Ram Navami clash: మమత సర్కార్‌కు హోం శాఖ హుకుం..!

ABN , First Publish Date - 2023-04-04T19:07:25+05:30 IST

శ్రీరామ నవమి శోభాయాత్ర సందర్భంగా పశ్చిమబెంగాల్‌లోని హౌరా నగరంలో గతవారం చోటుచేసుకున్న అల్లర్లు.. హింసాకాండపై

Ram Navami clash: మమత సర్కార్‌కు హోం శాఖ హుకుం..!

న్యూఢిల్లీ: శ్రీరామ నవమి శోభాయాత్ర సందర్భంగా పశ్చిమబెంగాల్‌లోని హౌరా (Howrah) నగరంలో గతవారం చోటుచేసుకున్న అల్లర్లు, హింసాకాండపై కేంద్ర హోం శాఖ (MHA) చర్యలకు దిగింది. ఈ ఘటనపై సమగ్ర నివేదిక (Detailed Report) ఇవ్వాలని పశ్చిమబెంగాల్ ప్రభుత్వాన్ని మంగళవారంనాడు కోరింది. రామనవమి ఉరేగింపులపై జరిగిన దాడులపై తక్షణం జోక్యం చేసుకోవాలంటూ పశ్చిమబెంగాల్ బీజేపీ చీఫ్ సుకాంత మజుందార్ కేంద్ర హోం మంత్రికి ఆదివారంనాడు రాసిన లేఖ రాసిన నేపథ్యంలో ఈ తాజా ఆదేశాలు వెలువడ్డాయి. కేంద్ర హోం మంత్రికి ఆయన లేఖ రావడం గత వారం రోజుల్లో ఇది రెండవది.

''హౌరా, డాల్‌ఖోలా‌లో రామనవవి శోభాయాత్రలపై దాడులకు సంబంధించి మార్చి 31న రాసిన లేఖకు ఇది కొనసాగింపు. దాడులు ఇంకా ఆగలేదు. పశ్చిమబెంగాల్‌లోని పలు ప్రాంతాల్లో దాడులు కొనసాగుతున్నాయి'' అని అమిత్‌షాకు రాసిన రెండవ లేఖలో మజుందార్ పేర్కొన్నారు. రామభక్తులతో పాటు తనపై కూడా రాళ్లదాడి జరిగిందని, తన వాహనానికి నిప్పుపెట్టారని, దహనకాండలు చేటుచేసుకున్నాయని అన్నారు. అల్లర్లు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదని, దీనిని బట్టి చూస్తే అధికార టీఎంసీకి మద్దతుతోనే ఈ ఘటనలు జరిగాయన్న ఆరోపణలకు బలం చేకూరుతోందన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల క్షీణించినందున చట్ట ప్రకారం కేంద్రం జోక్యం చేసుకోవాలని తాము కోరుతున్నట్టు పేర్కొన్నారు. తద్వారా పరిస్థితి మరింత దిగజారకుండా అదుపుచేసి, ప్రజల ఆస్తులు, ప్రాణాలు కాపాడాలని కోరారు.

కాగా, పశ్చిమబెంగాల్‌లో పరిస్థితిపై రాష్ట్ర గవర్నర్‌కు గత ఆదివారంనాడు అమిత్‌షా ఫోన్ చేశారు. పరిస్థితిని ఆరా తీశారు. గవర్నర్‌ సైతం మంగళవారంనాడు అల్లర్లు జరిగిన ప్రాంతంలో పర్యటించారు. మరోవైపు హౌరా సిటీలో తలెత్తిన అల్లర్లతో ప్రమేయమున్న పలువురిని అరెస్టు చేసినట్టు రాష్ట్ర పోలీసులు తెలిపారు. హింసకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హెచ్చరించారు. అనుమతి లేని రూట్లలో ఊరేగింపులు తీయడం వల్లే ఘర్షణలు తలెత్తినట్టు ఆమె తెలిపారు.

Updated Date - 2023-04-04T19:07:25+05:30 IST