Supriya Sahu: చెట్లు నరికితే ఏడాది జైలుకే..
ABN , First Publish Date - 2023-08-24T10:40:07+05:30 IST
చెట్లు నరికితే ఏడాది జైలుశిక్షతో పాటు రూ.1,000 జరిమానా విధించనున్నట్లు రాష్ట్ర అటవీ శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి
- అటవీశాఖ అదనపు ప్రధాన కార్యదర్శి సుప్రియ సాహు
పెరంబూర్(చెన్నై): చెట్లు నరికితే ఏడాది జైలుశిక్షతో పాటు రూ.1,000 జరిమానా విధించనున్నట్లు రాష్ట్ర అటవీ శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి సుప్రియ సాహు(Supriya Sahu) ప్రకటించారు. సచివాలయ ప్రాంగణంలో ఉన్న అటవీశాఖ ప్రధాన కార్యాలయంలో బుధవారం సుప్రియ సాహు మీడియాతో మాట్లాడుతూ... పర్యావరణానికి మేలు కలిగించే చెట్లను అనుమతి లేకుండా నరకడం క్షమించరాని నేరమని, ఈ చర్యలకు పాల్పడే వారికి ఏడాది జైలుశిక్షతో పాటు రూ.1,000 జరిమానా విధించే కొత్త చట్టాన్ని రాష్ట్రప్రభుత్వం త్వరలోనే అమలుపరచనుందని తెలిపారు. అదే విధంగా సురక్షిత ప్రాంతాలుగా ప్రకటించిన అటవీప్రాంతాల్లో హద్దులు దాటి చొరబడడం, కలప అక్రమంగా తరలించడం వంటి చర్యలకు పాల్పడే వారిపై కూడా చట్టపరమైన చర్యలుంటాయని హెచ్చరించారు. 2030వ సంవత్సరంలోపు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 260 కోట్ల మొక్కలు నాటే పథకాన్ని కూడా ప్రభుత్వం అమలు చేస్తోందని, ఇప్పటివరకు అటవీశాఖ ఆధ్వర్యంలో సుమారు 7 కోట్లకు పైగా మొక్కలు నాటినట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,917 నర్సరీలు ఉన్నాయని, మరో 100 గ్రామాల్లో హరిత కేంద్రాలు, చెరువులు, నదులు ప్రవహిస్తున్న ప్రాంతాల్లో చెట్లు, పూలతోటలు పెంచుతున్నట్లు సుప్రియ సాహు తెలిపారు.