Tollgate fee: 20 టోల్‌గేట్లలో రుసుము పెంపు

ABN , First Publish Date - 2023-09-01T10:30:03+05:30 IST

రాష్ట్రంలోని 20 టోల్‌గేట్లలో(Tollgates) గురువారం అర్ధరాత్రి నుంచి వాహనాల రుసుం పెరగనున్నాయి. రుసుము పెంపు కారణంగా

Tollgate fee: 20 టోల్‌గేట్లలో రుసుము పెంపు

- అద్దె పెంచే యోచనలో లారీ యజమానులు

చెన్నై, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని 20 టోల్‌గేట్లలో(Tollgates) గురువారం అర్ధరాత్రి నుంచి వాహనాల రుసుం పెరగనున్నాయి. రుసుము పెంపు కారణంగా తాము అదనపు వ్యయాన్ని మోయలేమని, వీలైనంత త్వరగా అద్దె పెంచడం మినహా మరో గత్యంతరం లేదని సేలం జిల్లాకు చెందిన లారీ యజమానులు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 53 టోల్‌గేట్లున్నాయి. వీటికి యేడాదికి రెండు కేటగిరీలుగా ఏప్రిల్‌ ఒకటి నుంచి, సెప్టెంబర్‌ ఒకటి నుంచి రుసుము పెంచుతున్నారు. ఆ మేరకు గురువారం అర్ధరాత్రి నుండి సేలం, కరూరు, ధర్మపురి, ఈరోడ్‌(Salem, Karur, Dharmapuri, Erode) జిల్లాల్లో టోల్‌గేట్లలో రుసుము పెంపు అమల్లోకి వస్తుంది. ఓమలూరు టోల్‌గేట్‌ వద్ద కార్లు, వ్యాన్‌, జీపులు ఒకసారి వెళ్ళి రావటానికి వసూలు చేస్తున్న రుసుమును రూ.90ల నుంచి రూ.95లకు పెంచారు. పలుమార్లు వెళ్ళి రావటానికి వసూలు చేస్తున్న రుసుమును రూ.130 నుండి రూ.145కు పెంచారు. నెలసరిఛార్జిని రూ.2600ల నుంచి రూ.2870కి పెంచారు.

తేలికబరువు కలిగిన వాహనాలు ఓసారి వెళ్ళి రావడానికి వసూలు చేస్తున్న రుసుము రూ.155 నుంచి రూ.165కి పెంచారు. పలుమార్లు వెళ్ళి రావటానికి రూ.230 నుంచి రూ.250కు పెంచారు. నెలసరి ఛార్జిని రూ.4520ల నుంచి రూ.5020లకు పెంచారు. ఇదే విధంగా భారీ వాహనాలు వెళ్ళి రావడానికి రూ.300 నుంచి రూ.335కు, పలుమార్లు వెళ్ళి రావడానికి రూ.480 నుంచి రూ.500కు, నెలసరి ఛార్జిని రూ.9640 నుండి రూ.10,040కు పెంచారు. ప్రస్తుతం డీజిల్‌, పెట్రోలు, విడిపరికరాల ధరలు పెరిగిన పరిస్థితుల్లో టోల్‌గేట్‌ చార్జీల పెంపువల్ల మరింతగా నష్టపోతామని లారీ యజమానుల సమ్మేళనం రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ధన్‌రాజ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కొన్నేళ్లకు ముంది సుమారు ఆరు లక్షల లారీలు నడుస్తుండేవని, డీజిల్‌, బీమా, ఆన్‌లైన్‌ జరిమానా తదితర కారణాల వల్ల ప్రస్తుతం 4.5 లక్షల లారీలు మాత్రమే నడుస్తున్నాయని చెప్పారు. ఈ పరిస్థితులలో లారీల అద్దెను పెంచడం మినహా మరో మార్గం లేదని ఆయన అన్నారు.

Updated Date - 2023-09-01T10:30:05+05:30 IST