు.

‘అడుక్కొని ఎంపీ అవ్వాలంటావా!’

ఇది అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి సంవత్సరం. ఆయన గురించి, ఆయన సినీ ప్రస్థానం గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. అందరికీ తెలిసిందే. నాగేశ్వరరావు గారు మా నాన్న తీసిన నాలుగు సినిమాల్లో నటించారు. అలా ఆయనతో మా కుటుంబానికి ఎంతో అనుబంధం ఉంది. మాకు ఆప్తుడు. నాగేశ్వరరావు గారితో వ్యక్తిగతంగా నాకు కొన్ని అనుభవాలు ఉన్నాయి. వాటిల్లో ఇప్పటివరకు ఎవరితో పంచుకోని ఓ మూడు విషయాలు మీ ముందు పెడదామని అనిపించింది.

మొదటిదేమిటంటే... నాగేశ్వరరావుగారు రాజ్యసభకు వెళితే బాగుంటుందని నేను, మరికొంతమంది మిత్రులు కోరుకున్నాం. అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. ఒక రోజు అన్నపూర్ణ స్టూడియోలో ఆయన కనపడితే అడిగాను... ‘సార్‌.. మీరు రాజ్యసభకు ప్రయత్నించవచ్చు కదా’ అని. సీరియస్‌గా ఓ లుక్‌ ఇచ్చి... ‘అంటే ఇప్పుడు అక్కినేని వెళ్లి అడుక్కొని, ఎంపీ అవ్వాలంటావా’ అన్నారు. ‘అలా కాదు సార్‌..’ అంటే... ‘అక్కర్లేదు. నేను ఏ పదవీ అడుక్కొని తెచ్చుకోనక్కర్లేదు’ అన్నారు. ‘సరే... నా ప్రయత్నం నేను చేద్దామని’ అనుకున్నా. అప్పట్లో నేను చంద్రబాబు గారి దగ్గర ఆస్థాన విద్వాంసుడిని. అంటే... రోజూ పొద్దున్నే వెళ్లి, రాత్రి వరకు అక్కడే ఉండేవాణ్ణి. ఒకరోజు చంద్రబాబు గారిని అడిగాను... ‘సార్‌... నాగేశ్వరరావు గారిని రాజ్యసభకు పంపిస్తే తెలుగు సినిమా పరిశ్రమకు గర్వంగా ఉంటుంది. ఇది మా పరిశ్రమ తరుఫున అడుగుతున్నాను’ అన్నాను. అప్పుడు ఐకే గుజ్రాల్‌ ప్రధాని. చంద్రబాబు గారు ఎన్‌డీఏ సారథి కాబట్టి, ఆయన ఏం చెబితే అది జరిగే రోజులవి. ‘అవును... ఇస్తే బాగుంటుంది కానీ, గుజ్రాల్‌ గారు షబనఆజ్మీకి ఇద్దామంటున్నారు. ఒక ఆర్టిస్ట్‌కు ఇద్దామనుకున్నప్పుడు మరొక ఆర్టిస్ట్‌కు ఇవ్వమని అడిగితే బాగోదేమో’ అన్నారు చంద్రబాబు. ‘మీరు అనుకొంటే ఇద్దరికీ ఇవ్వచ్చు కదా’ అని నేను అన్నాను. ‘అది కుదరదులే. వేరే ఏదన్నా చూద్దాంలే’ అన్నారు. ఆయనకు అలా రాజ్యసభ రాలేదు.

ఆ తరువాత అక్కినేనికి ‘పద్మవిభూషణ్‌’ వచ్చింది. అప్పుడు పరిశ్రమ తరుఫున సన్మానం చేయాలని చాలామంది అనుకున్నారు. కానీ అప్పట్లో దాసరి నారాయణరావు గారికి, నాగేశ్వరరావు గారికి అస్సలు పడేది కాదు. ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలడానికి వీల్లేదనే పరిస్థితి. ఇలా అక్కినేనికి సన్మానం చేద్దామంటే దాసరి తిడతారేమోనని భయపడినవారు కొంతమంది, అడిగి తిట్లు తిన్నవారు మరికొంతమంది... చివరకు ఐదారు నెలలు అయ్యేసరికి ఆ విషయం పాతబడిపోయింది. అంతకుముందు ఎవరికి ఏ సన్మానాలు, సత్కారాలు చేయాలన్నా నేను ముందుండేవాణ్ణి. అలాంటిది తెలుగు చిత్ర పరిశ్రమకు రెండు కళ్లనుకున్న వారిలో ఒకరైన అక్కినేనిని గౌరవించుకోలేక పోయినందుకు నాకు చాలా సిగ్గుచేటనిపించింది. దాంతో టీవీ ఛానల్‌ తరుఫునన్నా సన్మానిద్దామని వారితో మాట్లాడాను. చానల్‌వారు ఒప్పుకున్నారు. పరిశ్రమ నుంచైతే మళ్లీ దాసరి గారు అడ్డుపడతారు. కనుక ఆ రాజకీయాల జోలికి వెళ్లకుండా... ప్రైవేటు పార్టీ ద్వారా సన్మానించాలనేది నా ఉద్దేశం. నాగేశ్వరరావు గారి దగ్గరికి వెళ్లి... ‘సార్‌... ఇలా సన్మానం చేద్దాం అనుకొంటున్నాం. ఇది నా కోరిక’ అని చెప్పాను.

ఆయన వెంటనే ‘ఏంటి... నువ్వు చేస్తావా’ అనడిగారు. ‘లేదు సార్‌... టీవీలో చేస్తాం. ఇండస్ర్టీ అంతా ఉంటుంది’ అన్నాను.

‘ఇండస్ర్టీ అంతా ఉంటుందా?’... ‘ఆ... ఉంటుంది సార్‌’.

‘నువ్వు ఆ వర్గం అనుకొంటా!’... ‘ఏ వర్గం సార్‌?’

‘అదేనయ్యా... నువ్వు ఎక్కడుంటావో నాకు తెలుసుగా’.

‘సార్‌... ముందు మీరు. మీ తరువాతే కదా వీళ్లంతా వచ్చింది. నాకు ఒక వర్గం అనేది ఎప్పుడూ లేదు.’...

‘మీరెప్పుడూ కలిసే ఉంటారు. అన్నీ కలిసే చేస్తారు కదా’...

‘లేదండీ... కార్మికుల గొడవలు ఉన్నవరకు, లేదంటే పరిశ్రమలో సమస్యలు ఏవన్నా వస్తే ఆయన్ను కలుస్తూ ఉంటా. సమస్యల పరిష్కారం కోసం పిలిస్తే వెళతాను. అంతేకానీ పరిశ్రమలో ఏవో కుట్రలు చేసేవాణ్ణి మాత్రం కాదు సార్‌ నేను. ఆయనకు నేను వకాల్తా ఏమీ తీసుకోను కానీ, నా వరకు నేను ఇండిపెండెంటే’ అని చెప్పాను.

‘ఓ... సరే. అయితే ఇప్పుడు ఇండస్ర్టీ అంతా వస్తుందా?’... ‘ఆ... వస్తుంది సార్‌’. ‘మరి మీ మిత్రుడు వస్తాడా?’... ‘రాడండి’ అన్నాను.

‘మరి అతనే ఇండస్ర్టీ అంటారుగా మీరంతా! అతనే రాకపోతే ఎలా?’

‘లేదండీ... అది కుదిరే పని కాదు. ఆయన కోసమని మీకు ఇవ్వాల్సిన గౌరవాన్ని మేము ఇవ్వకపోవడం నా చేతగాని తనంగా ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది చేసి తీరాలి. మీరు ఒప్పుకోవాలి’ అన్నాను.

‘నాకు చాలా సన్మానాలు జరిగాయి. ఎప్పుడు జరిగినా అందరూ కలిసి చేశారు. పరిశ్రమ అంతా ఒకటిగా ఉండాలి. ఏ ఒక్కరికో, ఇద్దరికో ఇష్టం లేని సన్మానం నేను చేయించుకొంటే అసంతృప్తిగా ఉంటుంది. అదికూడా ఇండస్ర్టీ కాదు, టీవీవాళ్లు చేస్తున్నారని అంటున్నావు. అంటే అక్కినేని నాగేశ్వరరావును పరిశ్రమ సన్మానించకపోతే, దొడ్డిదారిన వీళ్లంతా చేశారని ఈ వయసులో నన్ను అనిపించుకోవాలంటావా? ఈ సన్మానం లేకపోతే నాకేమన్నా పోయేదుందా? నాకు అవమానం జరిగినట్టా? కేంద్రం నన్ను గుర్తించింది. ప్రజలు గుర్తించారు. ఎన్నో సత్కారాలు, దేశంలో ఎవరికీ రానన్ని అవార్డులు నాకు వచ్చాయి. ఇంకా నాకు ఏదో సన్మానం జరగలేదనే తపనతో దొడ్డిదారిన ఇలా చేయించుకున్నాననే అపఖ్యాతి కానీ, లేదంటే నా అంతట నేనే చేయించుకున్నానా అనే భావన నాకు మనసులో కలగకుండా ఉండాలని కానీ అనుకొంటే... నువ్వు ఈ ప్రయత్నం ఆపేసేయ్‌’ అన్నారు ఆయన.

‘మీరు వస్తేనే కదా జరిగేది. లేకపోతే లేదు. కానీ మీరు రావాలనేది నా కోరిక’. ‘మన కుటుంబాల మధ్యనున్న అనుబంధంతో నువ్వు అడిగావు కాబట్టి ఇంత మర్యాదగా మాట్లాడాను. ఇంకొడినైతే తన్ని వెళ్లగొట్టేవాణ్ణి’ అన్న స్థాయిలో ఆయన సమాధానం ఇచ్చారు. అదీ నాగేశ్వరరావు గారంటే. ‘పురుషులందు పుణ్య పురుషులు వేరయా’ అంటే ఇదేనేమో. అందుకే ఏఎన్నార్‌ చిరస్మరణీయుడు.

భరద్వాజీయం

ఒకసారి బేగంపేట్‌ విమానాశ్రయంలో సూట్‌కేస్‌ పట్టుకుని అక్కినేని వస్తున్నారు. అప్పుడు నేను అక్కడే ఉన్నా. గబగబా నేను ఎదురెళ్లి... ‘సార్‌... పెట్టె ఇవ్వండి’ అన్నాను. ‘ఏంటి? నువ్వేమన్నా పోర్టర్‌ ఉద్యోగం చేస్తున్నావా? లేకపోతే నా పెట్టె నేను మోసుకోలేనా? నాకు ఇంకా శక్తి ఉంది. అయినా నువ్వు ఇలా పెట్టెలు మోయటాలు లాంటివి చేయవాకు. మనిషికి సెల్ఫ్‌రెస్పెక్ట్‌ ఉండాలి’ అన్నారు. ‘అదేంటి సార్‌... మీ పెట్టె మోయడమంటే గౌరవంగా భావిస్తాం కానీ, కూలీగా అనుకోం’ అన్నాను. ‘నన్ను గౌరవించం డయ్యా. నేను వద్దనడంలేదు. కానీ ఇలాంటి పనులు చేయకూడదు. మీరంతా కుర్రాళ్లు. పైకి రావల్సినవాళ్లు. బాగా చేయండి. బాగా ఉండండి’ అన్నారు.

-తమ్మారెడ్డి భరద్వాజ (దర్శకనిర్మాత)

Updated Date - 2023-09-24T10:37:45+05:30 IST