Viral Fever: వణికిస్తున్న వైరల్‌ ఫీవర్‌

ABN , First Publish Date - 2023-02-24T07:37:57+05:30 IST

సీజనల్‌ ఇన్‌ఫెక్షన్లు, వైరల్‌ ఫీవర్‌(Viral Fever) కారణంగా రాజధాని నగరం చెన్నైలోని పలు ఆస్పత్రుల్లో రోగుల సంఖ్య పెరుగుతోంది. జ్వరం, గొంతు

Viral Fever: వణికిస్తున్న వైరల్‌ ఫీవర్‌

- ఆస్పత్రులకు క్యూ కడుతున్న చెన్నై నగరవాసులు

ప్యారీస్‌(చెన్నై): సీజనల్‌ ఇన్‌ఫెక్షన్లు, వైరల్‌ ఫీవర్‌(Viral Fever) కారణంగా రాజధాని నగరం చెన్నైలోని పలు ఆస్పత్రుల్లో రోగుల సంఖ్య పెరుగుతోంది. జ్వరం, గొంతు నొప్పి, దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు చికిత్స అనంతరం కోలుకోడానికి చాలా సమయం పడుతోంది. నగరంలో కొత్త రకం వైరల్‌ ఫీవర్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో, వైద్యులను సంప్రదించకుండానే చాలామంది యాంటీ బయాటిక్స్‌ వాడుతున్నారు. ఇదిలా ఉండగా, యాంటీ బయాటిక్స్‌(Anti -Biotics) వైరస్‏కు వ్యతిరేకంగా పనిచేయవని, ఇటువంటి విధానంతో నయం కాదని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. అక్టోబరు నుంచి ఫిబ్రవరి మధ్యకాలంలో శీతాకాల సీజన్‌లో వైరల్‌ జ్వరాలు సాధారణమైనప్పటికీ, వాతావరణంలో మార్పుల కారణంగా ప్రజలు దగ్గు, జలుబు తదితర సమస్యలతో 15 రోజుల వరకు బాధపడుతున్నారు. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో కేసుల సంఖ్య పెరుగుతోంది. కాగా, చాలామంది ప్రస్తుతం మాస్కులు ధరించకపోతుండడంతో, వైరల్‌, ఇతర ఇన్‌ఫెక్షన్లకు సులభంగా గురవుతున్నారు. దగ్గు, జలుబు ఉన్న వారు వైద్యులను సంప్రదించకుండా దుకాణాల్లో కొనుగోలు చేసే టాబ్లెట్లు, ఇతర టానిక్‌లను వాడడం శ్రేయస్కరం కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వైద్యుల సలహా మేరకు క్రమం తప్పకుండా మందులు వాడిన తర్వాత కూడా జ్వరం తగ్గని పక్షంలో రక్తపరీక్షలు చేయించుకొని, తగిన చికిత్స చేయించుకోవాలని వారు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఆహారంలో పోషక విలువలు అధికంగా ధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని ఆరోగ్యశాఖ అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు.

Updated Date - 2023-02-24T07:38:08+05:30 IST