Rajamouli: సాహోరే.. జక్కన్న ఆస్కార్‌ని ఊహించా!

ABN , First Publish Date - 2023-03-14T03:52:15+05:30 IST

కలలు కనాలంటే నిద్రపోతే సరిపోతుంది. కానీ కలలు నిజం చేసుకోవాలంటే మాత్రం నిద్రని పోగొట్టుకోవాలి. త్యాగాలకు సిద్దపడాలి. ఓ మినీ యుద్ధమే చేయాలి. వీటన్నింటికీ సిద్ధపడ్డాడు

Rajamouli: సాహోరే.. జక్కన్న ఆస్కార్‌ని ఊహించా!

కలలు కనాలంటే నిద్రపోతే సరిపోతుంది. కానీ కలలు నిజం చేసుకోవాలంటే మాత్రం నిద్రని పోగొట్టుకోవాలి. త్యాగాలకు సిద్దపడాలి. ఓ మినీ యుద్ధమే చేయాలి. వీటన్నింటికీ సిద్ధపడ్డాడు కాబట్టే... రాజమౌళి దిగ్విజయ యాత్ర నిరాటంకంగా సాగుతోంది. రాజమౌళి కలలు వెండి తెరంత చిన్నవి కావు. వెండి కొండంత పెద్దవి. సినిమా సినిమాకీ ఆ కలల సైజు, ఆ ఊహల స్థాయి పెరుగుతూ ఉంటాయి తప్ప... తగ్గే ప్రసక్తి లేదు.

2Vijayendra.jpg

కథా రచయిత విజయేంద్ర ప్రసాద్‌

ఆస్కార్‌ అవార్డు గెలుచుకున్న ‘నాటు... నాటు’ కేవలం పాట కాదని, ఆ పాటే కథ అని ఆర్‌ఆర్‌ఆర్‌ కథా రచయిత, దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ అన్నారు. బ్రిటిషువాళ్ల పెత్తనాన్ని సహించబోమని చెప్పే సందర్భంలో ఫైట్‌ కాకుండా పాటను ఎంచుకున్నామని చెప్పారు. ఈ పాట ఆస్కార్‌ గెలుచుకుంటుందని ఊహించానని, అవార్డు రావడం తమ కుటుంబంలో ఈ సినిమా కోసం పనిచేసిన మూడు తరాల్లో సంతోషం నింపిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆస్కార్‌ అవార్డు వచ్చిన తర్వాత రాజమౌళితో మాట్లాడానని, ప్రసవ వేదన తర్వాత బిడ్డను చేతిలోకి తీసుకున్న తల్లిలో కనిపించే ఆనందం... అతని మాటల్లో కనిపిచిందన్నారు. ‘నాటు నాటు’ పాట కోసం కొరియోగ్రాఫర్‌ ప్రేమ్‌ రక్షిత్‌ ఎంతో కష్టపడ్డారని, వంద స్టెప్స్‌ కంపోజ్‌ చేశారని చెప్పారు. ఆయనది కూడా మేజర్‌ కాంట్రిబ్యూషన్‌ అని తెలిపారు.

‘మగధీర’... రాజమౌళితో పాటు తెలుగు చిత్రసీమనీ నాలుగు అడుగులు ముందుకు దూకించిన సినిమా ఇది. ఆ విజువల్స్‌ చూసి ‘మనం చూస్తోంది తెలుగు సినిమానా? హాలీవుడ్‌ సినిమానా?’ అని ముక్కున వేలేసుకొన్నారంతా. మగధీరుడి విన్యాసాల ముందు రికార్డులు సైతం రికార్డులు మోకరిల్లాయి. అయితే అది కేవలం ప్రారంభం మాత్రమే. ఆ తరవాత ‘బాహుబలి’తో దేశం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఆ సినిమా బడ్జెట్లూ, సాధించిన వసూళ్లు, అందులో కనిపించిన అంకెలూ చూసి విస్తుపోయింది. ఓ తెలుగు సినిమా వంద కోట్ల వసూళ్లు సాధించడమే గగనం అనుకొంటున్న తరుణంలో ఓ సినిమాకి రూ.200 కోట్లూ, రూ.300 కోట్లు ఖర్చు పెట్టడం ఏమిటి? ఓ కథని రెండు భాగాలుగా విడగొట్టి, రెండు సినిమాలుగా విడుదల చేయడం ఏమిటి? అందుకోసం ప్రభాస్‌లాంటి హీరోని నాలుగేళ్లు బ్లాక్‌ చేయడం ఏమిటి? అంటే అది.. రాజమౌళి ధైర్యం. అందరూ తెలుగు సినిమా పరిధులూ, పరిమితుల చుట్టూనే తిరుగుతుంటే, రాజమౌళి ఆ సరిహద్దులు దాటేసి ‘పాన్‌ ఇండియా’ వైపు చూశాడు. ఓ సినిమాని జనానికి చేరువ చేసే టెక్నిక్‌ తెలిస్తే చాలు.. వసూళ్లకి ఆకాశమే హద్దు.. అని నిరూపించాడు. ‘బాహుబలి’లాంటి సిరీస్‌ చేశాక... రాజమౌళి ఇంకేం చేయగలడు? ఇంకేం సాధించగలడు? ఈ మాయ నుంచి.. బయట పడాలంటే తను మరో అద్భుతం చేయకతప్పదు..’ అనుకొన్నారంతా. రాజమౌళికీ అది తెలుసు. ‘బాహుబలి’ని చూసిన కళ్లతో ఏం చూసినా చిన్నవిగానే కనిపిస్తాయి. అందుకే ఇద్దరు పెద్ద పెద్ద హీరోల్ని తీసుకొచ్చి పక్క పక్కన పెట్టాడు. దాంతో ఆ కాంబినేషనే ఆకాశమంత ఎత్తులో కనిపించింది. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, రాజమౌళి.. ఈ పేర్లు చాలు. ప్రేక్షకులు పరుగులు పెట్టుకొంటూ థియేటర్ల ముందు వాలిపోవడానికి. కథని అల్లుకోవడం దగ్గర్నుంచి, హీరోల ఎంపిక, వాళ్ల పాత్రల్ని రాసుకొనే విధానం, వారి మధ్య స్నేహం, వైరం, సంఘర్షణ.. ఇలా ప్రతీ విషయంలోనూ రాజమౌళిలోని దర్శక చాతుర్యం బయటకు వచ్చింది.

ఆస్కార్‌ కోసం మనదేశం తరపున‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ అఫీషియల్‌ ఎంట్రీగా వెళ్తుందని అంతా అనుకొన్నారు. కానీ ఆ అవకాశం దక్కలేదు. ఆస్కార్‌ దారులన్నీ మూసుకు పోయిన వేళ... ఆ బాధ్యతని సైతం తన భుజాలపై వేసుకొన్నాడు జక్కన్న. ‘బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌’తో సహా పలు విభాగాల్లో ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ని ఆస్కార్‌ బరిలో నిలబెట్టాడు. అప్పుడు కూడా... రాజమౌళి మితిమీరి ఆలోచిస్తున్నాడని, ఆకాశానికి నిచ్చెన వేస్తున్నాడని కొంతమంది ఎద్దేవా చేశారు. ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ పక్కా కమర్షియల్‌ సినిమా.. దీనికి ఆస్కార్‌ ఎందుకు వస్తుంది? అంటూ అనుమానించారు. చివరికి ‘బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌’ విభాగంలో నామినేషన్‌ దక్కించుకొని ‘నాటు నాటు’ పాట అందరినీ ఆశ్చర్యపరిచింది. ‘నాటు నాటు’కి నామినేషన్‌ దక్కడమే ఎక్కువన్నది చాలామంది మాట. ఎందుకంటే ఈ విభాగంలో ఏ భారతీయ సినిమా ఇప్పటి వరకూ పోటీలో నిలవలేదు. ఇది వరకు ‘జయహో’ (స్లమ్‌ డాగ్‌ మిలీయనీర్‌) పాటకు అవార్డు వచ్చినా అది పూర్తి స్థాయి భారతీయ చిత్రం కాదు. ఈ అనుమానాల్ని జక్కన్న లెక్క చేయలేదు. ఎప్పుడైతే ‘నాటు నాటు’ ఆఖరి మజిలీకి చేరుకొందో, అప్పటి నుంచీ.. రాజమౌళి తన వ్యూహ రచనలో వేగం పెంచాడు. ప్రపంచ సినిమా, మార్కెటింగ్‌... వీటిపై పూర్తి స్థాయి అవగాహన ఉన్న రాజమౌళి అమెరికాలో తన టీమ్‌తో సహా వాలిపోయాడు. అక్కడి ఏజెన్సీల ద్వారా... ‘నాటు నాటు’ కు ప్రచారం కల్పించడం మొదలెట్టాడు. ప్రచారం కోసం రాజమౌళి భారీగా ఖర్చు పెడుతున్నాడని, ఆ డబ్బులతో పది సినిమాలు తీయొచ్చని.. స్వదేశంలో రకరకాల వ్యాఖ్యానాలు, వాటి చుట్టూ విమర్శలూ పెరిగిపోయినా.. రాజమౌళి ఎక్కడా తన జోరు తగ్గించలేదు. మనందరికీ ఇంతటి ఉద్విగ్నభరతిమైన క్షణాలు దక్కా యంటే.. దానికి కారణం కేవలం రాజమౌళి.. తను కన్న కల మాత్రమే. వంద కోట్ల స్థాయి ఉన్న తెలుగు సినిమాని వేయి కోట్ల ‘పాన్‌ ఇండియా’ సినిమాగా మార్చిన ఘనత రాజమౌళిది. ఇప్పుడొచ్చింది ఒక్క ఆస్కార్‌ మాత్రమే. కానీ... ఎన్నో కలలకు ఈ ఒక్క ఆస్కార్‌ ఊపిరి పోయనుంది.

Updated Date - 2023-03-14T04:04:22+05:30 IST