Anti India Gang: జడ్జీలను బెదరించడమేనా ప్రజాస్వామ్యం?: రిజిజుపై రౌత్ ఫైర్

ABN , First Publish Date - 2023-03-19T16:45:14+05:30 IST

కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు కొంతమంది రిటైర్జ్ జడ్జిలపై చేసిన వ్యాఖ్యలపై..

Anti India Gang: జడ్జీలను బెదరించడమేనా ప్రజాస్వామ్యం?: రిజిజుపై రౌత్ ఫైర్

ముంబై: కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు (Kiran Rijiju) కొంతమంది రిటైర్జ్ జడ్జిలపై చేసిన వ్యాఖ్యలపై శివసేన ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే (UBT) నేత సంజయ్ రౌత్ (Sanjay Raut) ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు రిటైర్డ్ జడ్జీలు ఇండియా వ్యతిరేక గ్యాంగు(Anti India Gang)లో భాగమంటూ కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఇది న్యాయమూర్తులను బెదిరించేందుకు, న్యాయవ్యవస్థపై ఒత్తిడి తెచ్చేందుకు ఉద్దేశించిన ప్రయత్నమని తప్పుపట్టారు. ఇది నాయమంత్రికి సరికాదని, ఇదేనా ప్రజాస్వామ్యమని ప్రశ్నించారు.

కిరణ్ రిజిజు శనివారంనాడు ఢిల్లీలో జరిగిన ఇండియా టుడే కాంక్లేవ్‌లో మాట్లాడుతూ, కొందరు రిటైర్డ్ జడ్జిలు, వారి కార్యకలాపాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత న్యాయవ్యవస్థను విపక్ష పార్టీ పాత్ర వహించేలా చేసేందుకు జరుగుతున్న 'యాంటీ ఇండియా గ్యాంగ్‌'లో కొందరు రిటైర్డ్ జడ్జిలు పాలుపంచుకుంటున్నారని ఆక్షేపించారు. మంత్రి వ్యాఖ్యలపై సంజయ్ రౌత్ ఆదివారంనాడు మీడియాతో మాట్లాడుతూ..''ఇది ఏతరహా ప్రజాస్వామ్యం? న్యాయవ్యవస్థను బెదరించడం న్యాయశాఖ మంత్రికి తగిన పనేనా? ప్రభుత్వానికి తలవొగ్గని న్యాయమూర్తులకు ఇది ముప్పు. న్యాయవ్యవస్థపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం'' అని అన్నారు.

ప్రభుత్వాన్ని విమర్శించడమంటే దేశానికి వ్యతిరేకమనే అర్థం కాదని, ప్రజాస్వామ్యానికి ఎదురవుతున్న ముప్పును ప్రస్తావించిన రాహుల్‌‌ను లక్ష్యంగా చేసుకున్నారని, లోక్‌సభ నుంచి ఆయనను సస్పెండ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారని సంజయ్ రౌత్ అన్నారు. రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని మీరు అనుకుంటున్నారా అనే ప్రశ్నకు రాహుల్ క్షమాపణ చెప్పాల్సిన పని లేదని, ఎందుకు ఆయన క్షమాపణ చెప్పాలని రౌత్ ఎదురు ప్రశ్నించారు. నిజానికి బీజేపీ నేతలే విదేశీ గడ్డపై దేశానికి, రాజకీయ నేతలకు వ్యతిరేకంగా మాట్లాడారని అన్నారు.

Updated Date - 2023-03-19T16:45:14+05:30 IST