Kolhapur : కొల్హాపూర్‌లో హింసాకాండ.. కాల్చిపారేయాలంటున్న శివసేన యూబీటీ నేత..

ABN , First Publish Date - 2023-06-09T16:04:33+05:30 IST

మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో హింసాకాండ నేపథ్యంలో శివసేన (యూబీటీ) నేత, ఎంపీ సంజయ్ రౌత్సం చలన వ్యాఖ్యలు చేశారు.

Kolhapur : కొల్హాపూర్‌లో హింసాకాండ.. కాల్చిపారేయాలంటున్న శివసేన యూబీటీ నేత..

ముంబై : మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో హింసాకాండ నేపథ్యంలో శివసేన (యూబీటీ) (Shiv Sena (UBT) నేత, ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay Raut) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తర ప్రదేశ్‌లో సంఘ విద్రోహ శక్తులను మట్టుబెడుతున్నట్లుగానే మహారాష్ట్రలో కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 18వ శతాబ్దంనాటి మైసూరు పాలకుడు టిప్పు సుల్తాన్ ఫొటోతోపాటు అభ్యంతరకరమైన ఆడియో మెసేజ్‌ను సామాజిక మాధ్యమాల స్టేటస్‌గా కొందరు వ్యక్తులు పెట్టుకోవడంతో కొల్హాపూర్‌లో ఘర్షణలు జరిగిన సంగతి తెలిసిందే.

టిప్పు సుల్తాన్ ఫొటోను ఉపయోగించడాన్ని నిరసిస్తూ బుధవారం శివాజీ చౌక్ వద్ద వందలాది మంది ప్రదర్శన నిర్వహించారు. వీరిపై పోలీసులు విరుచుకుపడి, లాఠీలతో కొడుతూ, చెదరగొట్టారు. బుధవారం మధ్యాహ్నానికి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. డిస్ట్రిక్ట్ గార్డియన్ మినిస్టర్ దీపక్ కేసర్కార్ శాంతి కమిటీతో సమావేశాన్ని నిర్వహించారు.

సంజయ్ రౌత్ శుక్రవారం మాట్లాడుతూ, మొఘలు చక్రవర్తి ఔరంగజేబు ఫొటోను పెట్టినంత మాత్రానికి బీజేపీ హిందుత్వానికి ఎందుకు ప్రమాదం వచ్చిందని నిలదీశారు. గడచిన పదేళ్లలో పోలరైజేషన్ రాజకీయాలు పెరిగిపోయాయన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రమాదంలో ఉందన్నారు. నేటి రాష్ట్ర పరిస్థితిని చూడాలని కోరారు. సంఘ విద్రోహ శక్తులను ఉత్తర ప్రదేశ్‌లో మాదిరిగా మట్టుబెట్టాలన్నారు.

సంజయ్ రౌత్‌కు బెదిరింపులు

సంజయ్ రౌత్‌కు గురువారం బెదిరింపులు వచ్చినట్లు ఆయన సోదరుడు సునీల్ రౌత్ చెప్పారు. గురువారం సాయంత్రం 4.30 గంటలకు ఓ వ్యక్తి తనకు ఫోన్ చేసి, ‘‘మీ సోదరుడు సంజయ్ విలేకర్ల సమావేశాల్లో మాట్లాడకూడదు, లేదంటే అతన్ని కాల్చి చంపుతాం’’ అని హెచ్చరించినట్లు తెలిపారు. సంజయ్ అంటే ప్రభుత్వం భయపడుతోందన్నారు. అందుకే ఆయన మాట్లాడకూడదని ప్రభుత్వం కోరుకుంటోందన్నారు. గతంలో కూడా ఇటువంటి ఫోన్ కాల్స్ వచ్చాయని, ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని అన్నారు.

కొల్హాపూర్‌లో కొందరు వ్యక్తులు, బాలలు తమ వాట్సాప్ స్టేటస్‌లుగా టిప్పు సుల్తాన్ ఫొటోను, అభ్యంతరకరమైన ఆడియో మెసేజ్‌ను పెట్టారు. దీనిని వ్యతిరేకిస్తూ కొందరు జూన్ 7న నిరసన వ్యక్తం చేశారు. దీంతో హింసాత్మక ఘర్షణలు జరిగాయి. పోలీసులు లాఠీఛార్జి చేసి, వందలాది మందిని చెదరగొట్టారు. 36 మందిని అరెస్ట్ చేసి, కేసులు నమోదు చేశారు. అభ్యంతరకరమైన పోస్టులు పెట్టినందుకు మరో ఐదు కేసులు నమోదు చేశారు.

మంత్రి కేసర్కార్ స్పందిస్తూ, పండుగలను ప్రశాంతంగా జరుపుకోవడానికి వీలుగా అన్ని మతాలవారితో శాంతి కమిటీలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

ఇవి కూడా చదవండి :

America : డొనాల్డ్ ట్రంప్‌పై ఏడు ఆరోపణలతో కేసు నమోదు

Nirmala Sitharaman : కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ కుమార్తె వివాహం అత్యంత నిరాడంబరంగా!

Updated Date - 2023-06-09T16:04:33+05:30 IST