Russia : పుతిన్‌పై తిరుగుబాటు చేసిన వాగ్నర్ చీఫ్ ఓ చిల్లర దొంగ!

ABN , First Publish Date - 2023-08-24T10:17:14+05:30 IST

రష్యాలో అత్యంత శక్తిమంతమైన కిరాయి సైన్యాధిపతి యెవ్‌జెనీ ప్రిగోజిన్ బుధవారం విమాన ప్రమాదంలో మరణించారు. ఆయన జీవితం చిల్లర దొంగతనాలతో ప్రారంభమైంది. 1980వ దశకంలో ఆయనపై అనేక దొంగతనం కేసులు నమోదయ్యాయి.

Russia : పుతిన్‌పై తిరుగుబాటు చేసిన వాగ్నర్ చీఫ్ ఓ చిల్లర దొంగ!

మాస్కో : రష్యాలో అత్యంత శక్తిమంతమైన కిరాయి సైన్యాధిపతి యెవ్‌జెనీ ప్రిగోజిన్ బుధవారం విమాన ప్రమాదంలో మరణించారు. ఆయన జీవితం చిల్లర దొంగతనాలతో ప్రారంభమైంది. 1980వ దశకంలో ఆయనపై అనేక దొంగతనం కేసులు నమోదయ్యాయి. వీటిలో శిక్ష పడటంతో ఆయన పదేళ్లపాటు జైలులో గడిపారు. టీనేజ్‌లోనే ఆయనకు 13 ఏళ్ల కారాగారవాస శిక్ష పడింది. 1990లో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు.

1990లలో సోవియెట్ యూనియన్ విచ్ఛిన్నమయ్యే పరిస్థితులు ఉండటాన్ని గమనించిన ప్రిగోజిన్ సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించారు. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో మోడెస్ట్ హాట్ డాగ్ సెల్లర్‌గా మారారు. ఆ తర్వాత సూపర్ మార్కెట్లు, రెస్టారెంట్లను ఏర్పాటు చేశారు. ఎప్పుడూ చాలా పెద్దవాటినే ఆయన కోరుకునేవారు. 1995లో రెస్టారెంట్ల నెట్‌వర్క్‌ను ప్రారంభించారు. కమ్యూనిస్టు పాలనలో రష్యన్లకు విలాసాలు తెలియవు. సోవియెట్ యూనియన్ విచ్ఛిన్నమైన తర్వాత ప్రజలు విలాసాలను కోరుకున్నారు. వారికి తగినట్లుగానే సేవలను అందించి, భారీ మొత్తంలో డబ్బు సంపాదించారు. అనంతరం రష్యాలోని సంపన్నుల్లో ఒకరిగా ఎదిగారు. అంతే వేగంతో రష్యా పాలక వర్గానికి సన్నిహితంగా మారారు. అధికారంలో ఉన్నవారితో ఎలా వ్యవహరించాలో తెలిసిన వ్యక్తిగా ఆయన జీవితంలో ఉన్నత స్థానాలకు దూసుకెళ్లారు. 2014లో క్రిమియాపై రష్యా యుద్ధం చేసిన సమయంలో వాగ్నర్ గ్రూప్ కిరాయి సైన్యాన్ని ప్రారంభించారు. రష్యా సైన్యంతో కలిసి వాగ్నర్ గ్రూప్ దళాలు పోరాడాయి. అయితే ఈ కిరాయి సైన్యంతో తనకు సంబంధాలు ఉన్నాయనే విషయాన్ని ఆయన 2022లో మాత్రమే అంగీకరించారు.

విమాన ప్రమాదం

వాగ్నర్ మెర్సినరీ గ్రూప్ (కిరాయి సైన్యం) అధిపతి యెవ్‌జెనీ ప్రిగోజిన్ ప్రయాణిస్తున్న విమానం మాస్కో నుంచి సెయింట్ పీటర్స్‌బర్గ్ వెళ్తుండగా ట్వేర్ రీజియన్‌లోని కుఝెంకినో గ్రామం సమీపంలో బుధవారం కూలిపోయింది. మాస్కోకు ఉత్తర దిశలో బుధవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ఈ విమానంలో ఉన్నవారంతా ప్రాణాలు కోల్పోయారు. రష్యన్ వైమానిక సంస్థ రోసావియట్సియా విడుదల చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, ఈ విమాన ప్రమాదంలో మొత్తం 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రిగోజిన్, వాగ్నర్ కిరాయి సైన్యాన్ని ఏర్పాటు చేయడానికి ఆయనకు సహకరించిన దిమిత్రీ ఉట్కిన్ కూడా మరణించారు. ఈ సంఘటనపై దర్యాప్తు ప్రారంభమైనట్లు రష్యన్ ఇన్వెస్టిగేటర్లు ప్రకటించారు. మరో వాదన ప్రకారం, భూమిపై నుంచి గగనతలంపైకి క్షిపణులను ప్రయోగించి, ఈ విమానాన్ని కూల్చేసి ఉంటారని భావిస్తున్నారు.


ప్రిగోజిన్ ప్రకటన

తాను రష్యా సైన్యానికి శత్రువునని ప్రిగోజిన్ ప్రకటించుకున్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యా అసమర్థంగా వ్యవహరిస్తోందని, అందుకే తాను రష్యా సైనిక నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నానని ప్రకటించారు. రెండు నెలల క్రితం ఆయన నేతృత్వంలోని కిరాయి సైన్యం రష్యాపై తిరుగుబాటుకు విఫలయత్నం చేసింది.

యెవ్‌జెనీ ప్రిగోజిన్‌కు అనుబంధంగా పని చేస్తున్న టెలిగ్రామ్ చానల్ గ్రే జోన్‌ ఆయన మరణవార్తను ప్రసారం చేసింది. విమానం కూలిపోవడంతో ఆయన బుధవారం మరణించారని, ఆయన గొప్ప హీరో, దేశ భక్తుడు అని తెలిపింది. రష్యా ద్రోహుల చేతుల్లో ఆయన ప్రాణాలు కోల్పోయారని ఆరోపించింది.

భిన్న వాదనలు

యెవ్‌జెనీ ప్రిగోజిన్‌కు సన్నిహితుల్లో కొందరు స్పందిస్తూ, ఇది రష్యా పనేనని ఆరోపిస్తుండగా, మరికొందరు మాత్రం ఇది ఉక్రెయిన్ పని అని ఆరోపిస్తున్నారు. ఉక్రెయిన్ గురువారం స్వాతంత్ర్య దినోత్సవాలు జరుపుకుంటోంది. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో వాగ్నర్ కార్యాలయాలు ఉన్న భవనంలోని కిటీకీల నుంచి శిలువ గుర్తు కనిపించే విధంగా దీపాలను వెలిగించారు. ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేయడం కోసం ఈ ఏర్పాట్లు చేశారు.

అయోమయంలో వాగ్నర్ గ్రూప్ భవిత

ప్రిగోజిన్ మరణంతో వాగ్నర్ గ్రూప్ నాయకత్వ లేమితో సతమతమవుతుంది. ఆఫ్రికా తదితర దేశాల్లో ఈ గ్రూప్ భవిష్యత్తు కార్యకలాపాలు ప్రశ్నార్థకమవుతాయి. మరోవైపు రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్‌కు పెద్ద తలనొప్పి తగ్గుతుంది. 1999లో అధికారంలోకి వచ్చిన పుతిన్‌కు పెను సవాలును విసిరిన వ్యక్తి ప్రిగోజిన్ మాత్రమే. ఇదిలావుండగా, వాగ్నర్ చీఫ్ ప్రిగోజిన్ మరణంపై రష్యా ప్రభుత్వం అధికారికంగా స్పందించలేదు.


ఇవి కూడా చదవండి :

Chandrayaan-3 Super Success : మువ్వెన్నెల పతాకం

Tamils ​​are the Saraths : మూడుసార్లూ తమిళులే సారథులు

Updated Date - 2023-08-24T10:38:33+05:30 IST