Shankar Jeewal: ట్రాఫిక్‌ ఉల్లంఘనులపై డేగకన్ను

ABN , First Publish Date - 2023-06-01T07:45:16+05:30 IST

గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌(Greater Chennai Corporation) పరిధిలో ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించే వారిపై పోలీసులు ఉక్కుపాదం మోప

Shankar Jeewal: ట్రాఫిక్‌ ఉల్లంఘనులపై డేగకన్ను

- పోలీసులకు రాడార్‌ వాహనాలు

అడయార్‌(చెన్నై): గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌(Greater Chennai Corporation) పరిధిలో ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించే వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపనున్నారు. ఇందుకోసం అత్యాధునిక టెక్నాలజీతో పనిచేసే రాడార్‌(Radar) వ్యవస్థ కలిగిన వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. వీటి ద్వారా ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించే వారిని గుర్తించి అపరాధం వసూలు చేయనున్నారు. ఈ వాహనాలను నగర పోలీస్‌ కమిషనర్‌ శంకర్‌ జీవాల్‌(Shankar Jeewal) బుధవారం నగర ట్రాఫిక్‌ విభాగం పోలీసులకు అప్పగించారు. అదేవిధంగా ఇతర యంత్ర పరికరాలను కూడా ఆయన అందజేశారు. పోలీసులకు కొత్తగా అప్పగించిన పెట్రోలింగ్‌ వాహనాల్లో 360 డిగ్రీ కోణంలో తిరిగే అత్యాధునిక కెమెరాలను అమర్చారు. వీటి ద్వారా, హెల్మెట్‌ ధరించకుండా వాహనం నడపడం, మొబైల్‌ ఫోన్‌(Mobile phone)లో మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేయడం, అమితవేగంగా వాహనాలు నడిపే వాహనదారులను గుర్తించి ఫొటో తీసేందుకు వీలుగా ఈ వాహనాల్లో 2డీ రాడార్‌ వ్యవస్థను అమర్చారు. ఈ టెక్నాలజీ ద్వారా ఫొటో తీసిన తర్వాత దాన్ని పోలీస్‌ కంట్రోల్‌ రూంకు చేరవేస్తుంది. అక్కడ నుంచి వాహనదారుడి మొబైల్‌ నెంబరుకు ట్రాఫిక్‌ నిబంధన ఉల్లంఘనకు సంబంధించి మెసేజ్‌తో పాటు చెల్లించాల్సిన అపరాధ రుసుం ఉంటుంది. అలాగే, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌(Drunk and drive) పరీక్షలు చేసేందుకు ప్రస్తుతం 350 బ్రీత్‌ అనలైజర్‌ యంత్రాలను ఉపయోగిస్తున్నారు. వీటికి అదనంగా మరో 50 యంత్ర పరికరాలను కమిషనర్‌ ట్రాఫిక్‌ పోలీసులకు అందజేశారు. ఈ కొత్త బ్రీత్‌ అనలైజర్‌లో సిమ్‌ అమర్చడం వల్ల మద్యం తనిఖీలకు సంబంధించిన వివరాలు తక్షణమే కంట్రోల్‌ రూం సర్వర్‌కు చేరుతాయి. అదేవిధంగా వేళచ్చేరి - విజయనగరం జంక్షన్‌ రోడ్డులో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేలా కొత్త ప్రచార బోర్డును కూడా అమర్చారు. దీన్ని కూడా పోలీసులకు కమిషనర్‌ అందజేశారు. వీటితో పాటు ట్రాఫిక్‌ పోలీసులకు ఉపయోగపడే అనేక రకాలైన వస్తు సామగ్రిని ఆయన అప్పగించారు.

Updated Date - 2023-06-01T07:46:56+05:30 IST