Ayodhya Ram Mandir: రామ్ లాలా విగ్రహం ఎంపికపై ఓటింగ్... ఏ విగ్రహానికి చోటు దక్కేనో..?
ABN , Publish Date - Dec 29 , 2023 | 04:50 PM
అయోధ్యలో భవ్య రామాలయ ప్రారంభోత్సవం, విగ్రహ ప్రతిష్టాపన దగ్గరపడుతున్న కొద్దీ భక్తుల్లో కోలాహలం పెరుగుతోంది. ఇందులో భాగంగానే 'రామ్ లాలా' విగ్రహం ఎంపిక కోసం శుక్రవారంనాడు ఓటింగ్ నిర్వహించనున్నారు. ఇందుకోసం మూడు రామ్ లాలా విగ్రహాలు పోటీ పడుతున్నాయి.
అయోధ్య: శ్రీరాముడు జన్మించిన అయోధ్యలో భవ్య రామాలయ ప్రారంభోత్సవం, విగ్రహ ప్రతిష్టాపన దగ్గరపడుతున్న కొద్దీ భక్తుల్లో కోలాహలం పెరుగుతోంది. ఇందులో భాగంగానే 'రామ్ లాలా' (Rama Lalla) విగ్రహం ఎంపిక కోసం శుక్రవారంనాడు ఓటింగ్ నిర్వహించనున్నట్టు సమాచారం. అయోధ్యలోని శ్రీ రామ్ జన్మభూమి తీర్థ్ క్షేత్ర్ సమావేశంలో ఓటింగ్ జరుగనున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం మూడు రామ్ లాలా విగ్రహాలు పోటీ పడుతుండగా, ఉత్తమమైనదిగా ఎంపికైన బాలరాముడిని తెల్లటి పాలరాత్రి మక్రానా మార్బెల్‌తో తీర్చిదిద్దిన గర్భగుడిలో ప్రతిష్టించనున్నట్టు ట్రస్టు కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు.
రామ్‌సేవక్‌పురన్‌లో అత్యంత గోప్యంగా ముగ్గురు శిల్పులు మూడు 'రామ్ లాలా' శిల్పాలను చెక్కుతున్నారు. ఐదేళ్ల బాలుడిగా ఈ బాలరాముడి విగ్రహాలను తీర్చిదిద్దుతున్నారు. ఈ మూడింటిలో ముగ్ద మనోహరంగా, చూడముచ్చగా ఉండే విగ్రహాన్ని ఎంపిక చేస్తారు. హెరిటేజ్ సైన్స్ నిపుణులు, నలుగురు శంకరాచార్యులు, సాధుసంతులు ఈ విగ్రహాన్ని ఎంపిక చేయనున్నారు. గర్భగుడిలో ప్రతిష్టించే విగ్రహం అక్కడే స్థిరంగా ఉంటుంది. తక్కిన రెండు విగ్రహాలను ఆలయంలోనే వేరో చోట ఉంచుతారు. ప్రస్తుతం తాత్కాలిక ఆలయం వద్ద ఉన్న తెల్లటి పాలరాతి విగ్రహాన్ని కదిలో విగ్రహంగా పండుగల సమయాల్లో రథంపై బయటకు తీసుకువస్తారని చెబుతున్నారు.
జనవరి 22న గ్రాండ్ సెర్మనీ
కొత్త సంవత్సరం జనవరి 22వ తేదీని రామాలయంలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం నభూతో నభవిష్యతి అనే రీతిలో జరిపేందుకు విస్తృతమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరవుతున్నారు. ఆయన డిసెంబర్ 30న టెంపుల్ టౌన్ అయోధ్యలో పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా అధునాతన హంగులు, సౌకర్యాలతో సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేసిన అయోధ్య రైల్వే స్టేషన్‌ను ప్రధాని ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ఒక ర్యాలీలోనూ ఆయన పాల్గొంటారు. మరోవైపు బిర్లా ధర్మశాల ముందు రామజన్మభూమి టెంపుల్ సైట్‌కు దారితీసే సెరిమోనియల్ గేట్‌వేకు కార్మికులు తుదిమెరుగులు దిద్దుతున్నారు. హనుమాన్‌గడీ టెంపుల్ సమీపంలోని ఈ గేట్‌వే భవ్య రామాలయానికి దారితీస్తుంది. హనుమాన్‌గడీ ఆలయం, టెంపుల్ కాంప్లెక్స్ నిర్మాణ స్థలానికి దారితీసే రోడ్ల వెంబడి భారీగా భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. విగ్రహ ప్రతిష్టాన కార్యక్రమానికి భారీగా జనం తరలివస్తారని అంచనా వేస్తుండటంతో సిటీ మొత్తాన్ని సర్వాంగ సుందరంగా అలంకరిస్తున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో 'సూర్య స్తంభాలు' ఏర్పాటు చేస్తు్న్నారు.