Share News

Indian Marriages: భారత్‌లోనే పెళ్లిళ్లు చేసుకోవాలని ప్రధాని మోదీ ఎందుకు విజ్ఞప్తి చేశారు?

ABN , First Publish Date - 2023-11-28T19:43:10+05:30 IST

విదేశాలతో పోలిస్తే మన భారతదేశంలో జరిగే వివాహాలు ఎంతో ప్రత్యేకమైనవి. ప్రతి ఒక్కరి జీవితంలో కేవలం ఒక్కసారి మాత్రమే జరిగే కార్యక్రమం కాబట్టి.. ఈ పెళ్లి తంతుని చాలా గ్రాండ్‌గా నిర్వహిస్తారు. ఖర్చుకి ఏమాత్రం వెనుకాడరు.

Indian Marriages: భారత్‌లోనే పెళ్లిళ్లు చేసుకోవాలని ప్రధాని మోదీ ఎందుకు విజ్ఞప్తి చేశారు?

Destination Weddings: విదేశాలతో పోలిస్తే మన భారతదేశంలో జరిగే వివాహాలు ఎంతో ప్రత్యేకమైనవి. ప్రతి ఒక్కరి జీవితంలో కేవలం ఒక్కసారి మాత్రమే జరిగే కార్యక్రమం కాబట్టి.. ఈ పెళ్లి తంతుని చాలా గ్రాండ్‌గా నిర్వహిస్తారు. ఖర్చుకి ఏమాత్రం వెనుకాడరు. లక్షల దగ్గర నుంచి కోట్ల రూపాయల వరకు వెచ్చించడానికి కూడా సిద్ధమవుతున్నారు. తక్కువ బడ్జెట్ పెళ్లిళ్లకు కూడా కనీసం రూ.1 లక్ష ఖర్చు అవుతుందంటే.. ఇక గ్రాండ్‌గా జరిగే పెళ్లిళ్ల వ్యయం ఏ స్థాయిలో ఉంటుందో మీరే ఊహించుకోండి.

ఇక ఈమధ్య కాలంలో చాలామంది డెస్టినేషన్ వెడ్డింగ్స్ చేసుకుంటున్నారు. అంటే.. భారతదేశంలో కాకుండా విదేశాల్లో పెళ్లిళ్లు చేసుకోవడం. ముఖ్యంగా.. సంపన్న కుటుంబాలే డెస్టినేషన్ వెడ్డింగ్స్‌కి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే.. ప్రధాని నరేంద్ర మోదీ భారతీయులకు ఒక విజ్ఞప్తి చేశారు. 2023 నవంబర్ 26వ తేదీన జరిగిన మన్ కీ బాత్ 107వ ఎపిసోడ్‌లో ‘డెస్టినేషన్ వెడ్డింగ్స్‌పై ఆందోళన వ్యక్తం చేస్తూ.. స్వదేశంలోనే పెళ్లి చేసుకోవాలని కోరారు. ఇంతకీ మోదీ ఈ విజ్ఞప్తి ఎందుకు చేశారో తెలుసుకుందాం పదండి..

అసలు భారత్‌లో వివాహాలకు ఎంత ఖర్చు అవుతుంది?

ఒక వ్యాపార సంస్థ వెల్లడించిన నివేదిక ప్రకారం.. మన దేశ రాజధాని ఢిల్లీలోనే పెళ్లిళ్ల సీజన్‌లో నాలుగు లక్షల వివాహాలు జరుగుతున్నాయి. ఈ మొత్తం పెళ్లిళ్లకు అయ్యే ఖర్చు రూ. 1.25 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. అంటే.. ఈ పెళ్లిళ్ల కారణంగా మన దేశంలో రూ.1.25 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుంది. వాణిజ్య సంస్థ CAT అంచనాల ప్రకారం.. ఈ ఏడాదిలో ఒక పెళ్లికి రూ.3 లక్షల వ్యయం చొప్పున దాదాపు 7 లక్షల వివాహాలు జరుగుతాయి. అలాగే.. రూ.6 లక్షల ఖర్చు చొప్పున 8 లక్షల వివాహాలు, రూ. 10 లక్షల ఖర్చు చొప్పున 10 లక్షల వివాహాలు జరుగుతాయని తేలింది. అంతేకాదు.. రూ.15 లక్షల ఖర్చు చొప్పున 7 లక్షల వివాహాలు, రూ.25 లక్షలు చొప్పున 50 వేలు, రూ.50 లక్షలు ఖర్చయ్యే ఐదు లక్షల పెళ్లిళ్లు, ఒక 1 కోటి లేదా అంతకంటే ఎక్కువ ఖర్చు వివాహాలు 50 వేలు జరుగుతాయి. ఒకవేళ ఈ పెళ్లిళ్లన్ని భారతదేశం వెలుపల విదేశాల్లో జరిగితే మాత్రం.. ఆ డబ్బంతా విదేశాలకు వెళ్తుంది. దీంతో.. భారత ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతింటుంది.


విదేశాల్లో పెళ్లిళ్లు చేసుకోవడం వల్ల భారత ఆర్థిక వ్యవస్థ నిజంగానే దెబ్బతింటుందా?

కేవ్ ఈవెంట్ ఏజెన్సీ వ్యవస్థాపకుడు క్రిస్ ఆండ్రూ మాట్లాడుతూ.. ఏదైనా వివాహానికి అయ్యే ఖర్చులో 50 శాతం వస్తువుల కొనుగోలుకే ఖర్చవుతుందని చెప్పారు. మిగిలిన 50 శాతం హోటల్ బుకింగ్ మొదలైనవాటికి వెళ్తోంది. ఒకవేళ ఒక వ్యక్తి భారత్‌లో పెళ్లి సామాగ్రి కొనుగోలు చేసి, విదేశాల్లో పెళ్లి చేసుకుంటే.. 50 శాతం మాత్రమే భారత్ ఖాతాలోకి వస్తుందన్నారు. మిగిలిన 50 శాతం (హోటల్, పెళ్లి ఏర్పాట్లు) ఖర్చులు విదేశానికి వెళ్తాయన్నారు. ఈ పెళ్లిళ్లపై ఈవెంట్ ఏజెన్సీలు, ఫోటోగ్రాఫర్లు ఆధారపడి ఉంటారని.. వీళ్లంతా పెళ్లిళ్ల సీజన్‌లోనే డబ్బులు సంపాదిస్తారని చెప్పారు. అలాంటప్పుడు డెస్టినేషన్ వెడ్డింగ్స్‌కి వధూవరులు విదేశాలకు వెళ్తే.. వాళ్లందరూ భారీగా నష్టపోవాల్సి ఉంటుందని వివరించారు.

ప్రధాని ఇప్పుడే ఎందుకు పెళ్లిళ్ల గురించి ప్రస్తావించారు?

ఇప్పుడు మన భారతదేశంలో ధనవంతుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. 2022లో రూ.8 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ నికర విలువ కలిగిన సంపన్నుల సంఖ్య 7,97,714కు చేరింది. 2027 నాటికి ఇది 16,57,272కి పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఈ సంపన్నులందరూ డెస్టినేషన్ వెడ్డింగ్‌పైనే ఎక్కువ మక్కువ చూపుతున్నారని CAT సంస్థ భావిస్తోంది. ఈ సంపన్నులంతా విదేశాలకు వెళ్లి పెళ్లిళ్లు చేసుకుంటే.. భారత్ ఆర్థిక వ్యవస్థ తప్పకుండా దెబ్బతింటుంది. అందుకే.. ప్రధాని మోదీ డెస్టినేషన్ వెడ్డింగ్స్ చేసుకోవద్దని ప్రత్యేకంగా కోరారు.

Updated Date - 2023-11-28T19:43:12+05:30 IST