Picture of Democracy: ఫోటో చూపించి ఇదేనా ప్రజాస్వామ్యమని ప్రశ్నించిన సీఎం

ABN , First Publish Date - 2023-03-15T17:25:19+05:30 IST

భారతదేశ ప్రజాస్వామ్యంపై విదేశాల్లో మాట్లాడటంపై రంకెలు వేస్తున్న బీజేపీ ప్రభుత్వం భావప్రకటనా స్వేచ్ఛకు స్వదేశంలో ఇస్తున్న..

Picture of Democracy: ఫోటో చూపించి ఇదేనా ప్రజాస్వామ్యమని ప్రశ్నించిన సీఎం

సంభాల్: భారతదేశ ప్రజాస్వామ్యంపై విదేశాల్లో మాట్లాడటంపై రంకెలు వేస్తున్న బీజేపీ ప్రభుత్వం భావప్రకటనా స్వేచ్ఛకు స్వదేశంలో ఇస్తున్న గౌరవం ఏపాటిదో చూడండంటూ సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఒక ఫోటోను, వీడియోను విడుదల చేశారు. ఉత్తరప్రదేశ్ సెకండరీ ఎడ్యుకేషన్ మంత్రి గులాబ్‌ దేవిని అభివృద్ధి పనులపై ఈనెల 12న ప్రశ్నించిన ఒక జర్నలిస్టును అరెస్టు చేశారని, ఇదేనా ప్రజాస్వామ్యమని ఆయన తన ట్వీట్‌లో ప్రశ్నించారు.

''భారత ప్రజాస్వామ్యంపై విదేశాల్లో మాట్లాడినందుకు నానా హంగామా చేస్తున్న బీజేపీ...యూపీలోని సంభాల్‌లో జర్నలిస్ట్ పరిస్థితిపై కూడా దృష్టి సారిస్తే బాగుంటుంది. బీజేపీ మంత్రిని అభివృద్ధి పనులపై నిలదీసినందుకు అతన్ని అరెస్టు చేశారు. బీజేపీ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం, భావప్రకటనా స్వేచ్ఛ ముఖచిత్రం ఇది. ఇది అప్రకటిత ఎమర్జెన్సీ, బీజేపీ ప్రభుత్వ నియంతృత్వం కాకపోతే ఏమిటి?'' అని అఖిలేష్ ప్రశ్నించారు. సమాజ్‌వాదీ పార్టీ అఫిషియల్ ట్విట్టర్‌లో దీన్ని ట్వీట్ చేశారు.

కాగా, మంత్రిని జర్నలిస్టు ప్రశ్నించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. అందులో జర్నలిస్టు రానా.. మంత్రి గులాబ్ దేవి ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన అభివృద్ధి పనులపై ప్రశ్నించారు. ఇది మంత్రికి ఆగ్రహం తెప్పించింది. గులాబ్ దేవి గెస్ట్‌గా పాల్గొన్న కార్యక్రమంలో అనుచితంగా ప్రవర్తించాడనే ఆరోపణపై రానాను పోలీసులు అరెస్టు చేశారు. అయితే, ఆ తరువాత బెయిలుపై అతను విడుదలయ్యాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో చూసిన పలువురు మంత్రిపై విమర్శలు గుప్పించారు. మంత్రిని నిలదీసిన రానాపై ప్రశంసలు కురిపించారు. భారత ప్రజాస్వామ్యాన్ని లండన్‌లో జరిగిన కార్యక్రమంలో రాహుల్ గాంధీ పరిహసించారంటూ పార్లమెంటులో అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్యుద్ధం జరుగుతున్న తరుణంలో యూపీలో ఘటన వెలుగుచూడటం ప్రాధాన్యం సంతరించుకుంది.

Updated Date - 2023-03-15T17:25:27+05:30 IST