VK Shashikala: అపాయింట్‌మెంట్ ప్లీజ్!
ABN , First Publish Date - 2023-07-05T07:18:50+05:30 IST
మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం అన్నాడీఎంకేలో ఏర్పడిన విభేదాల కారణంగా ఆ పార్టీకి దూరమైన వీకే శశికళ(VK Shashikala)..
- అమిత్‌షా కోసం శశికళ యత్నం
- దినకరన్ పార్టీకి అధ్యక్షుడిగా ఓపీఎస్!
చెన్నై, (ఆంధ్రజ్యోతి): మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం అన్నాడీఎంకేలో ఏర్పడిన విభేదాల కారణంగా ఆ పార్టీకి దూరమైన వీకే శశికళ(VK Shashikala).. మళ్లీ ఆ పార్టీలోకి అడుగు పెట్టేందుకు అలుపెరగకుండా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అన్నాడీఎంకే నుంచి విడివడిన వర్గాలన్నింటినీ ఏకతాటిపైకి తెస్తానంటూ ప్రతినబూనిన ఆమె.. ఆ ప్రయత్నాల సంగతెలాగున్నా, ఆమెను మాత్రం మళ్లీ పార్టీలోకి అడుగుపెట్టనిచ్చే ప్రసక్తే లేదని అన్నాడీఎంకే(AIADMK) ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అయినా ఆమె తన వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. బీజేపీ అగ్రనేత, కేంద్ర హోమంత్రి అమిత్‌షాతో ఇటీవల బెంగళూరు(Bangalore)లో భేటీ అయిన ఆమె.. మళ్లీ తాను అన్నాడీఎంకేలోకి అడుగు పెట్టేందుకు సహకరించాలని, అందుకు ప్రతిగా పార్టీ నుంచి పూర్తి సహకారం అందిస్తానని హామీనిచ్చారు. అందుకు అంగీకరించిన అమిత్‌షా తన మాటగా ఈపీఎస్‌కు రాయబారం పంపినట్లు తెలిసింది. అయితే ఆ రాయబారాన్ని సున్నితంగా తిరస్కరించిన ఈపీఎస్.. ‘అది తప్ప ఇంకేమైనా చెప్పండి’ అంటూ తెగేసి చెప్పినట్లు సమాచారం. దాంతో దిగ్ర్భాంతికి లోనైన శశికళ.. మరోమారు అమిత్‌షాతో భేటీ కావాలని భావిస్తున్నట్లు తెలిసింది.. ఇందుకోసం అమిత్‌షా అపాయింట్‌మెంట్ కోరినట్లు తెలిసింది. అయితే ఇప్పటి వరకూ అటు నుంచి ఎలాంటి స్పందన లేదని, అపాయింట్ ఖరారైతే ఆమె వెంటనే ఢిల్లీ వెళ్తారని శశికళ సన్నిహితులు చెబుతున్నారు.
దినకరన్ పార్టీకి అధ్యక్షుడిగా ఓపీఎస్?: ‘అమ్మా మక్కల్ మున్నేట్ర కళగం’ (ఏఎంఎంకే)కు కొత్త అధ్యక్షుడి ఎంపిక త్వరలో జరగనుంది. టీటీవీ దినకరన్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఏఎంఎంకేకు ఇప్పటి వరకూ అధ్యక్షులు లేరు. నిజానికి పార్టీకి అధ్యక్షురాలిగా తన సన్నిహిత బంధువు శశికళను పెట్టాలని దినకరన్ భావించినా, అందుకామె సున్నితంగా తిరస్కరించినట్లు తెలిసింది. ఇప్పుడు ఏఎంఎంకేకు అధ్యక్షురాలిగా ఉంటే భవిష్యత్తులో అన్నాడీఎంకేలో అడుగు పెట్టడం కష్టమని ఆమె సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. దాంతో ఆ పదవిని ఖాళీగానే ఉంచిన దినకరన్.. ఇప్పటికైనా దాన్ని భర్తీ చేయాలని తలపోస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా రాజకీయ అనుభవం ఉన్న నేతను ఆ పదవిలో కూర్చోబెట్టాలని గట్టిగా భావిస్తున్న దినకరన్.. తన ప్రతిపాదనను మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం (Former Chief Minister O. Panneerselvam) ముందు ఉంచినట్లు తెలిసింది. దీనిపై ఓపీఎస్ తన సన్నిహితులతో చర్చిస్తున్నారు. ఈ పదవిని స్వీకరిస్తే తన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందన్న దానిపై ఆయన మంతనాలు జరుపుతున్నారు. కాగా ఆగస్టు 6న ఏఎంఎంకే రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం జరగనుంది. ఆ సమావేశానికి ముందే అధ్యక్షుడు ఎవరన్న దానిపై దినకరన్ ఒక నిర్ణయానికి వచ్చే అవకాశముందని తెలిసింది. ఓపీఎస్‌తో సన్నిహిత సంబంధాలుండడంతో ఆయన్నే పార్టీ అధ్యక్షుడిగా నియమించే అవకాశముందని దినకరన్ సన్నిహితులు చెబుతున్నారు. ఢిల్లీలో ఉన్న బీజేపీ పెద్దలు కూడా మూడుగా చీలిన అన్నాడీఎంకేను ఏకం చేసే ప్రయత్నాల్లో ఉన్నారని, వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఒకవేళ అన్నాడీఎంకే తమతో చేతులు కలపని పక్షంలో టీటీవీ బృందంతో పొత్తు కుదుర్చుకునేందుకు బీజేపీ పెద్దలు యోచిస్తున్నారని దినకరన్ సన్నిహిత నేత ఒకరు వ్యాఖ్యానించారు.