Two weeks: మరో రెండువారాలు ఎండలు అధికంగా ఉంటాయట..

ABN , First Publish Date - 2023-06-03T07:05:08+05:30 IST

రాష్ట్రంలో మరో రెండు వారాలపాటు ఎండలు అధికంగానే ఉంటాయని స్థానిక వాతావరణ పరిశోధన కేంద్రం(Atmospheric Research Centre) ప్రకటించింది.

Two weeks: మరో రెండువారాలు ఎండలు అధికంగా ఉంటాయట..

చెన్నై, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మరో రెండు వారాలపాటు ఎండలు అధికంగానే ఉంటాయని స్థానిక వాతావరణ పరిశోధన కేంద్రం(Atmospheric Research Centre) ప్రకటించింది. మే 29తో అగ్నినక్షత్రం ముగిసినా, ప్రస్తుతం రాష్ట్రమంతటా ఎండ తీవ్రత ఏమాత్రం తగ్గలేదు. పగటిపూట చెన్నై సహా తిరుచ్చి, కోయంబత్తూరు, మదురై(Trichy, Coimbatore, Madurai), తిరునల్వేలి, కన్నియాకుమారి తదితర ప్రాంతాల్లో ఎండ వేడిమి అధికంగానే ఉంటోంది. ఇక నగరంలో గత మూడు రోజులుగా వడగాడ్పులు అధికంగా ఉన్నాయి. వేడి గాలులు వీస్తుండటంతో నగరవాసులు చెమటలతో తడిసిముద్దవుతున్నారు. రాత్రిపూట చల్లటి గాలులు వీయకపోవడంతో నగరవాసులు ఉక్కపోతను అనుభవిస్తున్నారు. ఈ నేపథ్యంలో అగ్నినక్షత్రం ఎండలు ముగిసిన తర్వాత కూడా రాష్ట్రంలో పగటి పూట ఉష్ణోగ్రత అధికంగా నమోదు కావటం ఆనవాయితీ అని స్థానిక వాతావరణ పరిశోధన కేంద్రం అధికారి బాలచంద్రన్‌ తెలిపారు. యేటా జూన్‌లోనూ ఎండలు అధికంగానే కాస్తాయని ఆయన చెప్పారు. ఈ మేరకు ఈ యేడాది కూడా ఈ నెల 16 వరకూ పగటి ఉష్ణోగ్రత వంద డిగ్రీల ఫారన్‌హీట్‌ కంటే అధికంగానే నమోదవుతుందన్నారు. 16 తర్వాతే రాష్ట్రంలో ఎండలు తగ్గుముఖం పడతాయని ఆయన వివరించారు. చెన్నైలో శుక్రవారం కూడా పగటి ఉష్ణోగ్రత సాధారణ స్థాయి కంటే అధికంగానే ఉందని ఆయన పేర్కొన్నారు.

కారుపై ఆమ్లెట్‌ వేసిన యువకులు

nani1.jpgచెంగల్పట్టులో రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. గత నెలరోజులుగా అగ్నినక్షత్రం ప్రభావంతో స్థానికులు ఉదయం 9 గంటల అనంతరం ఇళ్ల నుంచి బయటకు రావడం మానేశారు. వాతావరణం చల్లబడ్డాక సాయంత్రం 5 గంటల నుంచి తమ పనులు చక్కబెట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో, ఎండ తీవ్రత తెలియజేసేలా చెంగల్పట్టు బైపాస్‌ రోడ్డులో తమ కార్లు నిలిపిన కొంతమంది యువకులు, కారు పైభాగంలో కోడిగుడ్లతో ఆమ్లెట్‌ వేసి అందర్నీ ఆకట్టుకున్నారు.

Updated Date - 2023-06-03T07:05:10+05:30 IST