Share News

Apple Hacking Alert: ‘హ్యాకింగ్ అలర్ట్’ వివాదం.. యాపిల్ సంస్థకు వార్నింగ్ ఇచ్చిన కేంద్రమంత్రి

ABN , First Publish Date - 2023-10-31T22:08:43+05:30 IST

ఆండ్రాయిడ్ డివైజ్‌లతో పోల్చినప్పుడు ఐఫోన్‌లలో ఉన్న ప్రత్యేకత ఏమిటని అడిగితే.. నాణ్యతతో పాటు ప్రైవసీ అని ప్రతిఒక్కరూ చెప్తారు. స్వయంగా ఆ కంపెనీనే.. వినియోగదారుల ప్రైవసీకి కట్టుబడి ఉంటామని ఒకటే ‘స్వరం’ ఊదరగొడుతూనే...

Apple Hacking Alert: ‘హ్యాకింగ్ అలర్ట్’ వివాదం.. యాపిల్ సంస్థకు వార్నింగ్ ఇచ్చిన కేంద్రమంత్రి

ఆండ్రాయిడ్ డివైజ్‌లతో పోల్చినప్పుడు ఐఫోన్‌లలో ఉన్న ప్రత్యేకత ఏమిటని అడిగితే.. నాణ్యతతో పాటు ప్రైవసీ అని ప్రతిఒక్కరూ చెప్తారు. స్వయంగా ఆ కంపెనీనే.. వినియోగదారుల ప్రైవసీకి కట్టుబడి ఉంటామని ఒకటే ‘స్వరం’ ఊదరగొడుతూనే ఉంటుంది. అఫ్‌కోర్స్.. అది దాదాపు నిజం కూడా! కానీ, ఎంత తెలివైనవాడైనా ఏదో ఒక చిన్న తప్పు చేస్తాడన్న నానుడి అన్నట్టు.. యాపిల్ సంస్థ తయారుచేసిన ఈ ఐఫోన్‌లలోనూ అప్పుడప్పుడు తప్పులు దొర్లుతుంటాయి. ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యమే తాజా ‘హ్యాకింగ్ అలర్ట్’ వివాదం.

‘స్టేట్-స్పాన్సర్డ్’ హ్యాకర్లు మీ డివైజ్‌ను హ్యాక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వచ్చిన ఆ అలర్ట్.. దేశ రాజకీయాల్లో పెను దుమారమే రేపింది. ఎందుకంటే.. ఈ అలర్ట్ కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రాతో పాటు ఇతర నేతలకూ వచ్చింది. దీంతో.. వాళ్లందరూ ఆందోళన చెందారు. తమ ఫోన్లను కేంద్ర ప్రభుత్వం ట్యాప్ చేయిస్తుందేమోనని భయపడి, మీడియా ముందు ఆ ఆరోపణలు చేశారు. తీరా చూస్తే.. ఇది నకిలీ అలర్ట్ అయ్యుంటుందని యాపిల్ సంస్థ ఈ వివాదంపై ఒక ప్రకటన విడుదల చేసింది. స్టేట్-స్పాన్సర్డ్ హ్యాకర్లు హ్యాకింగ్‌ చేసేందుకు అధునాతన పద్ధతులను అవలంభిస్తారని, ఇది వారి పని కాదని స్పష్టం చేసింది. అయితే.. ఈ అలర్ట్ నోటిఫికేషన్ ఎందుకొచ్చిందన్న రహస్యాన్ని మాత్రం బయటపెట్టలేదు.


ఏది ఏమైనా.. ఇది అనుకోకుండా దొర్లిన తప్పు అని యాపిల్ అంగీకరించడంతో కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఆ సంస్థపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో ఆ సంస్థకు వరుసగా కొన్ని ప్రశ్నలు సంధించారు. తన పరికరాలు సురక్షితంగా ఉన్నాయో లేదో స్పష్టం చేయాలని ఆ కంపెనీని డిమాండ్ చేయడమే కాదు.. గోప్యతపై ఆ సంస్థ ఎంతలా కట్టుబడి ఉందో తమ ప్రభుత్వం కూడా దర్యాప్తు చేస్తుందని హెచ్చరించారు. 150కి పైగా దేశాల్లోని ప్రజలకు ఈ హ్యాకింగ్ అలర్ట్ ఎందుకు పంపబడిందో వివరించాలని కోరారు. ప్రపంచంలోనే అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ తయారీదారు అయిన యాపిల్ సంస్థ.. గోప్యతను దృష్టిలో ఉంచుకుని తమ ఉత్పత్తులను రూపొందించడం జరిగిందని పదేపదే వాదించడాన్ని ఆయన ఎత్తి చూపారు.

భారతదేశ పౌరుల గోప్యతను రక్షించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ బాధ్యతను తాము తీవ్రంగా పరిగనిస్తామని రాజీవ్ పేర్కొన్నారు. ఈ అలర్ట్ నోటిఫికేషన్‌తో పాటు సురక్షితమైన, గోప్యతను దాచి ఉంచే డివైజ్‌లను తయారు చేస్తున్న ఆపిల్ వాదనలను ప్రభుత్వం పరిశీలిస్తుందని తెలిపారు. ప్రైవసీ అనేది ప్రాథమిక హక్కు అని.. ప్రైవసీకి కట్టుబడి ఉన్నప్పుడు ఈ హ్యాకింగ్ అలర్ట్ ఎలా వస్తుందని ఆ సంస్థను నిలదీశారు. ఇదే సమయంలో.. తమ దేశ పౌరుల గోప్యత, భద్రతను రక్షించడంలో కేంద్ర ప్రభుత్వం తన పాత్రను చాలా సీరియస్‌గా తీసుకుంటుందని ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై వివరణాత్మక దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేశామని కూడా వెల్లడించారు.

విపక్షాల ఆరోపణలేంటి?

తమకు ఈ హ్యాకింగ్ అలర్ట్ నోటిఫికేషన్ రాగానే.. థరూర్, మోయిత్రా, ప్రియాంక చతుర్వేది, పవన్ ఖేరాలతో పాటు ఇతర నేతలు స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. హ్యాకర్లతో కేంద్రం తమ ఫోన్లు ట్యాప్ చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మీడియా సమావేశం నిర్వహించి.. కేంద్రంపై విరుచుకుపడ్డారు. సాధ్యమైనంత ఎక్కువ ఫోన్ ట్యాప్ చేయండని, తన ఫోన్ కూడా ఇస్తానని, ఇలాంటి చర్యలతో తాము ఏమాత్రం భయపడబోమని తేల్చి చెప్పారు.

Updated Date - 2023-10-31T22:08:43+05:30 IST