Shashi Tharoor: ఇండియాలో అంతా చేసేదే నేనూ చేశా.. ముషారఫ్‌ను ప్రశంసించడంపై శిశథరూర్

ABN , First Publish Date - 2023-02-06T11:56:34+05:30 IST

అనారోగ్య కారణాలతో కన్నుమూసిన పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌ను శాంతిశక్తిగా తాను పేర్కొనడానికి కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ..

Shashi Tharoor: ఇండియాలో అంతా చేసేదే నేనూ చేశా.. ముషారఫ్‌ను ప్రశంసించడంపై శిశథరూర్

న్యూఢిల్లీ: అనారోగ్య కారణాలతో కన్నుమూసిన పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ (Parvej Musharraf)ను శాంతిశక్తిగా తాను పేర్కొనడానికి కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ (Shashi Tharoor) సమర్ధించుకున్నారు. శశథరూర్ ట్వీట్‌పై బీజేపీతో పాటు సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమైన నేపథ్యంలో సోమవారంనాడు ఆయన వివరణ ఇచ్చారు. చనిపోయిన వ్యక్తి గురించి మంచిమాటలే చెప్పే ఇండియాలో తాను పెరిగానని చెప్పారు.

తొలుత శశిథరూర్ తన ట్వీట్‌లో ''పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ అరుదైన అనారోగ్యంతో మరణించారు. ఒకప్పుడు భారతదేశానికి బద్ధ శత్రువు అయిన ముషారఫ్ 2002-2007లో శాంతి కోసం నిజమైన శక్తిగా మారాడు'' అని ప్రశంసించారు. ఆరోజుల్లో ఆయనను ఏటా కలిసేవాడినని, ఆయనలో వ్యూహాత్మక ఆలోచన కనిపించేదని చెప్పారు. దీనిపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. సంతాపం తెలిపే ముసుగులో అతిగా పొడిగారని, కార్గిల్ యుద్ధం ముషారఫ్ వల్లే జరిగిందని నెటిజన్లు గుర్తు చేశారు. లాడెన్, తాలిబన్‌లను ప్రశంసించిన పర్వేజ్ ముషారఫ్... రాహుల్‌ గాంధీని పెద్ద మనిషి అంటూ ప్రశంసించారనీ, శశిథరూర్ పొగడ్త కూడా ఆ కోవలేనిదేనని బీజేపీ తప్పుపట్టింది.

మంచి మాటలు మాట్లాడే ఇండియాలోనే...

కాగా, శశిథూరూర్ సోమవారంనాడు తన వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ, చనిపోయిన వారి గురించి రెండు మంచి మాటలు చెప్పడం ఇండియాలో ఆనవాయితీ అని, తాను ఇండియాలోనే పెరిగానని చెప్పారు. ముషారఫ్ బద్ధ శత్రువే కావచ్చు, కార్గిల్ యుద్ధానికి బాధ్యుడే కావచ్చు, కానీ ఆయన ఐచ్ఛికంగా 2002 నుంచి 2007 వరకూ ఇండియాతో శాంతి కోసం ప్రయత్నాలు చేశారని అన్నారు. ''ఆయన మిత్రుడు కాదు. శాంతి వల్ల వ్యూహాత్మక ప్రయోజనాలు ఉంటాయి. మనం చేస్తున్న ప్రయత్నాలు కూడా అవే'' అని శశిథరూర్ తన తాజా ట్వీట్‌లో పేర్కొన్నారు.

Updated Date - 2023-02-06T11:57:13+05:30 IST