Abhishek Banerjee: కోటి ఉత్తరాలతో కేంద్రంపై సమరం..!

ABN , First Publish Date - 2023-04-09T17:52:35+05:30 IST

పశ్చిమబెంగాల్‌కు నిధుల బకాయిలు చెల్లించడం లేదంటూ కేంద్రంపై నిప్పులు చెరుగుతున్న మమతా బెనర్జీ సారథ్యంలోని..

Abhishek Banerjee: కోటి ఉత్తరాలతో కేంద్రంపై సమరం..!

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌కు (West Bengal) నిధుల బకాయిలు చెల్లించడం లేదంటూ కేంద్రంపై నిప్పులు చెరుగుతున్న మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ''కోటి ఉత్తరాల ప్రచారం'' (1 Crore Letter Campaign) చేపట్టనున్నట్టు ప్రకటించింది. తమ వాటా నిధులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని కోటి మంది సంతకాలతో కూడిన లేఖలను కేంద్రానికి పంపుతామని టీఎంసీ ప్రధాన కార్యదర్శి, డైమండ్ హార్బర్ ఎంపీ అభిషేక్ బెనర్జీ (Abhisekh Banerjee) తెలిపారు. అలిపురద్వార్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, తమ వాటా నిధులు ఇవ్వాలని కోరుతూ కోటి సంతకాలతో కూడిన ఉత్తరాలను తీసుకుని తానే ఢిల్లీకి వెళ్తానని చెప్పారు. టీఎంసీ బూత్ లెవల్ కార్యకర్తలు ఈ లేఖలను సేకరిస్తారని, బకాయిలు రాని ఎంజీఎన్ఆర్‌ఈజీఏ లబ్ధిదారులను కూడా వెంటబెట్టుకుని ఢిల్లీలోకి అడుగుపెడతామని చెప్పారు. తమను ఎలా ఢిల్లీలో అడుగుపెట్టకుండా అడ్డుకుంటారో చూస్తామన్నారు.

పెండింగ్ బకాయిల డిమాండ్‌పై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం ఇటీవల కోల్‌కతా రెండు రోజుల బైఠాయింపు ధర్నా జరిపారు. అయితే సీఎం ఆరోపణలను బీజేపీ తోసిపుచ్చింది. తృణమూల్ కాంగ్రెస్ అవినీతిలో కూరుకుపోయిందని, ఖర్చులు చూపించడం లేదని, దీంతో కేంద్రం బకాయి సొమ్ములు నిలిచిపోయాయని ఆరోపించింది.

బెంగాల్ న్యూ ఇయర్ ‌రోజున ఆందోళన షురూ..

కాగా, పెండింగ్ బకాయిల కోసం కోటి ఉద్యమాల సేకరణ కార్యక్రమాన్ని బెంగాల్ న్యూఇయర్ రోజు ప్రారంభించనున్నట్టు అభిషేక్ బెనర్జీ తెలిపారు. ప్రతి బూత్‌లోనూ ఆందోళన చేపడతామని, నెలరోజుల పాటు సంతకాలు సేకరించి, నెల తర్వాత 50,000 మంది ప్రజలు, కోటి ఉత్తరాలతో ఢిల్లీ వెళ్తామని చెప్పారు. పీఎంఓ కార్యాలయానికి, గ్రామీణాభివృద్ధి మంత్రికి వీటిని అందజేస్తామని చెప్పారు. మూడు రోజుల క్రితం 25 మంది ఎంపీలతో ఢిల్లీ వెళ్లానని, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌ను కలిసే ప్రయత్నం చేశానని అభిషేక్ బెనర్జీ చెప్పారు. అయితే, మంత్రి తమకు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని, తమను కలిసే ధైర్యం లేనందునే ఆయన ముఖం చాటువేశారని తెలిపారు. కేంద్రం నిధులు నిలిపిఉంచిన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది పశ్చిమబెంగాల్ రాష్ట్ర్రం మాత్రమేనని, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చిత్తుగా ఓడిపోవడమే ఇందుకు కారణమని అభిషేక్ అన్నారు.

Updated Date - 2023-04-09T17:52:35+05:30 IST