Share News

Xi Jinping: జీ20 సమ్మిట్‌కి చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఎందుకు హాజరవ్వలేదు? కారణాలు ఇవేనా?

ABN , First Publish Date - 2023-11-23T14:59:31+05:30 IST

సాధారణంగా జీ20 వంటి శిఖరాగ్ర సమావేశాలు జరిగినప్పుడు.. సాధ్యమైనంతవరకు దేశాధ్యక్షులు, ప్రధానమంత్రులు హాజరు అవుతుంటారు. ద్రవ్యోల్బణం, ఆర్థిక వ్యవస్థ, గ్లోబల్ వార్మింగ్, ఇంకా మరెన్నో కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది..

Xi Jinping: జీ20 సమ్మిట్‌కి చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఎందుకు హాజరవ్వలేదు? కారణాలు ఇవేనా?

సాధారణంగా జీ20 వంటి శిఖరాగ్ర సమావేశాలు జరిగినప్పుడు.. సాధ్యమైనంతవరకు దేశాధ్యక్షులు, ప్రధానమంత్రులు హాజరు అవుతుంటారు. ద్రవ్యోల్బణం, ఆర్థిక వ్యవస్థ, గ్లోబల్ వార్మింగ్, ఇంకా మరెన్నో కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి.. అధ్యక్షులే రంగంలోకి దిగుతుంటారు. కానీ.. భారత్ అధ్యక్షతన న్యూఢిల్లీలో జరిగిన జీ20 సదస్సుకు మాత్రం చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఉద్దేశపూర్వకంగా హాజరు అవ్వలేదు. అలాగే.. నవంబర్ 22న జరిగిన వర్చువల్ జీ20 సమ్మిట్‌కి కూడా ఆయన గైర్హాజరయ్యారు. దీంతో.. షీ జిన్‌పింగ్ ఆ ప్రతిష్టాత్మక సమావేశానికి ఎందుకు హాజరు అవ్వలేదు? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఇదే విషయంపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌ని ప్రశ్నించగా.. తమకు ఎవరు ప్రాతినిధ్యం వహిస్తారన్నది ఆ దేశమే నిర్ణయించుకోవాలని జవాబిచ్చారు. సెప్టెంబరులో జరిగిన జీ20 సదస్సులో చైనా తరపున ప్రధాని లీ కియాంగ్ పాల్గొన్నారని, వర్చువల్ జీ20 సమ్మిట్‌లోనూ ఆయనే కొనసాగారని చెప్పారు. ‘‘తమ దేశానికి ఎవరు ప్రాతినిధ్యం వహించాలన్నది ఆ దేశమే నిర్ణయించుకోవాలి. ఈ ఏడాది సెప్టెంబర్‌లో దేశ రాజధాని ఢిల్లీలో జీ20 సమ్మిట్ నిర్వహించినప్పుడు.. చైనా తరఫున ప్రధాన మంత్రి లీ కియాంగ్ ఆ దేశానికి ప్రాతినిధ్యం వహించారు. కాబట్టి.. వాళ్లు అదే కొనసాగించాలని నిర్ణయించుకున్నారు’’ అని బుధవారం G20 ముగింపు ప్రెస్‌మీట్‌లో జై శంకర్ వివరణ ఇచ్చారు. భారతదేశంలో జరిగిన జీ20 ప్రెసిడెన్సీ గ్లోబల్ సౌత్-సెంట్రిక్ అని.. అది అభివృద్ధిని తిరిగి తీసుకొచ్చిందని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ సంస్థల్లోనూ ఈ సమ్మిట్ ప్రభావితం చూపించిందని అన్నారు. బందీలను విడుదల చేయడం, గాజాకు సహాయక సామగ్రి అందించడం, పోరాటంలో కొంత విరామంపై కుదిరిన అవగాహనను జీ20 సభ్యులు స్వాగతించారని జైశంకర్ అన్నారు.


ఇదిలావుండగా.. అటు సెప్టెంబర్‌లో వ్యక్తిగతంగా, ఇటు నవంబర్‌లో వర్చువల్‌గా జీ20 సమ్మిట్‌లకు షీ జిన్‌పింగ్ హాజరు కాకపోవడానికి ఇతర బలమైన కారణాలు ఉన్నాయని తెలుస్తోంది. అందులో ప్రధానమైనది.. ఇరుదేశాల మధ్య నెలకొన్న బార్డర్ వివాదం. ముఖ్యంగా.. 2020లో లడఖ్‌లో చైనా, భారతీయ సైన్యం మధ్య జరిగిన గొడవలతో ఇరుదేశాల మధ్య వివాదం తీవ్రంగా మారింది. మరో కారణం.. భారత్ అభివృద్ధిపథంలో ముందుకు దూసుకుపోతుండటం చైనాకి ఏమాత్రం మింగుడుపడటం లేదు. ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలవడం, జీ20 సమావేశానికి అధ్యక్షత వహించే స్థాయికి చేరడాన్ని చూసి.. చైనా ఏమాత్రం జీర్ణించుకోలేకపోతోంది. అందుకే.. షీ జిన్‌పింగ్ దూరం పాటిస్తున్నట్టు తెలుస్తోంది.

Updated Date - 2023-11-23T14:59:32+05:30 IST