Supreme Court: ఆర్టికల్ 370పై మరికాసేపట్లో తీర్పు.. ఉత్కంఠతో ఎదురు చూస్తున్న ప్రజలు..
ABN , First Publish Date - 2023-12-11T09:40:51+05:30 IST
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ 370 రద్దుపై సోమవారం సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది. తీర్పు నేపథ్యంలో కాశ్మీర్ అంతటా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అయితే తీర్పును రాజకీయం చేయవద్దంటూ బీజేపీ వినతి చేసింది. శాంతిభద్రతలకు విఘాతం కలిగించబోమని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా స్పష్టం చేశారు.
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ 370 రద్దుపై సోమవారం సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది. తీర్పు నేపథ్యంలో కాశ్మీర్ అంతటా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అయితే తీర్పును రాజకీయం చేయవద్దంటూ బీజేపీ వినతి చేసింది. శాంతిభద్రతలకు విఘాతం కలిగించబోమని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా స్పష్టం చేశారు. ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ జమ్ము-కాశ్మీర్ పార్టీలు కూటమిగా ఏర్పడి.. గుప్కార్ అలయన్స్ పేరుతో సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. పిటిషన్లపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలో జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్‌తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ ఏడాది ఆగస్ట్ 2 నుంచి న్యాయస్థానం సుదీర్ఘంగా విచారణ జరిపింది. కాగా 2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370 రద్దు చేస్తూ పార్లమెంట్ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని పలు జమ్ము-కాశ్మీర్ రాజకీయ పార్టీలు వ్యతిరేకించాయి.
పూర్తి వివరాలు..
జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ 370ని కేంద్రప్రభుత్వం రద్దు చేయటం రాజ్యాంగబద్ధమేనా అన్నదానిపై సుప్రీంకోర్టు సోమవారం తీర్పును వెలువరించనుంది. ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ నేతృత్వంలో జస్టి్‌సలు సంజయ్ కిషన్ కౌల్, సంజీవ్ ఖన్నా, బీఆర్ గవాయ్, సూర్యకాంత్‌లతో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇవ్వనున్న తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ పలువురు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఆగస్టు 2వ తేదీన విచారణను ప్రారంభించింది. 16 రోజులపాటు విచారణ జరిపిన ధర్మాసనం సెప్టెంబర్ 5వ తేదీన తన తీర్పును రిజర్వులో పెడుతున్నట్లు ప్రకటించింది. విచారణ సందర్భంగా కేంద్రంతోపాటు ఆర్టికల్ 370 రద్దు అనుకూల పక్షాల తరఫున, వ్యతిరేక పక్షాల తరఫున పలువురు సీనియర్ న్యాయవాదులు వాదనలు వినిపించారు. జమ్ముకశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన జమ్ము కశ్మీర్ పునర్‌వ్యవస్థీకరణ చట్టాన్ని కూడా పలువురు పిటిషనర్లు వ్యతిరేకించారు. కాగా, సుప్రీంకోర్టు తీర్పు వెలువడనున్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జమ్ముకశ్మీర్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
రాజ్యాంగ వ్యతిరేకం: ముఫ్తీ
సుప్రీంకోర్టు తీర్పు జమ్ముకశ్మీర్ ప్రజలకు అనుకూలంగా ఉంటుందని ఆశిస్తున్నట్లు నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా చెప్పారు. ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగవ్యతిరేక చర్య మాత్రమేగాక జమ్ముకశ్మీర్ ప్రజలకు ఇచ్చిన హామీల ఉల్లంఘన కూడా అని, సుప్రీంకోర్టు తీర్పు దీనినే స్పష్టం చేస్తుందని భావిస్తున్నానని పీడీపీ అధ్యక్షురాలు ముఫ్తీ పేర్కొన్నారు. బీజేపీ ఎజెండాను సుప్రీంకోర్టు ముందుకు తీసుకెళ్లకూడదని, దేశ సమగ్రతను కాపాడాలన్నారు. డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ అధినేత గులాం నబీ ఆజాద్.. ఆర్టికల్ 370తో జమ్ముకశ్మీర్ ప్రజలు భావోద్వేగపూరిత సంబంధాన్ని కలిగి ఉన్నారని, దానిని పునరుద్ధరించాలని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పును అందరూ గౌరవించాల్సిందేనని బీజేపీ జమ్ముకశ్మీర్ అధ్యక్షుడు రవీందర్ రైనా చెప్పారు.