Share News

Shashi Tharoor: మరీ ఇంత దిగజారుడు రాజకీయాలా.. బీజేపీ చెంప ఛెళ్లుమనేలా శశిథరూర్ కౌంటర్

ABN , First Publish Date - 2023-10-23T20:14:25+05:30 IST

రాజకీయాల్లో విమర్శ ప్రతివిమర్శలు, ఆరోపణలు ప్రత్యారోపణలు సర్వసాధారణం. కానీ.. ప్రత్యర్థుల్ని దెబ్బ కొట్టాలన్న ఉద్దేశంతో కొందరు వ్యక్తిగత దూషణలకు కూడా దిగుతున్నారు. ప్రజల్లో అభాసుపాలు చేయడానికి...

Shashi Tharoor: మరీ ఇంత దిగజారుడు రాజకీయాలా.. బీజేపీ చెంప ఛెళ్లుమనేలా శశిథరూర్ కౌంటర్

రాజకీయాల్లో విమర్శ ప్రతివిమర్శలు, ఆరోపణలు ప్రత్యారోపణలు సర్వసాధారణం. కానీ.. ప్రత్యర్థుల్ని దెబ్బ కొట్టాలన్న ఉద్దేశంతో కొందరు వ్యక్తిగత దూషణలకు కూడా దిగుతున్నారు. ప్రజల్లో అభాసుపాలు చేయడానికి, మానసికంగా కుంగదీయడానికి దిగజారుడు పనులకు పాల్పడుతున్నారు. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా వ్యవహారంలోనూ అలాంటి చెత్త రాజకీయాలు వెలుగు చూస్తున్నాయి. ఆమెపై ‘ప్రశ్నకు డబ్బు’ ఆరోపణలు చేసిన బీజేపీ.. తాజాగా వ్యక్తిగతంగానూ టార్గెట్ చేసింది. తన ప్రశ్నలు, ప్రసంగాలతో తమని ఇరకాటంలో పడేస్తుండటంతో.. ఆమెని దారి నుంచి తప్పించేందుకు బీజేపీ ఆమెపై లేనిపోని నిందారోపణలకు పాల్పడుతోంది.

ఇందులో భాగంగానే ఇటీవల కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌తో మోయిత్రా కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఆ ఫోటోల్లో వాళ్లిద్దరూ కాస్త సన్నిహితంగా ఉండటం, కలిసి డ్రింక్ చేయడాన్ని మనం గమనించవచ్చు. ఈ ఫోటోలను చూస్తే.. ఎవరైనా ఆ ఇద్దరి మధ్య ఏదో ప్రైవేట్ మీటింగ్ జరిగిందని, ఏవేవో పప్పులు ఉడుకుతున్నాయని తప్పకుండా అనుకుంటారు. కానీ.. నిజానికి అసలు విషయం అది కాదు. మోయిత్రా పుట్టినరోజు సందర్భంగా.. శిశథరూర్ ఆమెతో కలిసి దిగిన ఫోటోలు అవి. ఆ పార్టీకి కేవలం శశిథరూర్ ఒక్కరే కాదు.. ఆయన సోదరితో పాటు ఇంకా చాలామంది హాజరు అయ్యారు. కానీ.. ప్రశ్నకు డబ్బు వ్యవహారం నడుస్తున్న నేపథ్యంలో మోయిత్రా ఇమేజ్‌ని దెబ్బతీయాలన్న ఉద్దేశంతో కేవలం శశిథరూర్, మోయిత్రా కలిసి ఉన్న ఫోటోలని కట్ చేసి వైరల్ చేశారు. దీంతో.. శశిథరూర్ తీవ్రంగా మండిపడ్డారు. మరీ ఇంత దిగజారుడు రాజకీయాలా అంటూ బీజేపీ చెంప ఛెళ్లుమనేలా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.


శశిథరూర్ మాట్లాడుతూ.. ‘‘ఆ ఫోటోలు మోయిత్రా పుట్టినరోజు దిగినవి. నా కంటికి మోయిత్రా చిన్నపిల్లలాగా కనిపిస్తుంది. అఫ్‌కోర్స్ ఆమె చిన్నపిల్ల కాదు కానీ, నాకు తను చిన్నపిల్లే. మోయిత్రా నాకన్నా 10-20 ఏళ్లు చిన్నది. ఆ పార్టీలో నాతో పాటు మరో 15 మంది కూడా ఉన్నారు. నా సోదరిని కూడా ఆహ్వానించగా, తనూ వచ్చింది. కానీ.. కొందరు దురుద్దేశపూర్వకంగా పార్టీకి వచ్చిన మిగతావారిని ఫోటోలో నుంచి తొలగించి, నాకూ-మోయిత్రా మధ్య వ్యక్తిగత మీటింగ్ జరిగిన భావన కలిగేలా ఫోటోలను వక్రీకరించారు. ఒకవేళ అది రహస్య సమావేశమే అయితే, మరి ఆ ఫోటోలను ఎవరు తీసుకుంటారు?’’ అని చెప్పుకొచ్చారు. అయినా నెట్టింట్లో తనపై వచ్చే ట్రోల్స్‌ని తాను ఏమాత్రం పట్టించుకోనని, ఈరోజుల్లో మీడియా ఆ ట్రోల్స్‌కి ఇస్తున్న ప్రాధాన్యతని కూడా తాను ఇవ్వనని తేల్చి చెప్పారు. ప్రజల కోసం పని చేయడానికే తాను ప్రాముఖ్యత ఇస్తానని పేర్కొన్నారు.

అంతకుముందు మహువా మోయిత్రా సైతం ఈ ఫోటోలపై స్పందించారు. ‘బీజేపీ ట్రోల్ సేన’ ఒక స్టింగ్ పోస్టులో తన వ్యక్తిగత ఫోటోలను వైరల్ చేస్తోందని ఆరోపించారు. అనంతరం ఆ ఫోటోల్లోని తన దుస్తుల గురించి మాట్లాడుతూ.. తనకు తెల్లటి బ్లౌజ్ కన్నా పచ్చని రంగులో ఉన్న దుస్తులే బాగా నచ్చాయని పేర్కొన్నారు. అయినా.. ఈ ఫోటోలో మిగతా వారిని ఎందుకు తొలగించారు? రాత్రి డిన్నర్‌కి వచ్చిన వారిని కూడా చూపించాల్సిందని సెటైర్లు వేశారు. బెంగాల్ మహిళలు పూర్తి జీవితాన్ని ఆస్వాదిస్తారని, అందులో ఏమాత్రం సందేహం లేదంటూ.. తన ప్రత్యర్థులకు మోయిత్రా చురకలంటించారు.

Updated Date - 2023-10-23T20:14:25+05:30 IST