Suburban trains: సబర్బన్ రైళ్ల పరిధి విస్తరణ
ABN , First Publish Date - 2023-07-26T13:03:51+05:30 IST
రాజధాని బెంగళూరు(Bangalore)లో ట్రాఫిక్ ఒత్తిడిని నివారించే దిశలో చేపట్టిన సబ్ అర్బన్ రైలు ప్రాజెక్టు(Sub Urban Rail Project)ను మరింతగా
- రైల్వే శాఖకు రాష్ట్ర ప్రభుత్వం వినతి
- ట్రాఫిక్ నియంత్రణకు కసరత్తు
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): రాజధాని బెంగళూరు(Bangalore)లో ట్రాఫిక్ ఒత్తిడిని నివారించే దిశలో చేపట్టిన సబ్ అర్బన్ రైలు ప్రాజెక్టు(Sub Urban Rail Project)ను మరింతగా విస్తరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. బెంగళూరు - మైసూరు ఎక్స్‌ప్రెస్ హైవేతో ఇప్పటికే ఐటీ రాజధాని, సాంస్కృతిక రాజధాని మధ్య దూరం బాగా తగ్గడంతో ఇటువైపు సబ్ అర్బన్ రైళ్లు నడపాలని తీర్మానించింది. దీంతోపాటు చిక్కబళ్లాపుర, కోలారు, తుమకూరు, రామనగర జిల్లాల్లోని అనేక ప్రాంతాలను సబ్ అర్బన్ రైలు ప్రాజెక్టు పరిధిలోకి తీసుకురావాలని భావిస్తోంది. ఈ ప్రాంతాల్లో సబ్ అర్బన్ రైళ్లు నడిపేందుకుగల అవకాశాలు, సాధ్యాసాధ్యాలపై పరిశీలన జరిపి నైరుతి రైల్వేజోన్‌కు అనుమతులు మంజూరు చేయాలని మౌలిక సదుపాయాలశాఖ మంత్రి ఎంబీ పాటిల్(Minister MB Patil) సోమవారం ఒక లేఖ రాశారు. సబ్ అర్బన్ రైల్వే ప్రాజెక్టు ప్రగతిసమీక్ష కోసం కర్ణాటక రైల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలె్‌పమెంట్ కంపెనీ (కే రైడ్) ఉన్నతాధికారులతో ఆయన సమావేశం అయ్యారు. తొలిదశలో సబ్ అర్బన్ రైలును 148.17 కిలోమీటర్ల నడపాలని నిర్ణయించిన సంగతి తెలిసింది. జూన్ 6న జరిగిన సభలో మరిన్ని ప్రాంతాలకు విస్తరించాలని కే-రైడ్‌కు ప్రతిపాదనలు వచ్చాయి.
ఈ ప్రతిపాదనల ఆధారంగానే నైరుతి రైల్వేజోన్‌కు తాజాగా పలు సూచనలతో లేఖ రాసింది. ఒకటోదశ పనులు నిరాటంకంగా కొనసాగిస్తూనే రెండోదశలో 452 కిలోమీటర్ల విస్తరణ కార్యకలాపాలను కూడా చేపడితే బాగుంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే నగరంలో ట్రాఫిక్ ఎద్దడి తీవ్రంగా ఉందని, చిన్నచిన్న ర్యాలీలు, కొద్దిపాటి వర్షానికే అనేక కీలకమైన ప్రాంతాల్లో గంటల తరబడి ట్రాఫిక్ స్తంభిస్తోందని అధికారులు అంటున్నారు. మెట్రో రైలు ప్రాజెక్టుతో కొంతమేర నియంత్రణలోకి వచ్చినా పూర్తిగా సాధ్యపడలేదని, సబ్ అర్బన్ రైళ్లతో సమస్య కొలిక్కి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. బెంగళూరు సిటీ రైల్వేస్టేషన్ నుంచి దేవనహళ్లి వరకు 41.4 కిలోమీటర్ల మేర, బయ్యప్పనహళ్లి నుంచి చిక్కబాణావర వరకు 25.01 కి.మీ., కెంగేరి నుంచి వైట్‌ఫీల్డ్‌కు 35.32 కి.మీ., ఈలలిగ నుంచి రాజానుకుంటె వరకు 46.25 కి.మీ. మేర తొలిదశలో మొత్తం 148 కిలో మీటర్ల మేర సబ్ అర్బన్ రైళ్ల మార్గం చేపట్టదలిచారు.
ప్రభుత్వం తాజాగా ప్రతిపాదించిన రెండోదశ మార్గంలో దేవనహళ్లి నుంచి కోలారు వరకు 107 కి.మీ., చిక్కబాణవార నుంచి డాబ్‌సపేట మీదుగా తుమకూరు వరకు 55 కి.మీ., చిక్కబాణవార నుంచి మాగడివైపు 45 కి.మీ., కెంగేరి నుంచి మైసూరుకు 125 కి.మీ., వైట్‌ఫీల్డ్ నుంచి బంగారపేట వరకు 45 కి.మీ., ఈళలిగ నుంచి తమిళనాడులోని హోసూరు(Hosur)కు 23 కి.మీ., రాజానుకుంటె నుంచి దొడ్డబళ్లాపుర మీదుగా గౌరిబిదనూరు వరకు 52 కిలోమీటర్ల మేర సబ్ అర్బన్ రైళ్లను విస్తరించాలని ప్రభుత్వానికి ఉందని మంత్రి ఎంబీ పాటిల్ వెల్లడించారు. తొలిదశ, రెండోదశ ప్రాజెక్టులకు సంబంధించి భూస్వాధీన ప్రక్రియకు అభ్యంతరాలు లేవన్నారు. రెండోదశ పరిధిలోకి వచ్చే అనేక ప్రాంతాల్లో ఇప్పటికే రైలు మార్గాలు ఉన్నకారణంగా వాటికి అనుబంధంగా మరికొన్ని మార్గాలు నిర్మిస్తే సరిపోతుందని దరిమిలా ప్రభుత్వంపై అదనపు భారం ఉండదన్నారు. తొలి రెండు దశల్లోనూ విజయవంతంగా పూర్తి చేసేదిశలో ప్రభుత్వం అత్యంత ఉత్సాహంగా ఉందని మంత్రి వెల్లడించారు.