Vande Bharat trains: 2019 నుంచి రాళ్లు రువ్విన ఘటనల్లో రైల్వేలకు నష్టం ఎంతంటే?

ABN , First Publish Date - 2023-07-26T19:09:46+05:30 IST

కేంద్ర ప్రభుత్వం 2019లో వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇంతవరకూ అల్లరిమూకలు రాళ్లు రువ్విన ఘటనల్లో రైల్వేలకు జరిగిన నష్టం ఎంతో తెలుసా?. రూ.55 లక్షల పైమాటే. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పార్లమెంటుకు బుధవారంనాడు ఒక లిఖిత పూర్వక సమాధానంలో ఈ విషయాన్ని తెలియజేశారు.

Vande Bharat trains: 2019 నుంచి రాళ్లు రువ్విన ఘటనల్లో రైల్వేలకు నష్టం ఎంతంటే?

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం 2019లో వందే భారత్ రైళ్ల (Vande Bharat trains)ను ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇంతవరకూ అల్లరిమూకలు రాళ్లు రువ్విన ఘటనల్లో రైల్వేలకు జరిగిన నష్టం ఎంతో తెలుసా?. రూ.55 లక్షల పైమాటే. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnaw) పార్లమెంటుకు బుధవారంనాడు ఒక లిఖిత పూర్వక సమాధానంలో ఈ విషయాన్ని తెలియజేశారు. లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ, రాళ్లు రువ్విన ఘటనల్లో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడం కానీ, దొంగతనం కానీ, ప్రయాణికుల వస్తువులకు ఎలాంటి నష్టం కానీ జరగలేదని చెప్పారు. ఈ ఘటనలకు పాల్పడిన 151 మందిని అరెస్టు చేసినట్టు తెలిపారు. 2019,2020,2021,2022,2023 జూన్ వరకూ వందేభారత్ రైళ్లకు రూ.55.60 లక్షల మేరకు నష్టం జరిగినట్టు చెప్పారు.


ప్రయాణికుల ప్రాణాలు, రైల్వే ఆస్తులకు రక్షణ కల్పించేందుకు జిల్లా పోలీసులు, సివిల్ అడ్మినిస్ట్రేషన్ సమన్వయంతో ఆర్‌పీఎఫ్ 'ఆపరేషన్ సాథి' ప్రచారం జరుపుతోందన్నారు. రైల్వే ట్రాక్‌లకు సమీపంలో నివసిస్తున్న ప్రజలను కలిసి ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నట్టు చెప్పారు. ఆందోళనల సమయంలో రైల్వే ఆస్తుల విధ్వంసం వల్ల జరిగే నష్టం, అనంతర పరిణామాల గురించి ప్రజలకు వివరిస్తున్నారని తెలిపారు. తరచు విధ్వంస ఘటనలు చేటుచేసుకుంటున్న సెక్షన్లలో గస్తీని పటిష్టం చేశామన్నారు. కదిలే రైళ్లపై రాళ్లు రువ్వుతున్న ఘటనల్లో తీసుకోవాల్సిన చర్యలపై సమగ్రమైన గైడ్‌లైన్స్ జారీ చేశామని తెలిపారు. తరచు అల్లర్లు జరిగే "బ్లాక్ స్పాట్స్‌'' వద్ద తాగుబోతులు, అల్లర్ల ముఠాలు వంటి సంఘ వ్యతిరేక శక్తులపై కన్నేసి ఉంచామని, రెగ్యులర్ తనిఖీలు జరుపుతున్నామని చెప్పారు.

Updated Date - 2023-07-26T19:09:46+05:30 IST